రెండు రాళ్లు

People met a day and decided to build a temple - Sakshi

చెట్టు నీడ

అందరూ కలిసి ఆ బండరాళ్ల వద్దకు వచ్చారు. వాటిని చూసి సంతృప్తి చెంది, రేపు మళ్లీ వచ్చి వాటిని తరలిద్దామని చెప్పుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు.

అదొక అడవి. అక్కడ రెండు పెద్ద బండరాళ్లు చాలాకాలంగా ఉంటున్నాయి. ఒకే చోట ఏళ్ల తరబడి ఉంటూ ఉండటంతో వాటికి విసుగు పుట్టింది. మనం ఇక్కడి నుంచి ఎప్పటికైనా ఎటైనా పోగలమా అని లోలోపల బాధ పడ్డాయి. ఆ అడవికి సమీపంలో ఓ నగరం ఉంది. ఆ ఊరి ప్రజలు ఓ రోజు సమావేశమై ఓ ఆలయం కట్టాలని తీర్మానించుకున్నారు. కొత్తగా నిర్మించదలచిన ఆలయానికి మూల విరాట్టు, మరికొన్ని దేవతా విగ్రహాలను చెక్కించడానికి శిల్పులను నియమించారు. వారిలో ఓ శిల్పి బండరాళ్లను వెదుకుతూ ఈ రెండురాళ్లను చూశాడు. వెంటనే అతను వెళ్లి తన తోటి శిల్పులకు వీటి గురించి చెప్పాడు. అందరూ కలిసి ఆ బండరాళ్ల వద్దకు వచ్చారు. వాటిని చూసి సంతృప్తి చెంది, రేపు మళ్లీ వచ్చి వాటిని తరలిద్దామని చెప్పుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు. అది చూసి ‘‘అమ్మయ్య ఇంతకాలానికి మనకీ అడవి నుంచి విముక్తి కలగబోతోంది. నా కల నెరవేరబోతోంది’’ అని సంబరపడింది ఒక రాయి.

‘‘వాళ్లు నన్ను తీసుకువెళ్లి ఉలితో చెక్కి చెక్కి శిల్పాలుగా తయారు చేస్తారు.. నేను భరించలేనా దెబ్బలను. రేపు ఆ శిల్పులు వచ్చేసరికి నేను ఇక్కడే మరింత లోతుగా పాతుకుపోతాను’’ అనుకుంది రెండో రాయి. తెల్లవారింది. మరుసటి రోజు శిల్పులు మళ్లీ ఈ రాళ్లున్న చోటుకి చేరుకున్నారు. మొదటి భారీ రాయిని అందరూ కలిసి ఓ వాహనం మీదకు ఎక్కించారు. రెండోరాతిని అంగుళం కూడా కదల్చలేకపోయారు. దాంతో వారు దాన్ని అక్కడే విడిచిపెట్టి, ఉన్న ఒక్క రాతితోనే నగరానికి చేరుకున్నారు.శిల్పులు ఆ మొదటి రాతితో అందమైన విగ్రహాలు చెక్కారు. శిల్పుల ఉలి దెబ్బలను నిగ్రహంతో భరించి విగ్రహాలుగా మారిన ఆ రాతిని ఊరి ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించారు. ఆరాధించారు. నగరంలోకి రానని భీష్మించుకుని ఉండిపోయిన రెండోరాయి అడవిలోనే ఉండి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ్త అక్కడే ఎల్లకాలమూ మిగిలిపోయింది. 
(జెన్‌ కథ)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top