బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ | ileana special interview | Sakshi
Sakshi News home page

బోల్డ్ అండ్ బ్యూటిఫుల్

Jul 2 2016 10:39 PM | Updated on Apr 3 2019 5:44 PM

బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ - Sakshi

బోల్డ్ అండ్ బ్యూటిఫుల్

బోలెడు బ్యూటీ అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. బోల్తా పడ్డామా? అచ్చు తప్పు పడిందా? అదేమీ కాదండీ... ఇలియానా భలే బోల్డ్‌గా మాట్లాడింది!

బోలెడు బ్యూటీ అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. బోల్తా పడ్డామా? అచ్చు తప్పు పడిందా? అదేమీ కాదండీ... ఇలియానా భలే బోల్డ్‌గా మాట్లాడింది! బోలెడు విషయాలు బోల్డ్‌గా చెప్పింది. ఈ రోజుల్లో ఏ హీరోయిన్ అయినా కొంచెం మనసు బాగోలేకపోతే.. సైకియాట్రిస్ట్ దగ్గరికి పోయాను అని చెప్పుకుంటారా? బోల్డ్‌గా చెప్పేసింది! ఎవర్ని చేసుకుంటున్నావ్ అని అడిగితే ఉప్పందిస్తారా? టిప్ ఇస్తారా? ఏమీ లేదు! కానీ ఇలియానా... టపటపా చెప్పేసింది. లావు, సన్నం, బాధ, సంతోషం, ఆఫర్లు, ఫ్లాపులు... ఓయమ్మ! ఒక్కటి కాదు. బోలెడు విషయాలు బోల్డ్‌గా చెప్పేసింది.అమ్మాయి చూడ్డానికి బ్యూటీ!  అమ్మాయి మనసు బోల్డ్ అండ్ బ్యూటీఫుల్!!

కొంచెం లావైనట్లున్నారు?

ఇలియానా: ‘బర్ఫీ’ సినిమా ఒప్పుకున్నప్పుడు ఆ చిత్రకథానాయకుడు రణబీర్‌కపూర్ ముందు నేను లావుగా ఉన్నాననిపించింది. దాంతో సన్నబడ్డాను. కొంచెం తగ్గి ఉంటే బాగానే ఉండేది. బాగా తగ్గాను. ఆ సినిమాలో కాటన్ శారీస్ కట్టుకున్నాను కాబట్టి, సన్నబడిన విషయం ఎలివేట్ కాలేదు. ‘హ్యాపీ ఎండింగ్’లో స్పష్టంగా కనిపించింది. అంత బాగాలేకపోవడం తో బరువు పెరిగాను.

ఈ మధ్య ‘బాడీ షేమింగ్’ గురించి చాలా ఘాటుగా స్పందిస్తున్నారు.. మీ మాటలు చూస్తుంటే వ్యక్తిగతంగా చేదు అనుభవాలు ఎదురయ్యాయనిపిస్తోంది...
నిజమే. చిన్నప్పుడు నేను లావుగా ఉండేదాన్ని. ‘బిగ్ బట్’ (పిరుదులు) కూడా. దాంతో అందరూ ఏడిపించేవారు. కొంతమంది డెరైక్ట్‌గా.. మరికొంతమంది ఇన్‌డెరైక్ట్‌గా హేళన చేసేవాళ్లు. నా ఫిజిక్ విషయంలో నాకంత ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. సన్నగా ఉన్నవాళ్లను లావు అవ్వమనీ, లావుగా ఉన్నవాళ్లను సన్నబడమనీ అంటుంటారు. మొత్తం మీద ఎలా ఉన్నా తప్పే అని వయసు పెరిగే కొద్దీ అర్థమైంది. చాన్నాళ్లు మౌనంగా భరించాను. ఇప్పుడు నా వల్ల కాదు. అందుకే ‘నా ఇష్టం.. నేనెలా ఉంటే మీకేంటి?’ అని మొహం మీదే అనేస్తున్నా.

ఒకవేళ మీ ఫిజిక్‌ని విమర్శించకుండా పొగిడితే...?
నా పాయింట్ నన్ను పొగడమని కాదు. ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అంటే నేను నమ్మను. మీ ఫిజిక్ కత్తిలా ఉందంటే అందమైన అబద్ధం అంటాను. ఎందుకంటే ఊహ తెలిసినప్పట్నుంచీ అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నాగా. నా ఫిజిక్ అంత బాగుండదని నాకు తెలుసు. అది నా తప్పు కాదు. ఇలా పుట్టాలని నా అంతట నేను కోరుకోలేదు. అందుకే కామెంట్ చేయొద్దంటాను. మనం ఒకరికి కాంప్లిమెంట్ ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. కామెంట్ మాత్రం చేయకూడదు.

