మేడ మీద ము‘నగ’!

Organic crops cultivated Dung tree - Sakshi

టెర్రస్‌పైన సేంద్రియ ఇంటిపంటలు

ఇంటిపైన షేడ్‌నెట్‌ వల్ల 3–4 డిగ్రీలు తక్కువగా ఇంటి ఉష్ణోగ్రత

ఇంటి పంట

హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌ ఎస్‌.బి.ఐ. కాలనీలో రెండంతస్థుల సొంత భవనంలో నివాసం ఉంటున్న అర్చన, ఫార్మా ఉద్యోగి అరవింద్‌కుమార్‌ దంపతులు గత ఐదారేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకుంటున్నారు. ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీపై సిల్పాలిన్‌ బెడ్స్‌ తీసుకొని టమాటా, వంకాయలు, అల్లంతోపాటు మునగ, బొప్పాయి చెట్లను పెంచుతున్నారు. పార్స్‌లీ, ఆరెగానో, తులసి, లెమన్‌గ్రాస్, కలబంద తదితర ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. పెద్ద సిల్పాలిన్‌ బెడ్‌లో నాలుగేళ్లుగా ఎత్తుగా పెరిగిన మునగ చెట్టు వీరి కిచెన్‌ గార్డెన్‌కు తలమానికంగా నిలిచింది.

మునగ కాయలతోపాటు ఆకులను కూడా కూరవండుకుంటున్నామని అర్చన తెలిపారు. ఉల్లి, వెల్లుల్లి వాడకుండా పార్స్‌లీ, ఆరెగానో తదితర ఆకులను ఉపయోగించి ఇంట్లోనే పిజ్జాలు తయారుచేసుకొని తింటుండడం విశేషం. 30 ఏళ్ల నాటి ఈ రెండంతస్థుల భవనానికి పిల్లర్లు వేయలేదు. గోడలపైనే నిర్మించారు. అందువల్ల గోడలపైనే 8 సిల్పాలిన్‌ బెడ్స్, కుండీలను ఏర్పాటు చేసుకొని ఐదారేళ్లుగా ఇంటిపంటలను సాగు చేసుకుంటున్నారు.

15 రోజులకోసారి జీవామృతం మొక్కలకు మట్టి ద్వారా, పిచికారీ ద్వారా కూడా ఇస్తున్నారు. రోజూ దేశీ ఆవుపాలు సరఫరా చేసే వ్యక్తే జీవామృతాన్ని సైతం ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మేడపైనే ఒక సిల్పాలిన్‌ బెడ్‌ను కంపోస్టు తయారీకి వాడుతున్నారు. టెర్రస్‌పైన ఇంటిపంటలు, షేడ్‌నెట్, ఇంటి చుట్టూ వెదురు తదితర మొక్కలు ఉండటం వల్ల తమ ఇంట్లో వేసవిలోనూ ఉష్ణోగ్రత 3–4 డిగ్రీల మేరకు సాధారణం కన్నా తక్కువగా ఉంటున్నదని అర్చన(98663 63723) సంతోషంగా చెప్పారు. అంటే.. ఇంటిపంటల కోసం శ్రద్ధతీసుకుంటే.. ఆరోగ్యంతోపాటు ఇంటి ఏసీ ఖర్చులు కూడా తగ్గాయన్నమాట!

మునగాకు చిన్న – పోషకాలలో మిన్న
మునగను తింటే అనేక పోషకాలను పుష్కలంగా తిన్నట్టే లెక్క. ఇదీ మునగ ఆకులో నిక్షిప్తమై ఉన్న పోషకాల జాబితా..
  విటమిన్‌–సి: కమలాల్లో కన్నా 7 రెట్లు ఎక్కువ
  విటమిన్‌–ఎ: క్యారెట్లలో కన్నా 4 రెట్లు ఎక్కువ
  కాల్షియం: పాలలో కన్నా 4 రెట్లు ఎక్కువ
  పొటాషియం: అరటి పండ్లలో కన్నా 3 రెట్లు ఎక్కువ
  విటమిన్‌–ఇ: పాలకూరలో కన్నా 3 రెట్లు ఎక్కువ
  మాంసకృత్తులు: పెరుగులో కంటే 2 రెట్లు ఎక్కువ
  మునగాకును పప్పులో, సాంబారులో వేసి వండవచ్చు.

  మునగాకు వేపుడు చేయవచ్చు.
  మునగకాయలో కంటే ఆకుల్లో పోషకాలు ఎక్కువ

మునగ పొడి చేసేదెలా?
► తయారు చేయటం తేలిక – వాడటం తేలిక
► లేత మునగాకును కడిగి, నీడలో ఆరబెట్టాలి
► గలగలలాడేలా ఆరిన మునగాకును పొడి చెయ్యాలి
► పొయ్యి మీద నుంచి దించిన తరువాత కూరలు, చారు వంటి వాటిల్లో వేయచ్చు.

మునగలో ఉపయోగపడని భాగం లేదు
ఆకులు – కూర, పోషకాల గని
గింజ – మందు, నూనె, నీటి శుద్ధి
కాయ – కూర    పువ్వు – మందు, చట్నీ
బెరడు – మందు    బంక – మందు
వేరు – మందు

పెరటిలో మునగ చెట్టు ఉండగ – విటమిన్లు, టానిక్కులు కొనటం దండగ.
మునగ చెట్లు పెంచుదాం – మునగాకు వాడకం పెంచుదాం.

వివరాలకు..
కేరింగ్‌ సిటిజెన్స్‌ కలెక్టివ్‌(040–27610963)

ఫొటోలు: ఇసుకపట్ల దేవేంద్ర, సాక్షి ఫొటో జర్నలిస్టు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top