మళ్లీ క్రాస్‌రోడ్స్ చదివితే... | sadasiva rao wrote crossroads book | Sakshi
Sakshi News home page

మళ్లీ క్రాస్‌రోడ్స్ చదివితే...

Nov 28 2016 12:18 AM | Updated on Aug 13 2018 7:54 PM

మళ్లీ క్రాస్‌రోడ్స్ చదివితే... - Sakshi

మళ్లీ క్రాస్‌రోడ్స్ చదివితే...

‘మీరు డ్రింక్స్ తాలూకు సువాసననీ... చల్లదనాన్నీ... అవి మీ శరీరంలోకి మెల్లగా ప్రవేశించే విధానంలోని డెలికేట్ ఫీలింగ్‌ని పూర్తిగా ఎంజాయ్ చెయ్యాలి’ అంటాడు

‘మీరు డ్రింక్స్ తాలూకు సువాసననీ... చల్లదనాన్నీ... అవి మీ శరీరంలోకి మెల్లగా ప్రవేశించే విధానంలోని డెలికేట్ ఫీలింగ్‌ని పూర్తిగా ఎంజాయ్ చెయ్యాలి’ అంటాడు నజఫ్ అలీఖాన్ తన కొడుకు, ఇంకా అతని పదిహేనుమంది మిత్రులను ఉద్దేశించి ‘లిక్కర్ లెసన్’ కథలో. ప్రతి కథ అని కాదు కానీ కొన్ని కథలకు ఒక సువాసన వుంటుంది. చల్లదనమో వెచ్చదనమో ఒక గుణం వుంటుంది. అది మీ శరీరంలోకో, మనస్సులోకో, నరనరానికో అలా ఎక్కిపోతుంది. మీ మనసుకు, వుంటే ఆత్మకు హాయినిస్తుంది. దాని కిక్కు చాలాకాలం మనుతుంది కూడా. అది గొప్ప కథ చేసే పని అని నాకనిపిస్తుంది.

ఇరవై సంవత్సరాల క్రితం నేను ఇరవైలలో వున్నప్పుడు చదివిన కథాసంకలనం కె.సదాశివరావు ‘క్రాస్‌రోడ్స్’. ఇరవై సంవత్సరాల లంబీ గ్యాప్ తరువాత ఇప్పుడు కొత్త రూపుతో కొత్తగా చేతికొచ్చింది క్రాస్‌రోడ్స్. నా నలబైలలో ఇప్పుడు ఈ కథలు చదువుతుంటే ఆ ఇరవైల్లోని ఆనందమే మళ్లీ కొత్తగా అందుతోంది. పాత హాయిని జ్ఞప్తికి తెస్తోంది.

సదాశివరావు కథలు మళ్లీ చదువుతుంటే అల్లం శేషగిరిరావును చదువుతున్నంత ఆనందం వేస్తున్నది. మధురాంతకం రాజారాంని చదివినంత హాయిదనం కూడా వేస్తున్నది. ఒక మధ్యలో అయితే భరాగో సరదా సంబరం కూడా. ఆ పై పూర్ణచంద్ర తేజస్వి వాక్యాల వెంట నడిచినంత సునాయాసం కూడా. సంవత్సరానికో, ఆర్నెళ్లకో ఒకే ఒక మంచి కథ కూడా దొరకని కరువుకాలంలో ఈ కథా సంకలనం అంటే థేంక్యూ సదాశివరావుగారు అన్నమాట.
అన్వర్
 
(‘క్రాస్‌రోడ్స్’తో పాటు, కె.సదాశివరావు ఇతర పుస్తకాలు ‘ఆత్మాఫాక్టర్’(సైన్స్ ఫిక్షన్ కథలు), ‘పాలపుంత’ (నోబెల్ సాహిత్య వ్యాసాలు), ‘కావ్యకళ’ (అనువాద కవితలు) కొత్తగా మళ్లీ వచ్చాయి, ‘ఎమెస్కో’ ద్వారా.)

Advertisement
 
Advertisement
Advertisement