ఆ ప్రొటీన్లతో చిక్కే...!

Proteins, and the implications of that - Sakshi

పరి పరిశోధన

ఆరోగ్యానికి మాంసాహారం మంచిదా? శాకాహారం మంచిదా? అన్న చర్చ చాలాకాలంగా కొనసాగుతున్నదే. కానీ కాలిఫోర్నియా, ఫ్రాన్స్‌ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ద్వారా తేలిందేమిటంటే.. మాంసపు ప్రొటీన్లు హానికారకమైతే, విత్తనాలు, జీడి, బాదం వంటి పప్పుల నుంచి అందే ప్రొటీన్లు గుండెకు మేలు చేస్తాయని! దాదాపు 81 వేల మంది ఆహారపు అలవాట్లు, ఆరోగ్య వివరాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ విషయాన్ని తెలుసుకున్నామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త గ్యారీ ఫేజర్‌ తెలిపారు. పాడి ఉత్పత్తుల ద్వారా అందే కొవ్వు గుండెజబ్బులకు కొంతవరకూ కారణమని ఇప్పటికే తెలిసినప్పటికీ ప్రొటీన్ల పాత్ర ఏమిటన్న విషయంపై స్పష్టత లేని నేపథ్యంలో తాము ఈ అధ్యయనం చేపట్టామని ఆయన చెప్పారు.

దీని ప్రకారం మాంసపు ప్రొటీన్లతో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 60 శాతం ఎక్కువగా ఉండగా.. మొక్కల ఆధారిత ప్రొటీన్ల (బాదం, జీడి, విత్తనాలు వంటివి)తో ఇది గణనీయంగా తగ్గుతుందని వివరించారు. మొక్కల లేదా జంతు ఆధారిత ప్రొటీన్లు అనే రెండేస్థూల వర్గాలుగా కాకుండా తాము మరింత స్పష్టమైన ప్రొటీన్‌ వర్గీకరణ ద్వారా అధ్యయనం చేశామని, తద్వారా తమ ఫలితాలు మరింత కచ్చితమైనవని అంచనా వేస్తున్నట్లు ఫేజర్‌ తెలిపారు. మాంసపు ప్రొటీన్లలో ఉండే కొన్ని రకాల అమినో యాసిడ్లు గుండెపై చూపే ప్రభావం, బీపీ, కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి సమస్యలకు ఏ రకమైన ప్రొటీన్లు కారణమవుతున్నాయి? అన్న అంశాలను తెలుసుకోవాల్సిన అవసరాన్ని తమ అధ్యయనం కల్పించిందని ఫేజర్‌ వివరించారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top