అమ్మా.. ఐ లవ్యూ మా..!

Mothers days special story - Sakshi

ఇరా శుక్లా! ఎవరో తెలీదు. చాలామంది ఈ పేరుతో ఉంటారు. కంపెనీ సెక్రెటరీలు, హక్కుల కార్యకర్తలు, జర్నలిజం విద్యార్థినులు.. వీళ్లలో ఎందరికో ఈ పేరు ఉండొచ్చు. వీళ్లందరి ఇంటి పేరు మాత్రం ఒక్కటే.. ‘కూతురు’. అలాంటి ఈ కూతురు నిన్న ‘మదర్స్‌డే’ కి అమ్మను తలుచుకుంది. తను పెరిగి పెద్దయ్యాననే అనుకుంది ఇరా. తన కాళ్ల మీద తను నిలబడ్డాను అనుకుంది. ఒక్కదాన్నే ఇండిపెండెంట్‌గా ఉండగలుగుతున్నాను అనుకుంది. అన్ని పనులూ తనే స్వయంగా చేసుకోగలుగుతున్నాను అనుకుంది. 

కానీ ఇరాలోని చిన్నపిల్ల ఇంకా.. అమ్మకోసం ఆరాట పడుతూనే ఉంది! అమ్మ స్పర్శకోసం, అమ్మ చూపు కోసం, అమ్మ మాట కోసం, అమ్మ ఒడి కోసం, అమ్మ చిరునవ్వు కోసం, అమ్మ మందలింపు కోసం కూడా! ‘ఏయ్‌.. పిల్లా, ఎందుకు అబద్ధం చెబుతావ్‌’ అని అమ్మ చిరుకోపం ప్రదర్శిస్తే ఎంత హాయిగా ఉంటుంది! అమ్మ  క్షేమంగానే ఉంది.. దూరంగా. తనూ క్షేమంగానే ఉంది అమ్మకు దూరంగా! దూరంగా ఉండి క్షేమంగా ఉన్నా.. అది క్షేమమే అవుతుందా?

వెనక్కి వెళ్లి ఆలోచిస్తుంటే.. ‘మేమూ కాస్త ఆలోచించి పెట్టమా?’ అని కన్నీళ్లు ముందుకొచ్చేస్తున్నాయి. ఇరా ఒకటొకటీ గుర్తు చేసుకుంటోంది.  ప్రతి పనిలోనూ అమ్మ గుర్తుకు వస్తోంది. వంట దగ్గర మరీనూ. తనూ చేస్తోందిప్పుడు వంట.. అమ్మ దగ్గర నేర్చుకున్నవన్నీ కలిపి. కానీ ప్లేటు ఖాళీగానే ఉన్నట్లు అనిపిస్తోంది.! ‘అమ్మా.. నేను ఇంటికొచ్చేశాను’ అని రోజూ ఆఫీస్‌ నుండి రాగానే కాల్‌ చేసి చెబుతుంది. ‘ఆఫీస్‌లో నాకేం స్ట్రెస్‌ లేదు’ అని తను చెప్పినప్పుడు, ‘అబద్ధం చెబుతున్నావ్‌’ అని అమ్మ తప్ప ఇంకెవరు కనిపెట్టగలరు? జ్వరానికి ఏ మాత్ర వేసుకోవాలో, జలుబుకు ఏ మందు రాసుకోవాలో తనకు తెలుసు.

కానీ, అమ్మలా.. రాత్రంతా తన పక్కనే కనిపెట్టుకుని ఉండేదెవరు? షాపింగ్‌కి వెళ్లి తన కిష్టమైన డ్రెస్‌లు కొనుక్కోగలదు తను. కానీ ‘నీకు ఈ డ్రెస్‌ బాగుంటుంది’ అని అమ్మలా సెలక్ట్‌ చేసి పెట్టేవారెవరు? ఇష్టపడి హైహీల్స్‌ కొని తెచ్చుకుంటుంది తను. ఆఖరి నిముషంలో డ్రెస్‌కి అవి మ్యాచ్‌ కాకపోతే, తన  చెప్పులు వేసుకొమ్మని ఇవ్వగలిగింది అమ్మ కాక మరెవ్వరు? అమ్మకు ఒంట్లో బాగోలేకపోతే.. ‘ఎలా ఉందమ్మా?!’ అని తను వందసార్లు కాల్‌ చేయగలదు.

కానీ, అమ్మ దగ్గర కూర్చుని, అమ్మ చెయ్యి పట్టుకుని అడిగినట్లుంటుందా ఆ అడగడం? అమ్మ కూడా ఆఫీస్‌ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే, ‘టీ తాగావా అమ్మా?’ అని తను ఫోన్‌ చేసి అడగ్గలదు. కానీ, అమ్మకు ఇష్టమైన ‘టీ’ని కాచి, కప్పును చేతికి అందివ్వగలదా? అమ్మానాన్న గొడవ పడుతుంటే.. ‘ఊర్కోమ్మా’ అని తను చెప్పగలదు. ఇంత దూరం నుంచి ఆ గొడవ పెద్దదవకుండా తను చేయగలదా? అమ్మ ఎప్పుడైనా ముస్తాబైనప్పుడు ఫొటోలు తీసి పంపించమ్మా అని తను అడగ్గలదు. కానీ, అమ్మ దగ్గర ఉన్నప్పటిలా అమ్మ కాళ్ల దగ్గర చీర అంచులను సవరించగలదా? ‘ఐ మిస్‌ యూ అమ్మ’ అని చెప్పడానికి ఇరా దగ్గర లక్షల సందర్భాలు ఉన్నాయి. ప్రతి క్షణం ఒక సందర్భమే.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top