
మన కడుపు, పేగుల్లో ఉండే సూక్ష్మజీవుల ప్రపంచం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఇటీవలి కాలంలో జరిగిన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఎలా జరుగుతోందన్న విషయం మాత్రం అంతగా తెలియలేదు. బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్స్ శాస్త్రవేత్తల పరిశోధనల కారణంగా ఈ లోటు కూడా భర్తీ అయింది. రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేయడం ద్వారా పేగుల్లోని మంచి బ్యాక్టీరియా జీవక్రియలు జరిగే పద్ధతిలో మార్పులు చేయగలదని పౌలా వాట్‌నిక్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు.
ఈగలపై తాము పరిశోధనలు చేశామని, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ను అడ్డుకునే రోగనిరోధక వ్యవస్థకు ఇంకో ముఖ్యమైన పని కూడా ఉన్నట్లు ఇందులో తెలిసిందని పౌలా అంటున్నారు. పేగుల్లోని కణాలు ఈ వ్యవస్థ సాయంతో జీవక్రియల్లో మార్పులు చేయడం ద్వారా మంచి బ్యాక్టీరియాను కాపాడుకుంటాయని వివరించారు. పేగుల్లో బ్యాక్టీరియా లేకపోయినా, జీవక్రియల్లో మార్పులు జరక్కపోయినా ఈగల్లో కొన్ని కొవ్వు కణాలు ఏర్పడటం చూశామని చెప్పారు. ఇది మానవుల్లో కనిపించే ఫ్యాటీలివర్ వ్యాధికి సమానమని అన్నారు.