మంచి విషయం

In India a mother has an average of six children - Sakshi

బతుకమ్మ
కొన్ని ఖర్చుల్ని లెక్క వేసుకోకూడదు. ఇంటి ఆడపడుచుకు ఇచ్చిన వాటిని అసలే లెక్క చూసుకోకూడదు. తెలంగాణ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వరుసగా ఈ మూడో ఏడాది కూడా తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుంటుంబాల్లోని ఆడపడుచులకు ‘బతుకమ్మ’ చీరలు పంపిణీ చేయబోతోంది. అందుకోసం 300 కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తోంది. చీరలకు అంత భారీ మొత్తాన్ని వెచ్చించే బదులు చేతిలో ఇన్ని పైసలు పెట్టొచ్చు కదా అని విమర్శలు వస్తున్నాయి.చేతిలో పది రూపాయలు పెట్టడానికి, ఓ చీర పెట్టడానికీ తేడా లేదా?! కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం సిరిసిల్లలోని మగ్గాలకు, ఇతర ప్రాంతాలలోని చేనేతకారులకు బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు ఇప్పటికే వెళ్లిపోయాయి. దసరాకు మన అక్కచెల్లెళ్ల మోములో చిరునవ్వులు పూయబోతున్నాయి.

నాగస్వరం
నెలలు నిండకుండా పుట్టిన బిడ్డల్లో తలెత్తే అవకాశం ఉన్న మస్తిష్క నాడీమండల, మానసిక సమస్యల్ని ‘నాగస్వరం’తో నయం చేయవచ్చని జెనీవా శాస్త్రవేత్తలు కనిపెట్టారు! మానసిక, శారీరక రుగ్మతలను నయం చేయడంలో సంగీతం ఒక దివ్యౌషధంగా పనిచేస్తుందన్నది పాత విషయమే అయినప్పటికీ, పుట్టగానే ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచిన పసికందుల నాడీకణాలు ‘నాగస్వరానికి’ ఫ్రెండ్లీగా రియాక్ట్‌ అవుతూ ఆరోగ్యంగా తయారవడాన్ని అక్కడి వైద్య పరిశోధకుల బృందం తాజాగా గమనించింది. రకరకాల వాద్యాలతో మ్యూజిక్‌ ప్లే చేసి వినిపించగా, ఎక్కువ మంది శిశువుల్లోని మెదడు కణాలు నాగస్వారానికి ఉల్లాసంగా నాట్యం చేసినంత పని చేశాయట. పాముల్ని ఆడించేవాళ్ల ఫ్లూట్‌లో ఇంతుందా! పాముబూరను కనిపెట్టింది ఇండియా కాగా, బూరలో మెడిసిన్‌ ఉందని ఇప్పుడు జెనీవా కనిపెట్టింది.

సీక్రెట్‌ ఫస్ట్‌ లేడీ
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ రహస్య ప్రియసఖి అలీనా కబేవా (36) ఈ నెల మొదట్లో ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో మంచి విషయం ఏముంది, వివాహేతర సంబంధం సామాజిక విలువలకు విరుద్ధం కదా! పుతిన్‌ని వదిలేయండి. అతడు ఆమె కోసం ఏం చేశాడో చూడండి. ప్రసవం కోసం అలీనాను చేర్పించిన కురాకోవ్‌ తల్లీపిల్లల ఆసుపత్రిలోని వీఐపీ ఫ్లోర్‌ మొత్తాన్నీ ఒక నెలరోజుల పాటు రిజర్వు చేయించాడు.

ఆమెకు ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణ ఇప్పించాడు. ఇదంతా కూడా అజ్ఞాతంలో ఉండే! అటుగా వెళ్లిన జర్నలిస్టు ఒకరికి ఇక్కడేదో ‘ప్రత్యేకంగా’ కనిపిస్తోందే అని అనుమానం వచ్చి ఆరా తీస్తే లోపల ‘సీక్రెట్‌ ఫస్ట్‌ లేడీ’ ఉన్నట్లు బయటపడింది. ఇంతకీ ఇందులో మంచి విషయం ఏముంది? జననం మంచి విషయమే కదా. పైగా ట్విన్స్‌! అన్నట్లు అలీనా.. పుతిన్‌ లవర్‌ అని కొంత మందికి తెలియకపోవచ్చు కానీ.. ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్టుగా ఆమె ప్రపంచానికంతటికీ పరిచయమే.

ఆరుగురికి ఇద్దరు
1960లలో భారతదేశంలో ఒక తల్లికి సగటున ఆరుగురు పిల్లలు ఉండేవారు. ఇప్పుడా సంఖ్య రెండుకి తగ్గిందన్నది తాజా వార్త. కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల మహిళల ఆరోగ్య పరిస్థితులు మెరుగవడంతో పాటు, స్త్రీ సాధికారతకు అవకాశాలు ఏర్పడుతున్నాయని భారత కుటుంబ ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

ఎగ్‌ బాయ్‌
ఈ ఏడాది మార్చి 15న న్యూజిలాండ్‌లోని ఒక మసీదులో మధ్యాహ్నపు ప్రార్థనలలో మునిగి ఉన్నవారిపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో యాభై మందికి పైగా దుర్మణం చెందిన ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. అయితే ఆస్ట్రేలియా ఫెడరల్‌ సెనెటర్‌ ఫ్రేజర్‌ ఆనింగ్‌కి మాత్రం ఆ ఉగ్రచర్య అత్యంత సహజమైనదిగా అనిపించింది! ‘‘ముస్లిం వలసల కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయి’’ అని ఇటీవల ఆయన బహిరంగంగానే ఒక ప్రసంగంలో అన్నారు. ఆ మాటతో విభేదించిన విల్‌ కన్నోల్లీ అనే 17 ఏళ్ల ఆస్ట్రేలియన్‌ బాలుడు ఆనింగ్‌ తలకు తగిలేలా గురి చూసి కోడిగుడ్డును విసిరాడు.

ఈ ఘటన విపరీతంగా వైరల్‌ అయి, కన్నోల్లీకి ‘ఎగ్‌ బాయ్‌’ అనే పేరొచ్చింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ఎగ్‌బాయ్‌ 70 వేల డాలర్లను మసీదులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు విరాళంగా ఇచ్చాడు. అంత డబ్బు ఆ కుర్రాడికి ఎలా వచ్చింది? కన్నోల్లీని పోలీసులు అరెస్ట్‌ చేసినప్పుడు అతడి తరఫున వాదించడానికి అవసరమైన డబ్బు కోసం సోషల్‌ మీడియాలో రెండు అకౌంట్‌లు తెరిస్తే, వాటిల్లోకి విరాళాలుగా వచ్చిపడ్డాయి. న్యాయస్థానం అతడిపై కేసు కొట్టేయడంతో ఆ డబ్బు మిగిలింది. దానికి తను కొంత కలిపి డొనేట్‌ చేశాడు. కన్నోల్లీది పిల్ల చేష్ట కాదన్నమాట. మరేమిటి? ధర్మాగ్రహం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top