ఒంటరితనం కబళిస్తోంది..

Loneliness Epidemic Sweeps The US - Sakshi

న్యూయార్క్‌ : జనజీవితాల్లోకి సోషల్‌ మీడియా చొచ్చుకువచ్చిన ఫలితంగా మానవ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. యువత నుంచి వృద్ధుల వరకూ సమూహంలోనే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ సిగ్నా చేపట్టిన సర్వే నివేదిక దిగ్భ్రాంతికర అంశాలను వెల్లడించింది. అమెరికా జనాభాలో దాదాపు సగం మంది ఒంటరితనంతో డీలాపడ్డారని వెల్లడైంది. సోషల్‌ మీడియా ప్రభావంతో యువతపై ఒంటరితనం ప్రభావం ఉండదన్న అంచనాలు తలకిందులయ్యాయి. 22 ఏళ్ల లోపు యువత వృద్ధుల కన్నా ఎక్కువగా ఒంటరితనంతో బాధపడుతున్నట్టు వెల్లడైంది.

తమ జీవితంలో తమను అర్థం చేసుకునే వారే లేరని అమెరికన్లలో నాలుగింట ఓ వంతు జనాభా అభిప్రాయపడింది. తమ సంబంధాలు అర్థవంతంగా లేవని 43 శాతం మంది పేర్కొన్నారు. ఇక అమెరికన్లలో అన్ని వయసుల వారిలో కుంగుబాటు, ఆందోళనలతో సతమతమయ్యే వారు అత్యధికంగా ఉన్నారు. తక్కువ ఒంటరితనం అనుభవిస్తూ వ్యక్తిగతంగా చురుకైన సంబంధాలు కలిగిన వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు అథ్యయనంలో వెల్లడైంది. అమెరికన్లలో కేవలం సంగం మందే అర్థవంతమైన సామాజిక సంబంధాలను కలిగిఉన్నారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో నిత్యం మెరుగైన సమయాన్ని గడపడం వంటి సామాజిక సంబంధాలను కేవలం 53 శాతం మందే నెరుపుతున్నారని సర్వేలో తేలింది. కాగా, ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యాలపై పునఃసమీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని సర్వే చేపట్టిన సిగ్నా పేర్కొంది.  ప్రతి ఐదుగురిలో ఒక వ్యక్తి తమకు సన్నిహితంగా ఎవరూ లేరని, ఆప్యాయంగా మాట్లాడేందుకు ఆత్మీయులే కరవయ్యారని భావిస్తున్నారని నివేదిక వెల్లడించింది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top