ఆపరేషన్‌ కేలా మీలర్‌

Operation Kayla Jean Mueller Special Story In Sakshi Family

చీకటిలోనూ వెలుగును చూస్తున్నాను. నిర్బంధంలోనూ స్వేచ్ఛను కనుగొంటున్నాను. ప్రతి ప్రతికూలతలోనూ ఒక అనుకూలత ఉంటుంది. – కేలా మీలర్‌
నాలుగేళ్ల క్రితం ఐసిస్‌ చిత్ర హింసలకు బలైన మానవతావాది ‘కేలా మీలర్‌’ పేరిట ఐసిస్‌ ఉగ్రనేతను హతమార్చే ఆపరేషన్‌ను చేపట్టి, అతడిని తుదముట్టించడం ద్వారా అగ్రరాజ్యం తన పౌరురాలికి ఘనమైన నివాళిని అర్పించింది. 

సిరియాలోని అలెప్పో ప్రాంతంలో ఉన్న ఒక ఆసుపత్రిని సందర్శించేందుకు 2013 ఆగస్టులో టర్కీ నుంచి బయల్దేరిన ఒక అమెరికన్‌ యువతి ఆ తర్వాత ఎవరికీ కనిపించలేదు! ఆ ఆసుపత్రిలో ఉన్నది ఐసిస్‌ ఉగ్రవాదుల బారినపడిన శరణార్థి క్షతగాత్రులు. వారితో మాట్లాడి, వారికి సేవలు అందించడం కోసం వేల మైళ్ల దూరం ప్రయాణించి వెళ్లిన ఆ యువతి పేరు కేలా మీలర్‌. యు.ఎస్‌.లోని ఆరిజోనా రాష్ట్రం ఆమెది. సామాజిక కార్యకర్త. అంతకన్నా కూడా మానవతా వాది. మీలర్‌ అదృశ్యంపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆనాడే ఆందోళన వ్యక్తం చేసింది. రెండేళ్లు గడిచినా మీలర్‌ ఆనవాళ్ల జాడ కనిపించకపోవడంతో ఐసిస్‌ ఉగ్రవాదులే ఆమెను అపహరించి ఉంటారని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు వ్యక్తం చేసిన అనుమానాలే చివరికి నిజమయ్యాయి. ఐసిస్‌ నిర్బంధంలో ఉన్న మీలర్‌ చనిపోయిందన్న వార్త 2015 ఫిబ్రవరిలో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

కాలేజీ విద్యార్థినిగా కేలా మీలర్‌ 

అయితే రఖా పట్టణంపై జోర్డాన్‌ జరిపిన వైమానిక బాంబు దాడుల్లో మీలర్‌ చనిపోయినట్లు ఐసిస్‌ ఒక ప్రకటన చేసింది! తర్వాత బయటపడిన వాస్తవం వేరు. మీలర్‌ను చేత చిక్కించుకున్న ఐసిస్‌ ఉగ్రవాద నాయకుడు అబూ బకర్‌ అల్‌ బాగ్దాదీ ఆమెపై పలుమార్లు అత్యాచారం జరిపి, అనేక విధాలుగా చిత్రహింసలు పెట్టి చివరికి హత్య చేశాడు. ఈ క్రమంలో నాలుగున్నర ఏళ్ల తర్వాత మొన్న శనివారం రాత్రి సిరియాలోని బారిషా అనే గ్రామంలో అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు జరిపిన దాడుల్లో అల్‌ బాగ్దాదీ హతమయ్యాడు. ఈ ఆపరేషన్‌కు అమెరికా పెట్టిన పేరు ‘కేలా మీలర్‌’. అలా తన దేశ పౌరురాలికి అగ్రరాజ్యం నివాళి అర్పించింది. నివాళి అనేకన్నా కేలా ఆత్మగౌరవానికి సైనిక వందనం చేసిందనే అనాలి. 

అల్‌ బాగ్దాదీ హతమైనట్లు వెల్లడవగానే ప్రపంచ మీడియా కేలా మీలర్‌ తండ్రి కార్ల్‌ను కలిసింది. ‘‘నా కూతుర్ని కిడ్నాప్‌ చేశారు. బందీగా అనేక జైళ్లు తిప్పారు. నిర్బంధ శిబిరాల్లో ఉంచారు. మానసికంగా, శారీరకంగా అవమానించారు. చివరికి అల్‌ బాగ్దాదీ అత్యాచారం కూడా చేశాడు. ఏ తల్లిదండ్రులకూ ఇంతటి మానసిక క్షోభ ఉండకూడదు’’ అని ఆయన అన్నారు. బందీగా ఉండి కూడా ఎంతో ధైర్యంగా తన కూతురు రాసిన ఉత్తరాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘చీకటిలోనూ వెలుగును చూస్తున్నాను. నిర్బంధంలోనూ స్వేచ్ఛను కనుగొంటున్నాను. ప్రతి ప్రతికూలతలోనూ ఒక అనుకూలత ఉంటుంది’’ అని కేలా మీలర్‌ ఆ లేఖలో రాశారు.

కేలా తల్లి మార్షా కూతురి మరణం నుంచి నేటికీ తేరుకోలేదు. ‘‘నిజంగా నా కూతురుకి ఏమైందో నాకు తెలియాలి’’ అంటూనే ఉన్నారు. కేలా దైవభక్తురాలు. చనిపోయే వరకు కూడా ఆ దేవుడు పంపిన దూతగానే ఆమె శరణార్థులకు సేవలు అందించారు. ‘డాక్టర్స్‌ వితవుట్‌ బార్డర్స్‌’ (జెనీవా) ఆసుపత్రి సిరియా శాఖ నుంచి ఆమె అడుగు బయటపెట్టిన కొద్దిసేపటికే ఐసిస్‌ ఉగ్రవాదులకు çపట్టుబడ్డారు. కేలా మీలర్‌ మానవ హక్కుల కార్యకర్తగా మారడానికి పొలిటì కల్‌ సైన్స్‌లో ఆమె చేసిన డిగ్రీ, కాలేజీ విద్యార్థినిగా ఆమె నిర్వహించిన చర్చి విధులు దోహదపడ్డాయని అంటారు. 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top