ఎవరెస్ట్ అంచున పూజ

 Pooja Hegde And Mahesh babu Telugu film Maharshi - Sakshi

కెరీర్‌ పీక్‌లో ఉంది.హిమంతో కట్టిన సినీ ఆలయంలో పూజలందుకుంటున్న స్టార్‌ దేవత పూజా హెగ్డే.అక్కడిదాకా ఎలా వెళ్లావ్‌?ఇక్కడ్నుంచి ఎక్కడికి వెళతావ్‌?అని అడిగితే...నేను రాలేదు.. నేను వెళ్లలేదు..నేను ఉన్నాను.. అంతే.భయం లేకుండా ఉన్నాను.ఓర్పుగా ఉన్నాను.టాలెంట్‌ని నమ్మాను అంటోంది పూజా హెగ్డే.

‘డీజే’ తర్వాత మీ కెరీర్‌ పీక్స్‌లో ఉంది. అన్నీ పెద్ద సినిమాలే చేస్తున్నారు. ఎలా అనిపిస్తోంది?
పూజ: చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ముఖ్యంగా ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రలు చేయడం చాలా  ఉత్సాహంగా ఉంది. మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమాని ఈ మధ్యే పూర్తి చేశాను. ప్రభాస్‌తో పీరియాడికల్‌ మూవీ చేస్తున్నాను.

అల్లు అర్జున్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ సినిమాలో మీరే కథానాయిక కదా?
అవును. అయితే దాని గురించి ఇప్పుడేం చెప్పలేను. మళ్లీ మాట్లాడదాం.

అన్నీ పెద్ద సినిమాలే చేస్తున్నారు.. పెద్దవి కాబట్టి  ఓకే అంటున్నారా? మీ పాత్ర కూడా బాగుండాలనుకుంటారా?
ఒక్కో సినిమాకు ఒక్కోవిధంగా ఉంటుంది. అన్ని సినిమాలను ఒకేవిధంగా ఎంపిక చేసుకోలేం. కొన్ని సినిమాలు క్యారెక్టర్‌ వల్ల అంగీకరిస్తాను. ఇంకొన్ని సినిమాలు దర్శకుడి వల్ల కూడా ఒప్పుకుంటాను. కొన్ని సినిమాలను హీరోలను దృష్టిలో పెట్టుకుంటాను. మంచి దర్శకుడు–హీరో సినిమాలో ఒకవేళ నా క్యారెక్టర్‌ లెంగ్త్‌ అరగంటే అనుకోండి.. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే అలాంటి కాంబినేషన్‌లో వచ్చే సినిమాల్లో రోల్‌ తక్కువ ఉన్నప్పటికీ ఇంపాక్ట్‌ ఎక్కువ ఉంటుంది.
 
ఓకే.. అనగనగా అరవిందట తన పేరు.. అందానికి సొంతూరు పాటను కొంచెం మార్చి అనగనగా పూజట తన పేరు.. తనెలాంటి అమ్మాయి అంటే..?
(నవ్వుతూ) పూజ ఎలాంటి అమ్మాయి అంటే.. సింపుల్‌గా చెప్పాలంటే.. ‘ధైర్యవంతురాలు’. టామ్‌బాయ్‌ టైప్‌. కెరీర్‌ జర్నీ పరంగా ఇంకా స్టార్టింగ్‌ స్టేజ్‌లోనే ఉన్నాను. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కెరీర్‌ విషయంలో ఉండే సహజమైన భయాలు ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకోకుండా కెరీర్‌ జర్నీ కొనసాగించడమే. 

మరి.. ఈ ధైర్యవంతురాలకి కోపం ఎక్కువ ఉంటుందా?
కోపమనేది తప్పు కాదనుకుంటాను. అప్పుడప్పుడు కోప్పడటం మంచిదే. జనరల్‌గా కోపాన్ని తప్పుగా ఊహించుకుంటాం అయితే ఎప్పుడు కోపగించుకోవాలో తెలియాలి. చీటికీ మాటికీ కోపం తెచ్చుకుంటే ఆ కోపానికి అర్థం ఉండదు. నా కోపానికి తగిన కారణం ఉంటుంది.

