మీ డైట్‌లో ఇవి చేర్చుకుంటే నాజుగ్గా కనిపించొచ్చు

Weight Loss For Women After 40 Is It Possible Check This List - Sakshi

బరువు పెరగడం అనేది చాలా సాధారణ విషయం. మారుతున్న జీవనశైలిలో బరువు తగ్గడం అనేది సవాలుగా మారింది. చాలామంది మహిళలు 35-40 దాటాక వేగంగా బరువు పెరుగుతారని పలు పరిశోధనల్లో వెల్లడైంది.దీనికి అనేక కారణాలు ఉంటాయి. మరి బరువును కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఫిట్‌గా, నాజుగ్గా కనిపించాలంటే ఎలాంటి డైట్‌ పాటించాలన్నది ఇప్పుడు చూద్దాం. 

బరువు తగ్గాలంటే ముఖ్యంగా తినే తిండిపై దృష్టి పెట్టాలి. అనారోగ్యమైన, ప్రాసెస్‌ చేసిన ఆహారాలు తినిడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. దీంతో పాటు జీవక్రియ రేటు కూడా మందగిస్తుంది.అందుకే మీ డైట్‌లో కొన్ని ఆహారాలు చేర్చుకోగలిగితే 40లోనూ పాతికేళ్ల అమ్మాయిలా కనిపించొచ్చు. దీనికోసం ప్రతిరోజూ మీ ఆహారంలో ఆకుకూరలు, సాల్మన్‌ చేపలు, బెర్రీలు ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలని న్యూట్రీషనిస్ట్‌ కేథరీన్‌ గెర్వాసియో తెలిపారు.

చాలామంది మహిళలు పీసీఓడీ, థైరాయిడ్‌ వంటి అనేక సమస్యల కారణంగా బరువు పెరుగుతారు. హార్మోన్ల అసమతుల్యత కూడా ఇందుకు కారణం. ఓ అధ్యయనం ప్రకారం.. 44 ఏళ్లు దాటాక ప్రతి మహిళ ఏడాదికి అరకిలో బరవు పెరుగుతుందట. అందుకే మోనోపాజ్‌ దాటాక పక్కా డైట్‌ ప్లాన్‌ పాటించాలి. 

ఆకుకూరలు
బరువు తగ్గాలనుకునేవారికి ఆకుకూరలు బెస్ట్‌ ఛాయిస్‌. అందుకే వీటిని సూపర్‌ ఫుడ్స్‌ అంటారు. పాలకూర, బచ్చలికూర, తోటకూర వంటి వాటిల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆహారం త్వరగా జీర్ణం అవడంతో పాటు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఆకుకూరల్లో ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్స్‌, కాల్షియం, విటమిన్‌-కె మెండుగా ఉండటంతో పాటు కాలరీలు తక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే ప్రతిరోజూ మీ డైట్‌లో ఆకుకూరలను చేర్చుకోవాలి. అంతేకాకుండా ఎముకల దృడత్వానికి అవసరమైన విటమిన్‌-కె కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. 

బెర్రీలు
బెర్రీలు చూడటానికి చిన్నగా కనిపించినా ఇందులోని ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి. ఇందులో బ్లూబెర్రీస్‌, క్రాన్‌బెర్రీస్‌, రాస్‌ బెర్రీస్‌ వంటి పలు రకాలు ఉంటాయి. బెర్రీల్లో గ్లూకోజ్‌ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్‌ బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. 

చేపలు
సాల్మన్‌ చేపల్లో ప్రొటీన్, కొవ్వు, విటమిన్ బి12, బి6, సెలీనియం, నైసిన్, ఫాస్పరస్, థైయామిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వు సాల్మన్‌ చేపల్లో ఉంటుంది. అంతేకాకుండా ప్రోటీన్‌ శాతం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి, బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. 

వ్యాయామం
బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామం చేయడం మంచిది. చాలామంది కొన్ని రోజులు ఎక్సర్‌సైజ్ చేసి తర్వాత మానేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మరింత బరువు కంట్రోల్‌లో ఉండదు. అలాగని అతిగా వ్యాయామం చేసినా మొదటికే మోసం వస్తుంది. అందుకే శరీరానికి ఎంత అవసరమో, అంత మేరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top