చరిత్రకు చేరువలో...  | Sakshi
Sakshi News home page

చరిత్రకు చేరువలో... 

Published Sun, Dec 16 2018 1:55 AM

Indian badminton star PV Sindhu continues the unique form - Sakshi

ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను గెలిచి సీజన్‌ను సగర్వంగా ముగించేందుకు భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట (పీవీ) సింధు మరో విజయం దూరంలో నిలిచింది.         ప్రతిష్టాత్మక వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో ఈ తెలుగు తేజం వరుసగా రెండో ఏడాది టైటిల్‌ పోరుకు అర్హత పొందింది. తద్వారా ఈ టోర్నీలో రెండుసార్లు ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (2017లో), సైనా నెహ్వాల్‌ (2011లో), మిక్స్‌డ్‌ డబుల్స్‌లో గుత్తా జ్వాల–దిజు (2009లో) జంట ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచారు. ప్రపంచ మాజీ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)తో నేడు జరిగే ఫైనల్లో సింధు గెలిస్తే సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పుతుంది.  

గ్వాంగ్‌జూ (చైనా): తన అద్వితీయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఈ ఏడాది ఆరో టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో ఆమె వరుసగా రెండో ఏడాది అంతిమ సమరానికి అర్హత సాధించింది. 2013 ప్రపంచ చాంపియన్‌ ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో సింధు 21–16, 25–23తో గెలుపొందింది. ఆదివారం జరిగే ఫైనల్లో 2017 ప్రపంచ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. ముఖాముఖి రికార్డులో సింధు, ఒకుహారా 6–6తో సమంగా ఉన్నారు. రెండో సెమీఫైనల్లో ఒకుహారా 21–17, 21–14తో జపాన్‌కే చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్‌ అకానె యామగుచిపై నెగ్గింది.

 
రచనోక్‌తో జరిగిన సెమీఫైనల్లో సింధు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగింది. తన ప్రత్యర్థి సర్వీస్‌లకు పదునైన రిటర్న్‌ షాట్‌లతో జవాబు ఇచ్చింది. ఆరంభంలోనే 10–7తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. సింధు కొట్టిన షాట్‌ల గతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన రచనోక్‌ పలుమార్లు షటిల్స్‌ను వదిలేసింది. రెండో గేమ్‌లో మాత్రం ఇద్దరూ ప్రతీ పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. 27 షాట్‌లపాటు సాగిన ర్యాలీలో పైచేయి సాధించిన రచనోక్‌ స్కోరును 10–10తో సమం చేసింది. అనంతరం పలుమార్లు స్కోరు సమమయ్యాక 24–23 వద్ద సింధు కళ్లు చెదిరే స్మాష్‌ షాట్‌తో పాయింట్‌ గెల్చుకోవడంతోపాటు గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

 ‘గతంలో పాయింట్లు కోల్పోయాక వాటి గురించే ఆలోచించి మరిన్ని తప్పిదాలు చేసేదాన్ని. ఇప్పుడు అలా ఆలోచించడం లేదు. మానసికంగా చాలా దృఢంగా తయారయ్యాను. ఆధిక్యం పోయినా, పాయింట్లు చేజార్చుకున్నా వెంటనే తేరుకొని తర్వాతి పాయింట్‌పై దృష్టి పెడుతున్నాను. ఒకుహారాతో జరిగే ఫైనల్లో మానసిక స్థయిర్యం, సహనం, ఏకాగ్రత కీలకం కానున్నాయి. మేమిద్దరం ఆడే మ్యాచ్‌ల్లో సుదీర్ఘ ర్యాలీలు ఉంటాయి. ఈసారీ మ్యాచ్‌ సుదీర్ఘంగా సాగుతుందని భావిస్తున్నాను. ఆమెను ఏమాత్రం తక్కువ అంచనా వేయడంలేదు’ అని విజయానంతరం సింధు వ్యాఖ్యానించింది.

మ్యాచ్‌ పాయింట్‌ చేజార్చుకున్న సమీర్‌ వర్మ 
పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో భారత యువతార సమీర్‌ వర్మ 21–12, 20–22, 17–21తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ షి యుకి (చైనా) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌ గెలిచి, రెండో గేమ్‌లో సమీర్‌ వర్మ 20–19తో విజయం అంచున నిలిచాడు. ఈ దశలో షి యుకి వరుసగా మూడు పాయింట్లు గెలిచి రెండో గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో షి యుకి పైచేయి సాధించి సమీర్‌ వర్మ ఆట కట్టించాడు. మరో సెమీస్‌లో ప్రపంచ చాంపియన్‌ కెంటో మొమోటా (జపాన్‌) 21–14, 21–12తో సన్‌ వాన్‌ హో (కొరియా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో  షి యుకితో మొమోటా ఆడతాడు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement