కరోనా హీరో: ‘నూరు’ పిపిఇ గౌన్లు

Malaysian School Girl Sews PPE Gowns For Healthcare Workers - Sakshi

కరోనా పోరాటంలో నేను సైతం అంటూ ఎంతో మంది కదిలారు. అందులో పిల్లలు కూడా తమ వంతు సాయం అందిస్తూ తమ సత్తా చాటుతున్నారు. వారిలో ముందు వరసలో ఉంటుంది తొమ్మిదేళ్ల నూరు అఫియా కిస్టినా. మలేషియాకు చెందిన నూరు ఆడుతు పాడుతూ తల్లి వద్ద ఐదేళ్ల వయసు నుంచే మిషన్‌ కుట్టడం నేర్చుకుంది. తల్లి టైలరింగ్‌ చేస్తుండటంతో కూతురు కూడా ఆ పనిలో మెల్ల మెల్లగా నిమగ్నమయ్యేది. ఇంటికి సమీపంలో ఉన్న ఆసుపత్రిలోని వైద్యులకు, నర్సుల బృందానికి పిపిఇ గౌన్లు అవసరమని అమ్మానాన్నల ద్వారా తెలుసుకుంది. తల్లిదండ్రుల సాయంతో కావల్సిన మెటీరియల్‌ తీసుకొని మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 130 పిపిఇ గౌన్లు తయారుచేసింది. వాటిని తన ఇంటికి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అందజేసింది.

పిపిఇ కిట్స్‌ కుడుతున్న నూరు

ఒకే రోజులో 4 గౌన్లు
‘ఇవి చెడు రోజులు. ప్రజలు ఎంతగా కష్టపడుతున్నారో వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ వైరస్‌ చాలా ప్రమాదకరమైనది అని తెలుసుకున్నాను. దీనికి అడ్డుకట్ట వేసే వారికి సహాయం చేయాలని ఉందని మా అమ్మకు చెప్పాను. లాక్డౌన్‌ కారణంగా మాకు స్కూల్‌ కూడా లేదు. ఆన్‌లైన్‌లో చదువుకుంటున్నాను. ఖాళీ సమయంలో పిపిఇ గౌన్లు తయారు చేస్తున్నాను. రోజుకు నాలుగు గౌన్లు తయారు చేస్తున్నాను. ఇందుకు మా అమ్మ కూడా సాయం చేస్తుంటుంది. ఇప్పుడు మరో 60 గౌన్లను తయారు చేయడానికి అన్ని పనులు పూర్తి చేసుకున్నాను’ అంటుంది నూర్‌. 

పొరుగువారి దుస్తులు మరమ్మతు
మిషన్‌ పైన కుట్టడం అనే నైపుణ్యాన్ని తల్లి నుండి నేర్చుకుంది నూర్‌. ఇరుగుపొరుగు వారి దుస్తులను బాగు చేయగా వచ్చే డబ్బును తన పాకెట్‌ మనీగా వాడుకునేది. ఇప్పుడు ఈ నైపుణ్యాన్ని పిపిఇ గౌన్లు తయారు చేయడానికి ఉపయోగపడింది. ఇలా కరోనా వారియర్స్‌కి  నా వంతు సాయపడుతున్నాను అని సంతోషంగా చెబుతుంది నూర్‌. వయసు చిన్నదే. కానీ, మనసు పెద్దది అనిపించక మానదు నూర్‌ చేస్తున్న పని చూస్తుంటే.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top