లాక్‌డౌన్‌ కవిత : నా రెక్కలు జాగ్రత్త

Prasada Murthy Poem On Lockdown - Sakshi

నా రెక్కల్ని నగరానికి తగిలించి
ఇంటికి వెళ్తున్నా
కాస్త కనిపెట్టుకోండి
అష్టకష్టాల కష్టనష్టాల రెక్కలివి
మీ కస్టడీలో వుంచి పోతున్నా
కాస్త భద్రంగా చూసుకోండి

నగరం  దీపాలు పొలమారినప్పుడు
నా రెక్కలు మినుకు మినుకుమని మూలుగుతాయి
అంతస్తుకో ఆకాశం...
ఆకాశానికో కన్నుతో ఈ భవంతులు నన్ను కలవరిస్తే
నా రెక్కలు  పలకరింపుగా సిమెంటు చిలకరిస్తాయి
నగరం నడిరోడ్డు పేగు కనలి కేక వేస్తే
నా రెక్కలు నులిపెట్టే బాధతో తారు కక్కుకుంటాయి
నా రోజువారీ ప్రసవ గీతం ఈ నగరం
అది బెంగటిల్లితే నా రెక్కలు బిక్కుబిక్కున వణికిపోతాయి

నా రెక్కల్ని మీ చేతుల్లో పెట్టి పోతున్నా
జాగ్రత్త సుమా
మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తానో తెలీదు
అసలు వస్తానో రానో కూడా తెలీదు

తాళం వేసిన నగరం  ముందు
కొత్త ఉద్యోగాల దరఖాస్తులు పట్టుకుని
అనేకానేక ఆత్మల అస్థి పంజరాలు
క్యూలు కట్టిన చోట
నా రెక్కలు టపటపా కొట్టుకుంటాయి
భద్రం మరి

ప్రస్తుతానికి వెళ్ళిపోతున్నాను
ఇంటి కాడ అమ్మా నాయినా
ఇంకా బతికే వున్నారన్న భరోసాతో పోతున్నా
మళ్ళీ ఈ నగరాన్ని నా రెక్కలతో దుమ్ము దులిపి
శుభ్రం చేసి పట్టాలెక్కించడానికి తప్పకుండా వస్తా
ఈ మెట్రో రైళ్ళు, ఈ రెస్టారెంట్లు, ఈ సినిమా హాళ్లు
నా దేహ శ్వాస కోసం అలమటిస్తే
నేను వస్తానని నమ్మకం పలకండి
 
నా రెక్కల్ని మీ చేతుల్లో పెట్టి సెలవు తీసుకుంటున్నా
మీదే పూచీ మరి
- ప్రసాదమూర్తి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top