ఫిజిక్ విషయంలో ఇంతగా ఆలోచిస్తారని మీరు తెలుగు సినిమాలు చేసినంతవరకూ తెలియదు. బహుశా బాలీవుడ్‌కి వెళ్లాకే ఆ ఫీలింగ్ మొదలైందేమో?
అవును. బయటికెళితే నలుగురూ అదో రకంగా చూస్తున్న ఫీలింగ్. ఏదో కామెంట్ చేస్తున్నారేమోనని సందేహం. వ్యంగ్యంగా నవ్వుతున్నారనిపించేది. దాంతో చాలా ఒత్తిడికి గురయ్యాను. నిద్రపోని రాత్రులు చాలానే ఉన్నాయి. ఈ ఒత్తిడి ఎంత దూరం వెళ్లిందంటే నా మీద నాకు పూర్తిగా ఆత్మవిశ్వాసం లేకుండాపోయింది. ఇలా అయితే నలుగురిలోకీ వెళ్లలేం అని ఓ థెరపీ తీసుకున్నా.

ఏంటా థెరపీ?
సైకాలజిస్ట్‌ని కలిసి, నా సమస్య మొత్తం చెప్పేశాను. యాక్చువల్లీ సైకాలజిస్ట్‌ని కలవడం నా జీవితంలో నేను చేసిన మంచి పని. కొన్ని సిట్టింగ్స్ తర్వాత మామూలు మనిషయ్యాను. ఇప్పుడు డెరైక్ట్‌గానే నా ఫిజిక్ గురించి కామెంట్ చేసినా, లైట్ తీసుకునేంత ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎందుకంటే నా ఫిజిక్‌ని ప్రేమించడం మొదలుపెట్టా. దాంతో మిగతా వాళ్లు పాజిటివ్‌గా చూస్తున్నట్లనిపిస్తోంది.

నేనెలా ఉన్నా ఇష్టపడతాడు!
ఏ మనిషికైనా.. ఆ మనిషి ఎలా ఉన్నా ఇష్టపడేవాళ్లు ఒక్కరైనా ఉంటారు.. మీకలా ఆండ్రూ నీబోన్ (ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్-ఇలియానా బాయ్‌ఫ్రెండ్) అనుకోవచ్చా?
తప్పకుండా. నేను మేకప్ వేసుకున్నా ఆయనకిష్టమే. వేసుకోకపోయినా ఇష్టమే. పొద్దునే నిద్రలేస్తాను కదా.. ఆ నిద్రమొహం కూడా ఆయనకిష్టమే. ఎప్పుడైనా ఒత్తిడితో కళ్ల కింద నల్ల వలయాలు వస్తాయి కదా.. అవి కూడా ఆండ్రూకి నచ్చుతాయ్. నా జుత్తు రేగిపోయినా బాగానే ఉందంటాడు. మామూలు పైజామా, కుర్తాలు వేసుకున్నా సూపర్ అంటాడు. నన్ను నన్నుగా ఇష్టపడతాడు.

ఇంత చెబుతున్నారు.. మరి పెళ్లెప్పుడు?
నేనేదీ ప్లాన్ చేయను. ఒక వ్యక్తిని ఇష్టపడితే వెంటనే పెళ్లాడాలని లేదు. దేనికైనా టైమ్ రావాలి.

‘నా పేరంట్స్ చాలా బెస్ట్’ అని మీరు పలు సందర్భాల్లో అన్నారు. మరి.. వాళ్లతో కూడా మీరెదుర్కొన్న ఒత్తిడిని షేర్ చేసుకోలేదా?
మనల్ని పెంచి, పెద్ద చేయడానికి అమ్మానాన్న చాలా కష్టాలు పడతారు. పెద్దయ్యాక కూడా వాళ్లను కష్టపెట్టడం సరికాదు. అందుకే వాళ్లతో చెప్పలేదు. సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకున్నాను.

నెగటివ్ కామెంట్స్ ఓ వ్యక్తి పై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తాయంటారు?
ఒకళ్ల గురించి మంచి మాటలు మాట్లాడకపోయినా ఫర్వాలేదు చెడు మాత్రం మాట్లాడకండి. సునిత మనస్కులు విపరీత నిర్ణయా లు తీసుకునే ప్రమాదం ఉంది. ఒకళ్ల జీవితంతో ఆడుకునే హక్కు మనకెవరికీ లేదు. ‘అవుటర్ లుక్’ అనేది దేవుడిచ్చింది. ‘ఇన్నర్’గా ఎలా ఉన్నాం? అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇన్నర్‌గా సరిగ్గా లేకపోతే అది మన తప్పు అవుతుంది. అప్పుడు కూడా అవతలివాళ్లు విమర్శించకూడదు. ఒకళ్లు చేసే తప్పులు మనం చేయకుండా ఉంటే చాలు.

ఈ ప్రపంచంలో బతకాలంటే అందం చాలా అవసరమా?
కానే కాదు. మీరు గమనిస్తే.. ఏ లోపం లేని వాళ్లు ఎవరూ ఉండరు. అలాగే ఏదో ఒక యాంగిల్‌లో బాగుండని వాళ్లూ  ఉండరు. అందం అనేది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కాదనడంలేదు. మనం అందంగా  లేమనుకునే వాళ్లు కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. మనం ఎందులోనూ తక్కువ కాదనే భావన పెంచుకోవాలి.

