ఎంతిష్టమో!

Mary Kom: The Diet, Training and Exercise - Sakshi

మేరీ కోమ్‌

ముప్పై ఐదేళ్ల వయసు. ముగ్గురు పిల్లలు. ఆరు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్స్‌. ఒక ఒలింపిక్‌ మెడల్‌! ఏమిటి మేరీ కోమ్‌ విజయ రహస్యం? బాక్సర్‌గా అనుభవమా? ఆమె ఫిట్‌నెస్సా? రెండూ! రెండిటినీ మించి గెలవాలన్న తపన. అలాగని కోమ్‌ మరీ గంటల కొద్దీ ప్రాక్టీసేం చెయ్యరు. యువ బాక్సర్‌లకు రెండు గంటల ప్రాక్టీస్‌ చాలు. కోమ్‌కి రోజూ 40 నుంచి 45 నిమిషాల సాధన సరిపోతుందట. ఇక శక్తి. ఎక్కడి నుంచి వస్తుంది ఆమెలోంచి ఆ పవర్‌ పంచ్‌? విల్‌ పవర్‌ ఎలాగూ ఉంటుంది. డైట్‌ ఏమిటి? స్పెషల్‌గా ఏమీ ఉండదట. ఏం తినాలని ఉంటే అప్పటికి అది తినేస్తారట. జన్రల్‌గా కోమ్‌ తినేది వరన్నం (వరి అన్నం). ‘‘రైస్‌ లేకుండా నేను బతకలేను. తరచు జిలేబీలు తింటాను. అలాగే ఐస్‌క్రీమ్‌. ఒక్కోసారి రెండూ కూడా. అయితే నో మసాలా.. నో స్పైసీ ఫుడ్‌’’ అని చెప్తారు మేరీ కోమ్‌. ఇవి మాత్రమే కాదు. సప్లిమెంట్స్‌ కూడా తీసుకుంటారట. బలమిచ్చే మందులు. డాక్టర్‌ నిఖిల్‌ లేటీ ఆమె ఫిజియోథెరపిస్ట్‌.

ఆయన్నడిగితే కోమ్‌ ఆహారపు అలవాట్ల గురించి మరికొంత వివరంగా చెబుతుంటారు. ఇంట్లో వండిన మణిపురి ఫుడ్‌. అన్నంలోకి మాంసం, కూరగాయలు. బయట డబ్బాలో లభించే ప్రొటీన్, మల్టీ విటమిన్లు. ఇదీ మేరీ మెనూ. సరే, బాక్సింగ్‌లో ఆడడానికి ఒక వెయిట్‌ ఉండాలి కదా! ఆ వెయిట్‌ని ఎక్కువా కాకుండా, తక్కువగా కాకుండా కోమ్‌ ఎలా మేనేజ్‌ చెయ్యగలుగుతున్నారు? మొన్నటి వరల్డ్‌ బాక్సింగ్‌ పోటీలలో మేరీ కోమ్‌ బంగారు పతకాన్ని కొట్టింది 48 కిలోల కేటగిరీలో. ఇప్పుడు ఆమె గోల్‌ ఒలింపిక్స్‌లో గోల్డ్‌ కొట్టడం. అందుగ్గాను ఆమె 51 కిలోల బరువు ఉండాలి. అంటే పెరగాలి. ఆటకు తగ్గట్లు పెరగడం, తగ్గడం కోమ్‌కి కష్టమేం కాదట! బరువు తగ్గడానికి స్కిప్పింగ్, బ్యాడ్మింటన్‌. పెరగడానికి.. బలమైన ఆహారం. క్రమబద్ధమైన వ్యాయామం. చివరగా ఒక్క విషయం. కోమ్‌ సాధారణంగా బంగారు పతకాన్నో, ఇంకో బ్రాస్‌ పతకాన్నో పంటి కింద కొరుకుతూ కనిపిస్తారు కానీ.. ఆహారాన్ని భుజిస్తూ ఎక్కడా కనిపించరు!  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top