సాధారణ అమ్మాయి నుంచి హీరోయిన్‌గా, హీరోయిన్‌ నుంచి స్టార్‌గా.. ఆర్టిస్ట్‌గా ఈ నాలుగేళ్లలో ఏం నేర్చుకున్నారు?
నేను స్టార్‌ అదీ ఇదీ అని ఏదో గొప్పగా ఫీల్‌ అవ్వను. నార్మల్‌ అమ్మాయిలానే ఫీల్‌ అవుతాను. ఈ ఐదేళ్లల్లో నేను తెలుసుకున్నదేంటంటే... ఆర్టిస్ట్‌గా కంటిన్యూ కావాలంటే చాలా సహనం కావాలి. అసలు ఈ ప్రపంచంలో బతకడానికి చాలా ముఖ్యమైంది అదే అనుకుంటా. ఇక నా ప్రొఫెషన్‌ విషయానికి వస్తే.. ‘ఓర్పు’ అనేది చాలా చాలా ముఖ్యం. మేకప్‌ చేసుకోవాలి. ప్రతి షాట్‌కి మధ్య గ్యాప్‌.. లొకేషన్‌లో వేరే ఆర్టిస్టుల కాంబినేషన్‌ సీన్స్‌ తీసేటప్పుడు షాట్‌కి వెయిటింగ్, మేకప్‌... ఇలా ప్రతి దాని ముందు చాలా వెయిటింగ్‌ ఉంటుంది. ఆ వెయిటింగ్‌ని తట్టుకోవాలి. 

కొందరిని మినహాయిస్తే చాలామంది అమ్మాయిలకు మేకప్‌ అంటే శ్రద్ధ ఎక్కువ. మరి మీకు?
కాలేజ్‌ రోజుల్లో నేను టామ్‌బాయ్‌ని. అలాంటి అమ్మాయిలు నాకు తెలిసి మేకప్‌కి దూరంగా ఉంటారు. నా చిన్నప్పుడు నేను మేకప్‌ వాడలేదు. పెద్దయ్యాక కూడా అంతే. అందుకే హీరోయిన్‌ అయ్యాక స్టార్టింగ్‌లో కొంచెం కష్టంగా అనిపించేది. కానీ ఇప్పుడు అలవాటు పడిపోయాను. షూటింగ్‌ లేనప్పుడు మేకప్‌ వేసుకోను. 

ఒకవేళ ఏదైనా పాత్ర మేకప్‌ కోసం నాలుగైదు గంటలు మేకప్‌ చైర్‌లో కూర్చోవాల్సి వస్తే? 
తప్పకుండా. ఇందాక చెప్పినట్టు సహనం ముఖ్యం. అది ఉంటే ఈజీగా చేసేయొచ్చు. పైగా ప్రొఫెషన్‌ కోసం చెయ్యాలి.

స్టార్‌గా మారాక మీ లైఫ్‌లో వచిన మార్పులేంటి?
పెద్ద మార్పులేం లేవు. మా పేరెంట్స్‌ నన్ను చాలా నార్మల్‌గా పెంచారు. అది చాలా ఉపయోగపడింది. ఇండస్ట్రీ నన్ను ఎఫెక్ట్‌ చేసిందనుకోను. అప్పటిలానే ఉన్నాను. బయటకు వెళ్తే గుర్తుపడతారు. మనకు ప్రైవేట్‌ స్పేస్‌ ఉండదనే డౌన్‌ సైడ్‌ తప్పితే ఏం తేడా లేదు. 

