వజ్ర కాయమా..? వజ్రంలాంటి మనసా?

Meditation and Yoga are for the mental concentration - Sakshi

బౌద్ధవాణి

ధ్యానం, యోగం అనేవి చిత్త ఏకాగ్రత కోసం, దృఢ చిత్తం కోసం చేసే సాధనా మార్గాలు. అలాంటి మార్గంలో సాధన చేయాలనుకున్నారు ఏడుగురు అన్నదమ్ములు. వారు కాశీరాజ్యవాసులు. ఏడుగురూ సర్వాన్ని త్యజించి అడవికి వెళ్లారు. రాలిన పండ్లు, పక్షులు తిని వదిలిన పండ్లు మాత్రమే తినేవారు. పులులూ, సింహాలూ వేటాడి తిని వదిలేసిన మాంసాన్నే ముట్టేవారు.జీవహింస చేయకుండా అలా జీవిస్తున్నారు. వారు ఎంత ప్రయత్నించినా మనస్సును అదుపు చేయడం కాస్త కష్టంగానే తోచింది. దాంతో వారి సాధన మనస్సు నుండి శరీరానికి మారింది. యోగసాధన మారి క్రమేపీ యోగాసనాల సాధనకు మళ్లారు.

రకరకాల ఆసనాలు వేస్తూ శరీరాన్ని వజ్రతుల్యంగా మార్చుకున్నారు.  ఎండా, వానా, చలి బాధల్ని తట్టుకోగల శరీరాన్ని పొందారు. చివరికి శారీరక దృఢత్వమే యోగంగా నమ్మారు.కొన్నాళ్లకి ఆ ప్రాంతానికి ఒక ధ్యాని వచ్చాడు. వారి యోగసాధన చూసి, వారితో ‘‘యోగులు మిగిలింది మాత్రమే తినాలి. మీరు నిజంగా మిగిలిందే తింటున్నారా?’’అనడిగాడు.‘‘అవును స్వామీ! మేము జీవహింస చేయం. పక్షులూ, జంతువులూ తినగా మిగిలిందే తెచ్చుకు తింటున్నాం’’ అన్నారు.‘‘అయితే, ఎంగిలి తింటున్నారన్నమాట. ఎంగిలి తిని, ఎంగిలి సాధన చేస్తున్నారన్నమాట’’అన్నాడు.

‘‘మిగిలింది తినాలంటున్నారు. ఎంగిలి అంటున్నారు. ఏమి దీని మర్మం?’’అని అడిగారు వారు.‘‘మిగిలింది తినడం అంటే... ఒకరికి పెట్టగా మిగిలింది తినడం. ఒకరు తిని మిగిల్చింది తినడం కాదు. మొదటిది త్యాగం. రెండోది లోభం. అదే ఎంగిలి. ఏ యోగి దృఢచిత్తం కోసం సాధన చేస్తాడో ఆ యోగిసాధన ఒకరికి పెట్టగా మిగిలింది తినడంతో సమానం. ఏ యోగి దృఢశరీరం కోసం సాధన చేస్తాడో ఆ యోగ సాధన ఒకరు తిని మిగిల్చినది తిన్నదానితో సమానం’’ అని చెప్పాడు.ఆ సోదరులు తమ తప్పు తెలుసుకున్నారు. మిగిలింది తినడం అంటే ఏమిటో గ్రహించి, సరైన సాధన చేశారు. ధ్యానం అంటే మనోసాధన అని, బుద్ధుడు చెప్పిన సందేశం ఇది.
డా. బొర్రా గోవర్ధన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top