ముగ్గురు విజేతలు

Most influential women in the world - Sakshi

ఆదర్శం

విజి పేన్‌కూట్టు, రాహీబాయి, మీనా గయేన్‌.. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రభావంతమైన, స్ఫూర్తిదాయకమైన’ మహిళలుగా బీబీసీ తయారు చేసిన తాజా వందమంది జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ ముగ్గురు భారతీయ స్త్రీలు తమ శక్తికి మించిన ప్రయత్నాలతో వివిధ సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టి సమాజానికి ఆదర్శంగా నిలిచారని బిబీసీ ప్రశంసించింది.  

రైట్‌ టు సిట్‌
విజి పేన్‌కూట్టు.. వయసు యాభైఏళ్లు. వృత్తి టైలరింగ్‌.  22 ఏళ్ల వయసులో సామాజిక సేవ మొదలుపెట్టారు.  ఘనత..  అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళలకు మెరుగైన పని పరిస్థితులు కల్పించడం కోసం పోరాడారు. దాదాపు నాలుగేళ్ల ఉద్యమం తర్వాత ఆమె ఘోష విన్నది  కేరళ ప్రభుత్వం ఆ మేరకు చట్టాన్ని సవరించింది. అంతేకాదు ఆడవాళ్లు పనిచేస్తున్న ప్రతి షాపులో వాళ్లు కూర్చోవడానికి వీలుగా కుర్చీలను ఏర్పాటును తప్పనిసరి చేసింది. విజి చేపట్టిన ఉద్యమం పేరు ‘రైట్‌ టు సిట్‌’. ‘‘బీబీసీ జాబితాలో నా పేరుండడం నిజంగా సంతోషాన్నిస్తోంది. రైట్‌ టు సిట్‌ అనేది కేవలం మనదేశంలోని సమస్యే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేల్స్‌గర్ల్స్‌ ఫేస్‌ చేస్తున్న ప్రాబ్లం’’ అంటుంది విజి పేన్‌కూట్టు.

సీడ్‌ మదర్‌
రాహీబాయి.. స్వస్థలం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా, కోంభాల్నే గ్రామం. వృత్తి రైతు. ఘనత.. ఆగ్రో– బయోడైవర్సిటీలో సెల్ఫ్‌ మేడ్‌ ఎక్స్‌పర్ట్‌. వరిలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధిస్తూ ఆదర్శరైతుగా నిలిచింది. తన పొలంలో సొంతంగా నీటి సంరక్షణా నిర్మాణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీంతో రెండెకరాల బంజరుభూమిని మాగాణిగా మలచుకుంది. ఆ నేలలో కూరగాయలను పండిస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. విత్తన భాండాగారాన్నీ స్థాపించి రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తోంది. ఇదిగాక  విత్తనాల ఎంపిక, నేల సారాన్ని వృద్ధిపరుచుకోవడం, ఎరువుల వాడకం వంటివాటిపై రైతులకు, వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు శిక్షణనూ ఇస్తోంది. ఈ కృషికి ‘ది కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌’ సంస్థ ఆమెను ‘సీడ్‌ మదర్‌’ అనే బిరుదుతో సత్కరించింది. 

భగీరథి
మీనా గయేన్‌.. పశ్చిమ బెంగాల్‌ వాస్తవ్యురాలు. ఘనత..  సుందర్‌బన్స్‌లోని మహిళలందరినీ ఏకం చేసి ఆ ప్రాంతంలో రహదారులను  నిర్మించింది. చుట్టూ నదులతో శాశ్వత రహదారులకు అనుకూలంగా లేని ప్రదేశం సుందర్‌బన్స్‌. అలాంటి చోట అక్కడి గ్రామాల స్త్రీలనందరినీ ఒక్కతాటి మీదకు తెచ్చి పర్మినెంట్‌ రోడ్లను నిర్మింపచేసి అభినవ భగీరథిగా కీర్తిగాంచింది రాహీబాయి. అందుకే  బీబీసీ ఆమెను మోస్ట్‌ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ అండ్‌ ఇన్సిపైరింగ్‌ ఉమన్‌గా గౌరవించింది.   

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top