HIIT Benefits: బద్దకం వదలండి.. కేన్సర్‌నూ చంపేయొచ్చు!

High Intensity Interval Training Exercises Benefits What Study Says - Sakshi

శారీరక వ్యాయామంతో బోలెడు లాభాలు

పలు పరిశోధనల్లో తేలిన అనేక అంశాలు

మెదడు పని తీరు బాగుంటుందని వెల్లడి 

అల్జీమర్స్‌ దరి చేరదని ప్రయోగాత్మక నిరూపణ 

దృష్టి లోపాలు, కేన్సర్‌కూ చెక్‌ పెట్టొచ్చని అంచనా 

సాక్షి, హైదరాబాద్‌: మీరు తరచూ వ్యాయామం చేస్తే జీర్ణ సమస్యలతో పాటు గుండె జబ్బులు దరి చేరవని మనకు తెలుసు. అయితే ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాలు.. ఇంతకంటే సూక్ష్మస్థాయిలో శరీరంలో జరిగే మార్పులను, వాటి ప్రభావాన్ని అంచనా వేశాయి. వీటన్నింటి ఆధారంగా వ్యా యామం చాలా రకాలుగా మేలు అని చెప్పొచ్చు. 

బుద్ధి కుశలత.. 
రోజులు, నెలలు కాదు.. కనీసం ఒక్కరోజు వ్యాయామం చేసినా సరే.. ఒక రకమైన జన్యువు ఉత్తేజితం అవుతుందని, తద్వారా మెదడులోని నాడీ కణాల మధ్య సినాప్టిక్‌ సంబంధాలు మెరుగవుతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. జాగింగ్‌ వల్ల ఒత్తిడి తగ్గుతుందన్న భావనకు మూలం కూడా ఇదే. ఒరెగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్సిటీ ఈ అంశంపై పరిశోధనలు చేసింది. బాస్కెట్‌ బాల్‌ వంటి ఆటను ఎలుకలతో ఆడించి, గంట తర్వాత పరిశీలిస్తే వాటి మెదడులో జ్ఞాపకాలు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఉపయోగపడే మెదడులోని హిప్పోకాంపస్‌ భాగంలో సినాప్టిక్‌ కార్యకలాపాలు వేగం పుంజుకున్నట్లు తేలింది. అంటే దీన్నిబట్టి పరీక్షలున్న రోజు కాసింత వ్యాయామం చేసి వెళ్తే మరిన్ని ఎక్కువ మార్కులు కొట్టేయొచ్చు. 

మెదడులో పలు మార్పులు.. 
రెండు రకాల వ్యాయామాలు మన మెదడు పనితీరును మార్చేస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు మెరుగ్గా అలవాటు పడే లక్షణం (బ్రెయిన్‌ ఎలాస్టిసిటీ) మాత్రమే కాకుండా.. మతిమరుపును దూరం చేసుకునేందుకు, అల్జీమర్స్‌ వంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు వ్యాయామం ఉపయోగపడుతుంది. హై ఇంటెన్సిసిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌ (హిట్‌) రకం వ్యాయామం (నిమిషం, 2 నిమిషాల పాటు తీవ్రస్థాయిలో వ్యాయామం చేసి.. కొంత విరామం ఇవ్వడం.. ఆ తర్వాత మళ్లీ తీవ్రస్థాయి వ్యాయామం చేయడం) వల్ల న్యూరాన్ల మధ్య బంధాలు బలపడతాయని సౌత్‌ ఆస్ట్రేలియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన పరిశోధనలు చెబుతున్నాయి.

ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సటర్‌ 2019లో సుమారు 2 లక్షల మందిపై నిర్వహించిన పరిశోధన ద్వారా మతిమరుపు, అల్జీమర్స్‌ను దూరం చేసుకునేందుకు వ్యాయామం, జీవనశైలి మార్పులు దోహదపడతాయని గుర్తించింది. అధ్యయనంలో పాల్గొన్న వారిలో కనీసం 32 శాతం మంది మతిమరుపును నివారించగలిగారు. చిన్నతనంలో మంచిఆహారం తీసుకోవడం, తగినంత శారీరక శ్రమ చేయడం వల్ల పెరిగి పెద్దయ్యాక మెదడు సైజు ఇతరుల కంటే ఎక్కువగా ఉండటంతో పాటు మానసిక ఒత్తిడిని మెరుగ్గా ఎదుర్కోగలరని కూడా తాజా పరిశోధనలు చెబుతున్నాయి. 

దృష్టి లోపాల నివారణకూ.. 
వయసుతో పాటు కళ్ల సంబంధిత సమస్యలను వ్యాయామం ద్వారా కొంత నిరోధించొచ్చు. అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలిపిన విషయం ఇది. రెండు గుంపుల ఎలుకలపై ప్రయోగాలు జరిపారు. ఒక గుంపు వ్యాయా మం చేయలేదు. రెండోదాన్ని వేగంగా తిరిగే చక్రాల్లో బంధించి అవి చక్రం వెంబడి పరిగెత్తేలా చేశారు. 4 వారాల తర్వాత రెండు గుంపుల ఎలుకల కళ్లపై లేజర్‌ కిరణాలు ప్రసరించపజేశారు. దీంతో వ్యాయామం చేసే గుం పులోని ఎలుకల కళ్లకు 45 శాతం వరకు తక్కువగా నష్టం జరిగిందని గుర్తించారు. దీన్నిబట్టి మనుషుల్లోనూ రోజూ కొద్దిపాటి వ్యాయామం చేయడం ద్వారా వయసుతో వచ్చే దృష్టి లోపాలను కొంతవరకు నివారించొచ్చని తేలింది. 

కేన్సర్‌ను చంపేయొచ్చు.. 
కొన్ని రకాల కేన్సర్లకు చెక్‌ పెట్టేందుకు వ్యాయామం ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. వ్యాయామం చేసే క్రమంలో కండరాలు రక్తంలోకి కొన్ని రకాల జీవ రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి కాస్తా రోగ నిరోధక వ్యవస్థలో కేన్సర్‌ కణాలను చంపేసే ‘టీ సెల్స్‌’పనితీరును మెరుగుపరుస్తాయని గతేడాది కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ (స్వీడన్‌) నిర్వహించిన ఈ పరిశోధనలో తేలింది. వ్యాయామం చేస్తున్న ఎలుకల నుంచి ఈ జీవ రసాయనాలను తీసి కేన్సర్‌ కణితులు ఉన్న ఎలుకలకు అందించినప్పుడు వాటి పరిమాణం తగ్గిందని తేలింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top