బయటకు వెళ్లినప్పుడు స్వీట్‌ ఫ్యాన్స్‌ ఎదురుపడతారు, ఇబ్బంది పెట్టేవాళ్లూ  ఉంటారు. ఇబ్బంది పెట్టే వాళ్ల గురించి?
కొందరు దగ్గరకు వచ్చేస్తారు. మీద పడిపోతారు.  అదంతా యాక్టర్స్‌ మీద ఉన్న అభిమానమే అని అనుకుంటాను. సినిమాల మీద ప్రేమే. తెలుగు ప్రేక్షకుల్లో నాకు బాగా నచ్చేది అదే. సినిమాను బాగా ప్రేమిస్తారు. మమ్మల్ని చాలా స్పెషల్‌గా ట్రీట్‌ చేస్తారు. స్క్రీన్‌ మీద చూసినప్పుడు అరుస్తారు. మమ్మల్ని బయట చూసినప్పుడు మాతో ఫోటో దిగాలనుకుంటారు. టచ్‌ చేయాలనుకుంటారు. కొన్నిసార్లు టూమచ్‌ అవుతుంది. బట్‌ అదంతా ప్రేమాభిమానాల వల్లే అని అర్థం చేసుకోగలగాలి. 

స్క్రీన్‌ మీద మిమ్మల్ని చూసి ఫ్యాన్స్‌ అరుస్తారు, విజిల్స్‌ వేస్తారు. మీరు ఎవరి కోసమైనా విజిల్స్, అరవడం లాంటివి చేసిన సందర్భాలు?
నేనంత స్టార్‌స్టక్‌ కాదు. చిన్నప్పుడు అలా చేయలేదు. ఫ్యాన్‌గాళ్‌గా అనిపించిన మూమెంట్‌ రాహుల్‌ ద్రావిడ్‌ని కలిసినప్పుడు మాత్రమే. 

రాహుల్‌ ద్రావిడ్‌ ఇష్టమన్నారు. క్రికెట్‌ను ఫాలో అవుతారా? చిన్నప్పుడు ఆడేవారా?
క్రికెట్‌ బాగానే ఫాలో అవుతాను. కానీ చిన్నతనంలో ఎప్పుడూ ఆడిన సందర్భాలు లేవు.

ఏ స్పోర్ట్స్‌లో ఎక్కువ పార్టిసిపేట్‌ చేసేవారు? 
నేను స్కూలింగ్‌లో బ్యాడ్‌.. పీటీ (ఫిజికల్‌ ట్రైనింగ్‌) పిరియడ్‌ అంటే చాలు పరిగెత్తేదాన్ని. బాస్కెట్‌ బాల్‌ ఆడినట్టు గుర్తు. 

స్కూల్‌లో కల్చరల్‌ యాక్టివిటీస్‌లో పాల్గొనేవారా? 
అస్సలు లేదు. నాకు చాలా సిగ్గు. యాన్యువల్‌ డే అంటే స్కిప్‌. స్కూల్‌లో అంతమంది ముందు పర్ఫామ్‌ చేయడమా? వామ్మో అనుకునేదాన్ని. అందుకే స్కిప్‌ కొట్టేదాన్ని.

యాక్టర్‌ అయ్యాక సుమారు 100 మందికి పైనే సెట్లో ఉంటారు. వాళ్ల ముందు యాక్ట్‌ చేయాలి. ఆ సిగ్గుని ఎలా దాటేశారు?
నిజానికి కాలేజ్‌ టైమ్‌లోనే స్టేజ్‌ ఫియర్‌ పోగొట్టుకునే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు కూడా ఆ ప్రయత్నం చేశాను. బిడియం అనేది ఒక్క రోజులో పోగొట్టుకున్నది కాదు. ప్రయత్నించీ.. ప్రయత్నించీ.. చివరికి పోగొట్టగలిగా.

మీ ఫస్ట్‌ డే షూటింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని గుర్తు చేసుకుంటారా?
హో.. చాలా టెన్షన్‌ ఫీల్‌ అయ్యాను. తమిళ సినిమా ‘ముగముడి’ ద్వారా పరిచయం అయ్యాను. కెమెరా ముందుకెళ్లి నా డైలాగ్స్‌ అన్నీ టకటకమని అప్పజెప్పినట్టు చెప్పేసి వచ్చాను. అప్పుడు నా కోస్టార్‌ జీవా ‘డైలాగ్స్‌ అంత ఫాస్ట్‌గా కాదు.. కొంచెం టైమ్‌ ఇచ్చి మెల్లిగా చెప్పాలి’ అన్నారు. అలా అప్పటినుంచి ఇప్పటివరకూ రోజూ ఏదొకటి నేర్చుకుంటూనే ఉన్నాను. 

