నలుపు సౌందర్యం కాదనుకునే లోకమా..

Jogbani Tunzi Got Miss Universe 2019 - Sakshi

‘ఈ ప్రపంచం నలుపును ఎలా చూస్తుందో నాకు తెలుసు. నాలాంటి తల వెంట్రుకలు, చర్మపు రంగు ఉన్నవారిని ఎలా వ్యాఖ్యానిస్తారో నాకు తెలుసు. ఈ రోజుతో ఆ అభిప్రాయాలన్నింటికీ చెల్లుచీటీ పాడండి’ అని ‘మిస్‌ యూనివర్స్‌ 2019’ విజేత జొజిబిని తుంజి అన్నారు. 26 సంవత్సరాల ఈ నల్లజాతి మోడల్, హక్కుల కార్యకర్త, స్త్రీల కార్యకర్త దక్షిణాఫ్రికా దేశం నుంచి ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీలలో పాలుపంచుకుని తన కంఠాన్ని గట్టిగా వినిపించి హర్షధ్వానాల మధ్య విజేతగా శిరస్సున అందాల కిరీటాన్ని ధరించారు. 67 సంవత్సరాలుగా జరుగుతున్న మిస్‌ యూనివర్స్‌ పోటీలలో ఇలా నల్ల జాతీయురాలు టైటిల్‌ గెలుచుకోవడం మూడోసారి. గతంలో అంగోలా నుంచి, ట్రినిడాడ్‌ నుంచి మిస్‌ యూనివర్స్‌ అయిన వారున్నారు.

అమెరికా అట్లాంటాలో సోమవారం జరిగిన ఈ అందాలపోటీ వేడుకలో జొజిబిని తుంజి సాధించిన విజయం ప్రపంచవ్యాప్తంగా మూసకట్టు సౌందర్య ప్రమాణాలను దిగుదుడుపు అయ్యేలా చేసింది. తెల్లగా ఉంటేనే అందమని, పొడవైన వెంట్రుకలే సౌందర్యమని అనుకునేవారందరికీ ఇదొక చెంపపెట్టు, అలా లేని వానికి ఈ విజయం ఒక కొత్త స్ఫూర్తి అని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ‘తలుపు తెరిచి చూడండి. ఒక కొత్త వెలుతురు వస్తుంది. ప్రపంచంలోని ఆడపిల్లలంతా నా ముఖంలో తమ ప్రతిబింబాన్ని చూసుకోవాలని కోరుకుంటున్నాను. కలలు కనడానికి వెనుకంజ వేయవద్దని హితవు చెబుతున్నాను’ అని జొజిబిని తుంజి చెప్పారు. ‘నా పేరు జొజిబిని తుంజి. నాది దక్షిణాఫ్రికా. నేను మిస్‌ యూనివర్స్‌ విజేతను అని గర్వంగా చెబుతాను’ అని కూడా ఆమె అన్నారు.

90 దేశాల అతిలోక సౌందర్యవతులు ఈ కిరీటం కోసం పోటీ పడితే సౌందర్యవంతమైన దేహంతోపాటు సౌందర్యభరితమైన ఆలోచన కలగలిసిన జొజిబినికి విజయం లభించింది. ‘నేటి ఆడపిల్లలకు మనం ఎలాంటి పాఠాలు చెప్పాలి’ అని పోటీలో చివరి ప్రశ్నకు జొజిబిని ఏ మాత్రం తొట్రు పడకుండా ‘మనం వారికి నాయకులం కమ్మని చెప్పాలి. నాయకత్వం తమ పరిధిలోని సంగతి కాదని ఆడపిల్లలు అనుకుంటారు. వారు ఎదగాలి. వేదిక మీద తమ వాటా కోసం, దిశా నిర్దేశం చేయడం కోసం ఏ మాత్రం బెరుకు లేకుండా ప్రయత్నించాలి’ అని జొజొబిని చెప్పారు.

ఈ పోటీలలో మిస్‌ పొర్టొ రీకో ఫస్ట్‌ రన్నరప్‌గా, మిస్‌ మెక్సికో సెకండ్‌ రన్నరప్‌గా నిలిస్తే భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన వర్తికా సింగ్‌ టాప్‌ 20 స్థానాలలో నిలిచి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికాలోని ట్సోలో అనే చిన్న మునిసిపాలిటీ సమీపంలోని పల్లెలో బాల్యం గడిచిన జొజొబిని కేప్‌టౌన్‌లో పబ్లిక్‌ రిలేషన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. లింగవివక్ష కారణంగా స్త్రీలకు దొరకని సమాన అవకాశాల గురించి విద్యార్థి దశ నుంచే ఆమె పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ‘మిస్‌ యూనివర్స్‌’ కిరీటం ద్వారా దొరికిన కీర్తితో తన గొంతును ప్రపంచమంతా వినిపించాలనుకుంటున్నారు. స్త్రీ వికాసం కోసం ఆమె చేయబోయే ప్రయత్నాలకు శుభకామనలు తెలియచేద్దాం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top