శివప్రియం లక్ష్మీప్రదం

Maredu tree speciality in pooja - Sakshi

లక్ష్మీదేవి సృష్టించిన చెట్టు మారేడుచెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను ‘శ్రీఫలం’  అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. పూర్వం మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదంలో ప్రధానంగా ఉపయోగ పడుతుంది. మారేడు దళం మూడుగా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం! త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!! అని తలుస్తాము. దళాలు దళాలుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు.

ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి.పుష్పాలతో పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళంతో పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళం ఒకటి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగానికి తగలడం ఐశ్వర్యప్రదం..అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం వంటి ఇబ్బందులు ఉంటే మూడు ఆకులు ఉన్న దళాలతో శివునికి పూజ చేసేవారు.

మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా అపారమయిన సిద్ధి కలుగుతుంది. యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టుకింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటిమందికి భోజనం పెట్టినంత ఫలితం వస్తుందని శాస్త్రోక్తి. అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది. 

‘మా–రేడు’ తెలుగులో రాజు ప్రకృతి, రేడు వికృతి. మారేడు అంటే మా రాజు. ఆ చెట్టు పరిపాలకురాలు. అన్నిటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు. అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top