రొమాంటిక్‌ సీన్స్‌కి ఇబ్బంది పడతారా?
ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో పెద్దగా రొమాంటిక్‌ సన్నివేశాలేం లేవు. అయినా రొమాంటిక్‌ సీన్, డైలాగ్స్‌ సీన్‌.. ఏదైనా ఒకటే. పార్ట్‌ ఆఫ్‌ ది ప్రొఫెషన్‌. రొమాంటిక్‌ సీన్స్‌ని మనసుకు తీసుకుని చెయ్యం కదా. టెక్నికల్‌ థింగ్‌.. అంతే.

ఫైనల్లీ... మీ అప్‌కమింగ్‌ ప్రాజెక్ట్స్‌ గురించి?
‘మహర్షి’ అద్భుతంగా వచ్చింది. సినిమా రిలీజ్‌ కోసం ఎగై్జటెడ్‌గా ఎదురు చూస్తున్నాను. మరిన్ని ఎగై్జటింగ్‌ ప్రాజెక్ట్స్‌లో కనిపిస్తా.
డి.జి.భవాని

తమిళ్‌ నుంచి తెలుగుకి.. ఆ తర్వాత హిందీ సినిమాలకు.. భాషలు వేరు. ఇంకా ఏమైనా వ్యత్యాసాలున్నాయా?
భాష ఒక్కటే వేరు. అయితే మనుషులంతా ఒకటే. షూటింగ్‌ అట్మాస్ఫియర్‌ కూడా సేమ్‌ టు సేమ్‌. అయితే సౌత్‌ స్క్రీన్‌ మీద హీరోయిన్లు కనిపించే తీరు వేరు.. నార్త్‌ స్క్రీన్‌ మీద వేరు. ఇక్కడికి తగ్గట్టుగా మా పాత్రలు ఉంటాయి. అక్కడికి తగ్గట్టుగా అక్కడి హీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్‌ని డిజైన్‌ చేస్తారు. ఫిల్మ్‌ మేకింగ్‌లో కొంచెం తేడా ఉంటుంది. అంతే తప్ప పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు.

మీరు అందానికి సొంతూరు అంటే అతిశయోక్తి కాదు.. మరి అందం గురించి ఎలాంటి కేర్‌ తీసుకుంటారు?
‘ఇలా చేస్తాను’ అని పర్టిక్యులర్‌గా చెప్పడానికి ఏమీ లేదు. నిజానికి నేను బద్ధకస్తురాలిని. అయితే ఎంత బద్ధకమైనా ఒక్క పని మాత్రం చేస్తాను. అదేంటంటే.. నిద్రపోయే ముందు మేకప్‌ తీయడం. అలాగే ఎక్కువగా నీళ్లు తాగుతాను. 

యాక్టర్‌ అంటే హిట్స్‌ ఉంటాయి... ఫ్లాప్స్‌ ఉంటాయి. ఫ్లాప్స్‌ని ఎలా తీసుకుంటారు? 
ఫస్ట్‌ సినిమా నుంచి ఇప్పటివరకూ నేనే పాత్ర చేసినా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. యాక్టర్‌గా పూజా కరెక్ట్‌గా చేయలేదు అనే నెగటివ్‌ రివ్యూ చదవలేదు. సినిమా రిజల్ట్‌ మన చేతుల్లో ఉండదు. మనం డిసైడ్‌ చేయలేం. అన్ని సినిమాలు బాగా ఆడాలనుకుంటాం. అలా జరగదు. మన చేతుల్లో లేని దాని గురించి మనం ఏం చెయ్యగలం? అందుకే ఫ్లాప్‌ అనేది నన్ను పెద్దగా ఎఫెక్ట్‌ చేయదు.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top