ఆడ, మగ మధ్య ప్రేమబంధం శాశ్వతంగా నిలవాలంటే...?
నమ్మకం, గౌరవం ముఖ్యం. ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఒకరినొకరు నమ్మాలి. అలాగే ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవాలి. అప్పుడే ఆ బంధం నిలబడుతుంది. ఈ రెండు విషయాలతో పాటు సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న అబ్బాయిలంటే నాకిష్టం.

ఆ మధ్య ట్విట్టర్‌లో ఓ గర్భవతి ఫొటో పెట్టి, బిడ్డను మోస్తున్న తల్లి భలే అందంగా ఉంటుందన్నారు..  మరి బిడ్డను మోయాలనే ఆరాటం మీకు లేదా?
(నవ్వుతూ). నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నా సిస్టర్‌కి ఒక బాబు ఉన్నాడు. వాడితో ఉంటే నేనన్నీ మర్చిపోతాను. ‘హ్యాపీ ఎండింగ్’ తర్వాత కొత్త సినిమాలేవీ కమిట్ కాలేదు. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో నా ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎంజాయ్ చేశాను. నిజంగా అవి లవ్లీ డేస్.

అసలే హీరోయిన్ల కెరీర్‌కి లాంగ్విటీ ఉండదు. ఇక ఏడాదిన్నర గ్యాప్ అంటే వెనకపడ్డట్టే కదా?
నేనలా అనుకోవడంలేదు. గ్యాప్ విషయంలో నాకెలాంటి పశ్చాత్తాపం లేదు. ‘హ్యాపీ ఎండింగ్’ బాగా ఆడలేదు. దాంతో నిరుత్సాహపడ్డాను. ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చినా మళ్లీ చేదు అనుభవం ఎదురవుతుందేమోనని భయం వేసింది. వచ్చిన వాటిలో గొప్పగా అనిపించిన కథలు లేకపోవడంతో చేయలేదు. ‘రుస్తుం’ కథ వినగానే, మంచి సినిమా కోసం ఏడాదిన్నర వెయిట్ చేయడం మంచి పనైందనిపించింది.

తెలుగు నుంచి అవకాశాలు రావడం లేదా?
అప్పుడప్పుడూ వస్తున్నాయి. కానీ, చేస్తే మంచి సినిమా చేయాలి. లేకపోతే ఖాళీగా ఉండాలనుకుంటున్నాను. ఏడాదికి నాలుగు సినిమాలు చేసిన రోజులున్నాయి. ఇంకా ఆరాటం ఎందుకు? ఎక్కడో చోట వేగం తగ్గించాలి. నేనిప్పుడు తగ్గించా.

సినిమా పరిశ్రమలో ఒక్కోసారి కెమెరా ముందు మాత్రమే కాకుండా వెనక కూడా నటించాల్సి వస్తుందని ఆ మధ్య అన్నారు.. మీరలా చేసేవారా?
నేననే కాదు.. దాదాపు అందరికీ ఆ పరిస్థితి వస్తుంది. ఎదుటి వ్యక్తి ఎంత సుత్తి కొట్టినా మొహమాటానికి నవ్వాల్సి వస్తుంది. నచ్చకపోయినా నాలుగు మాటలు మాట్లాడాల్సి వస్తుంది... పెదాలకు నవ్వు అతికించుకుని మరీ. అలా చేయడం అవసరమా? అనుకోవచ్చు. ఇంటి నుంచి కాలు బయట పెట్టాక తారసపడే ప్రతి మనిషితోనూ గొడవలు పడలేం కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ సర్దుకుపోవాల్సి ఉంటుంది.

ఖాళీ సమయాల్లో మీరేం చేస్తారు?
బొమ్మలు గీయడం ఇష్టం. స్నేహితులతో కలిసి టీవీ చూడటమో, థియేటర్‌కి వెళ్లి సినిమా చూడటమో చేస్తుంటాను. నాకు రొమాంటిక్ కామెడీ మూవీస్ ఇష్టం. యానిమేషన్ మూవీస్‌ని కూడా వాచ్ చేస్తాను. వంట చేస్తుంటాను. ఇల్లు చక్కబెడతాను. కారు కడుగుతాను. తోట పని చేస్తాను. ఇలా ఏదో ఒకటి చేస్తుంటాను.

ఫైనల్లీ తెలుగులో గుర్తున్న రెండు, మూడు మాటలు...
అళ్దమైంది.. బాగున్నరా.. చాలా బాగుంది..

అది అళ్దమైంది కాదు.. అర్థమైంది అనాలి. బాగున్నరా కాదు.. బాగున్నారా అనాలి..
ఓకే ఓకే.. అర్థమైంది.. తెలుగు ప్రేక్షకులందరూ బాగున్నారా.... అందరికీ హాయ్.   
- డి.జి.భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement