గెలుపు హింస

A person involved in the claim that buddha - Sakshi

చెట్టు నీడ

ఒకసారి బుద్ధునితో ఒక వ్యక్తి వాదానికి దిగాడు. వాదం చివరి దశకు వచ్చింది. అవతలి వ్యక్తి ఓటమి అంచుల దాకా వచ్చాడు. అలాంటి సమయంలో.. ‘‘నేనీ వాదన నుంచి విరమించుకుంటున్నాను’’అని ప్రకటించి వెళ్లిపోయాడు బుద్ధుడు. బుద్ధుని పక్కనే ఉన్న భిక్షువులే కాదు, ప్రత్యర్థి కూడా ఆశ్చర్యపోయాడు. గెలుస్తానని తెలిసి కూడా బుద్ధుడు అలా ఎందుకు విరమించుకున్నాడో వారెవరికీ అర్థం కాలేదు. అప్పుడు ఆ వ్యక్తి బుద్ధుని దగ్గరకు వెళ్లి ‘‘గౌతమా! నేను ఓడిపోతానని తెలిసి కూడా నీవెందుకు మధ్యలోనే లేచి వచ్చావు?’’అని అడిగాడు. మిగిలిన భిక్షువులు కూడా అలాగే అడిగారు.. ‘‘భగవాన్‌ గెలుపును ఎందుకు తోసిపుచ్చారు?’’అని. 

అప్పుడు బుద్ధుడు ఇలా చెప్పాడు. ‘‘నేను ఇలా విరమించుకోవడానికి మూడు కారణాలున్నాయి. ఒకటి: ఇప్పటికి ప్రత్యర్థికి నన్ను ఓడించే జ్ఞానశక్తి లేకపోవచ్చు. రెండు: నేను ఇప్పుడు వాదించిన విషయం కూడా రేపు కార్యాచరణలో మరిన్ని మార్పులు తీసుకోవచ్చు. దేన్నీ ‘ఇదే అంతిమ లక్ష్యం’ అని తేల్చలేం. ఇప్పుడు నేను గెలుపును అందుకున్నానంటే అది అంతిమ సత్యమై ఉండాలి. అంతిమ సత్యం కాని దాన్ని పట్టుకుని ఎలా గెలుపును సొంతం చేసుకోగలం? ఇక మూడు: ఒక అంతిమ సత్యం కాని దానితో నేను గెలిచాను అంటే.. అవతలి వ్యక్తిని నేను సత్యం కాని దానితో ఓడించినట్టే. అలా ఓడిన వ్యక్తి మనసు గాయమవుతుంది. ఓటమి వల్ల సిగ్గు చెందుతాడు. దుఃఖపడతాడు. ఒక వ్యక్తిని గెలుపు పేరుతో ఇలా ఓడించడం కూడా హింసే అవుతుంది’’ అని చెప్పాడు. బుద్ధుని విశాల దృక్పథానికి భిక్షువులతోపాటు ప్రత్యర్థి కూడా ప్రణమిల్లాడు. 
– బొర్రా గోవర్ధన్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top