తెలుగు నానుడి

Sahithi Circle Released By Tirumala Rao - Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

కీర్తిశేషులు అని రాయకుండా పోయిన పెద్దలు అని రాసేవాడు బి.స.బంగారయ్య. తెలుగు మీద అంత పట్టింపు ఆయనకు. తన పేరును కూడా అదే రీతిలో తెలుగీకరణ చేసుకున్నాడు. శ, ష అక్షరాలను రాసేవాడు కాదు. వాటిని ‘స’తో మార్చేవాడు. ఞ, ఙ వచ్చిన చోట సున్నాతో పూరించేవాడు. ఖ, ఘ, ధ, భ లాంటి దీర్ఘ ప్రాణాలను పరిహరించేవాడు. 1965లో ఆయన వెలువరంచిన ‘నుడి–నానుడి’ పుస్తకం గతేడాది జయధీర్‌ తిరుమలరావు సంపాదకుడిగా ‘సాహితీ సర్కిల్‌’ పునర్ముద్రించింది. అందులో నానుడి గురించి బంగారయ్య చెప్పినదాన్లో  కొంత ఇక్కడ:

నానుడిలో రెండు బాగాలు ఉంటాయి.
ఒకటి: నానుడి ఒక జ’నుల యొక్క పాటనను పదిల పరిచే పేటిక. వారి బతుకులను ఆయా కాలాలలో పళించే అద్దము. వారి తాతముత్తాతలు సాదించిన పెంపు ముందుపోకలను, వారు అనుసరించిన అనుబూతులను ఆపోహలను నమోదు చేసి ఉంచే ఒక స్తావరము; అనగా ఆ జా’తి నడకను పోకడను దాచిపెట్టే ఒక బోసాణము. దీనిని చ’రిత అన ఒచ్చును.

రెండు: వారి ఎల్లికాన్ని (destination) తుది గురిని చూపించే ఒక పతకము (plan), ఒక దిట్టము , ఆ జా’తి కోరికలను ఒరవడులను (ideals), వారి ఆస’లను బయాలను సూచిస్తుంది. దీనిని ఊగితి అంటాము. దీని లోనిది ఎంత సాదించ గలిగినారు అనే దానిని పట్టి కొలస్తాము ఆ జా’తి యొక్క ముందుపోకను. ఒక యుగపు నానుడి లోని ఈ రెండో బాగము లోనిది ఎంతవరకు తరువాతి యుగములోని నానుడి యొక్క తొలి బాగములో కనిపిస్తుందో, అంతవరకు ఆ జా’తి ముందుకు సాగింది అని చెప్ప ఒచ్చును. అనగా వారు తమ ముందు ఉంచుకొనిన పతకములో ఎంత సాదించినారు, ఎంత సాదించి దానిని తమ నానుడిలో పదిలపరుచుకొన్నారు, అని ఏది చూపుతుంది వారి ముందుపోకను. అలాటి నానుడిలో నూరేడుకు నూరేడుకు, యుగానికి యుగానికి ఒక పొత్తు, ఒక లంకె, ఒక సాగుదల  (continuity) ఉంటాయి...

ఒక జా’తి తమ జా’తీయ పెరుగుదలలో జరిగిన పెక్కు సంగటనలు, ఆయా కాలాలలో మంది పవుకడలు (aspirations), పోకడలు, కట్టు బొట్టులు, తీరు తెన్నులు, తిండి తిప్పలు, అనువాయిలు ఆచా’రాలు, తమాసాలు తతంగాలు, నాటి లోని సీమలు, పల్లెలు, పట్టణాలు, మనుసులు మతులు (motives) – ఇలాటి వాటిని అన్నిటిని గురించి వారు పెంపొందించుకొనిన నుడిలో, వారు సంతరించుకొనిన కవితా ఆనువాయిలలో, మాట రూపములో గాని రాత రూపములో గాని పదిలపరుచుకొనిందే నానుడి...
ఆర్యులను గురించి గొప్ప ఏకికపు పొత్తాలను రాసిన మా’క్సుముల్లరు జర్మనుడు. ఏ నాడూ ఇండియా మొగము కూడా చూచిన వాడు కాడు. మరి, ఆర్యుల యొక్క పాటన మప్పితాలను గురించి అంత విపులంగా అంత వివరంగా కొన్ని వేల ఏళ్ల తరువాత ఎలా రాయ గలిగినాడు? వారి నానుడిని చూచి, వారి నానుడిని చదివి, వారి నానుడిని పరికించి, వారి నానుడిని పరిసీలించి. ఆర్యుల నానుడి సాజ​​ంగా సాగుదలగా పెరిగిన అట్టిది. గనుక అది వారి జా’తీయ బతుకుకు అద్దము పట్ట గలిగింది. (జ’ వచ్చినప్పుడు చిక్కగా పుక్కిటితో పలకాలి.)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top