పోలీస్‌.. డాక్టర్‌

Nashik Women Police Doing Double Duty in Lockdown - Sakshi

కరోనా వారియర్‌ / ఆర్తి సింగ్‌

లాక్‌డౌన్‌ సమయంలో లాంగ్‌ డ్యూటీ చేస్తున్న నాసిక్‌ పోలీసులు విధులను నిర్వర్తిస్తూనే ఆరోగ్యరీత్యా తమకేమీ భయం లేదని భరోసాతో రిలాక్స్‌ అవుతున్నారు. దీనికి కారణం తమ టీమ్‌ కెప్టెన్‌ ఆర్తిసింగ్‌. పోలీసాఫీసర్‌గా మాత్రమే కాదు వారందరి ఆరోగ్యాలను సంరక్షించే వైద్యురాలు కూడా. అదెలా..? ఒక పోలీసాఫీసర్‌ వైద్యురాలు అవడం ఏంటి.. అనే సందేహం రాకమానదు. కానీ, ఆర్తిసింగ్‌ ఐపీఎస్‌గా సెలక్ట్‌ కాకముందు ఎంబీబిఎస్‌ చేసిన డాక్టర్‌ కూడా. ఈ ఆపత్కాల సమయంలో ఒక డ్యూటీ చేయడమే కష్టం అనుకుంటే పోలీసాఫీసర్‌గానూ, డాక్టర్‌గానూ రెండు విధులను నిర్వరిస్తున్నారు ఆర్తిసింగ్‌.

ఆర్తి సింగ్‌ మహారాష్ట్రలోని నాసిక్‌ రూరల్‌ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌. ఆమె 4,000 మంది గల ఎన్‌ఫోర్స్‌ పోలీస్‌ టీమ్‌ని లీడ్‌ చేస్తూ కరోనా మహమ్మారిపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి పోలీసులెవ్వరికీ సరిగా కంటి మీద కునుకు లేదు. అలసటను సైతం మరిచి విధుల్లో తలమునకలుగా ఉన్నారు. ఇక పోలీస్‌ టీమ్‌ను లీడ్‌ చేసే కెప్టెన్‌ బాధ్యతలు ఇంకెంతగా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఎస్పీగా జిల్లాలోని 500 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలన్నింటివద్దా ఆర్తిసింగ్‌ టీమ్‌ పనిచేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ చెక్‌ పోస్ట్‌లను ఏర్పాటు చేశారు.

వైద్యురాలిగా...
పోలీసాఫీసర్‌గా రోజూ ఉదయమే అన్ని చెక్‌పోస్ట్‌లను పర్యవేక్షిస్తూ తన టీమ్‌ అందరికీ గైడ్‌లైన్స్‌ ఇస్తుంటుంది ఆర్తీసింగ్‌. టీమ్‌లో అందరికీ ఫేస్‌షీల్డ్స్, ఫేస్‌మాస్క్‌లను పంచుతుంది. అందరూ సరైన జాగ్రత్తలతో ఉన్నారో లేదో చెక్‌ చేయడం, టీమ్‌ మేట్స్‌ కోసం ఏర్పాటు చేసిన క్యుబికల్స్‌లో సదుపాయాలున్నాయా, శానిటైజర్స్‌ అందరికీ అందుతున్నాయా లేదా అనేది పర్యవేక్షిస్తుంది. ఎంబీబిఎస్‌ చేసిన ఆర్తి 2004లో యుపీఎస్సీ నుంచి ఐపీఎస్‌కి ఎంపికయ్యారు. డాక్టర్‌ అయ్యుండి పోలీస్‌గా ఎందుకు టర్న్‌ తీసుకున్నారు అని అడిగితే ‘ముందు ఎంబీబిఎస్‌ తర్వాత గైనకాలజీలో స్పెషలిస్ట్‌ అవుదామనుకున్నా. డాక్టరయినా పోలీస్‌ అయినా సమాజానికి సేవ చేయడానికే. పోలీసాఫీసర్‌ అవ్వాలనే ఆలోచన ఒక దశలో నన్ను బాగా పట్టుకుంది. ఆ ఆలోచన ఐపీఎస్‌ సాధించేవరకు వదల్లేదు. ఇప్పుడు దేశానికి రెండు రకాలుగా సేవ చేసే భాగ్యం కలిగింది అంటారు ఆర్తి. పోలీసుల ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు వారి కుటుంబాలు నివసించే కాలనీలలోకి వెళ్లి రోజూ ఆరోగ్య సంరక్షణ చర్యల గురించి చెబుతుంటారు ఆర్తి సింగ్‌.

ఇద్దరు కూతుళ్ల తల్లిగా...
టీమ్‌ మొత్తం ఎస్పీ సూచనల కోసం ఎలా చూస్తుంటారో ఆమె పిల్లలు కూడా తల్లి ఎప్పుడు ఇంటికి వస్తుందా అని ఎదురు చూస్తుంటారు.
‘నా పెద్ద కూతురికి 10 ఏళ్లు. చిన్న పాపకు నాలుగేళ్లు. సాధారణ  రోజుల్లో అయితే రోజూ సాయంకాలం ఇంటికి వెళ్లగానే నా చిన్నకూతురు పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకునేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. పిల్లలు ఎదురొచ్చినా దూరంగా ఉండమని గట్టిగా చెబుతున్నాను. పెద్ద పాప అర్ధం చేసుకుంటుంది కానీ చిన్నపాప చాలా అప్‌సెట్‌ అవుతోంది. వాళ్లనలా చూస్తుంటే అమ్మగా ఎంతో బాధగా ఉంటుంది కానీ తప్పదు కదా’ అంటారు ఆర్తి ఒక ఆఫీసరమ్మలా..!
ఆర్తి సింగ్‌ భర్త కూడా ఐపీఎస్‌ ఆఫీసర్‌. అతనికి ముంబయ్‌లో విధులు. అతను ప్రస్తుతం ఇంటికే రాలేని పరిస్థితి. వీరి ఇద్దరు పిల్లలు తమ బామ్మతో ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు.– ఆరెన్నార్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top