అయిగిరి నందిని నందిత మేదిని

Rani Mukerji Mardani 2 Teaser launch - Sakshi

శ్రీ శక్తి

చెడు మీద మంచి గెలిచిన ప్రతిసారీ ఆ గెలుపు వెనుక ఉండే శక్తి.. స్త్రీ!దేశమంతా ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో రోజుకో అలంకారాలతో స్త్రీ శక్తిని కొలుస్తూ ఉన్న ఈ సమయంలో.. సరిగ్గా నవరాత్రులు ఆరంభమైన 29వ తేదీన బాలీవుడ్‌ ఒక శక్తిని టీజర్‌ ద్వారా సాక్షాత్కరింపజేసింది!

ఆ శక్తి.. రాణీ ముఖర్జీ.ఆ సినిమా.. మర్దానీ 2. ఆ టీజర్‌.. ‘అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే..’ స్తోత్రానికి సరిగ్గా సరిపోయే దృశ్యరూపం.  38 సెకన్ల ఆ టీజర్‌లో పోలీస్‌ ఆఫీసర్‌ రాణీ ముఖర్జీ బెల్టు తీసి బాదిపడేసే సన్నివేశం చూస్తే ఈవిల్‌ డెడ్డే..! చెడు చచ్చిందే.శివానీ శివాజీ రాయ్‌ ఆమె పేరు.  అమ్మాయిల్ని వెంటాడేవాళ్ల మోకాళ్లలో బులెట్‌లు దింపుతుంది.అమ్మాయిల్ని వేటాడే కళ్లను వేళ్లతో పైకి పెకిలిస్తుంది.

ఇంత కోపం ఏంటి! ఇంత నిర్దయ ఏంటి! ఇంత క్రౌర్యం ఏంటి! దేవుడంటే కూడా భయం లేదా! భయమా?! దుర్గామాతకు భయం ఉంటుందా?! టీజర్‌ ఎలా మొదలైందో చూడండి. పోలీస్‌ ఆఫీసర్స్‌ టీమ్‌ గన్స్‌తో అలర్ట్‌ అయింది. ఎవర్నో షూట్‌ చేయాలి. ఎవర్నో కాదు. అమ్మాయిల్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠా వెనుక ఉన్న దుష్టశక్తిని. ఎవరా దుష్టశక్తి! ఒకడే ఉంటాడా? మాఫియా లీడర్, పొలిటికల్‌ లీడర్, డిపార్ట్‌మెంట్‌లోనే ఒక పోలీస్‌ లీడర్‌.. అందరూ కలిసిన దుష్టశక్తి.

ఆ దుష్టశక్తిని వెంటాడుతూ ఎన్‌కౌంటర్‌కు సిద్ధమైంది దుర్గా శక్తి.ముందు టీమ్‌. వెనుకే రాణీ ముఖర్జీ.‘‘ఇప్పుడు తాకండ్రా ఒక్క అమ్మాయినైనా’’..!ఆమె ఆగేట్లు లేదు.‘‘ఒంటికి ఒంటిని తాకిచ్చారు కదా. ఇప్పుడు నేను తాకిస్తా మీ ఒంటికి నా ఒంటిని. ఎలా ఉంటుందో చూద్దురు. చెప్పుకోడానికి కూడా మీకు మీ వయసెంతో గుర్తుకు రాదు’’

ఆమె ఆగేట్లు లేదు.
ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. నడుముకు ఉన్న తోలు బెల్టుతో తోలు తీస్తోంది. వాడిలో కదలిక ఉందో చచ్చిందో తెలీదు. రాణీ ముఖర్జీలోని  ల్టు మాత్రం కదులుతూనే ఉంది.టీజర్‌ ఎండ్‌.
సినిమా డిసెంబర్‌ 13న రిలీజ్‌ అవుతోంది. 2014లో వచ్చిన వణుకు పుట్టించే (నేరస్తులకు లెండి) యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మర్దానీ’కి ఇది సీక్వెల్‌. ‘మార్దానీ 2’. రాణీ ముఖర్జీ అందులోనూ పోలీస్‌ ఆఫీసరే, ఇందులోనూ పోలీస్‌ ఆఫీసరే. అందులో ట్రాఫికింగ్, డ్రగ్స్‌ మీద.. ఇందులో అమ్మాయిల మీద చెయ్యేసిన వాళ్ల మీద. కన్నేసిన వాళ్ల మీద.

మర్దానీ అంటే ‘మగతనం’ అని అర్థం.  
నిజంగా మగతనం ఉన్న మగాడెవడూ ఆడపిల్లల్ని అల్లరి పెట్టడు. అమ్మాయిల్ని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించడు. రాణీ ముఖర్జీలో కనిపించే మర్దానీ అలాంటి మగాళ్లకొక సమాధానం. ఒక సవాల్‌.
టీజర్‌లో రాణీ మాటలు వినిపించవు. యాక్షన్‌ మాత్రమే కనిపిస్తుంది. ఈ సినిమాలో రాణి 21 ఏళ్ల విలన్‌తో తలపడుతుంది. ‘యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌’ సంస్థ దీనిని నిర్మిస్తోంది.పోకిరీలకు భయం ఉండాలంటే.. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఇలాంటి ఒక మహిషాసుర మర్దిని ఉండాలి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top