పీసీవోడీకి చికిత్స ఉందా?

 Homeopathic Treatment  For PCO - Sakshi

హోమియో కౌన్సెలింగ్‌

నా భార్య వయసు 34 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా?

రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి  నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీవోడీ (పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌) అంటారు.

ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్‌ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్‌ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ.

లక్షణాలు : నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

దీనివల్ల సంతానకలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్‌ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్‌ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్‌ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్‌ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు.

తరచూ తలనొప్పా? 
మీకు తరచూ తలనొప్పి వస్తోందా? కొంతమంది తలనొప్పి రాగానే మెడికల్‌ షాపుకు వెళ్లి ఏదో ఓ తలనొప్పి మాత్ర కొని ఠక్కున వేసుకుంటుంటారు. ఇలా అప్పుడప్పుడూ తలనొప్పి వస్తుండేవారు డాక్టర్‌ను సంప్రదించేలోపు ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోండి.

►మీరు ఎప్పుడూ కంప్యూటర్‌ మీద వర్క్‌ చేస్తుండేవారైతే ప్రతి అరగంటకు ఒకసారి అయిదు నిమిషాలు రిలాక్స్‌ అవుతూ ఉండాలి. కంప్యూటర్‌పై పని చేసే సమయంలో స్క్రీన్‌ను అదేపనిగా కనురెప్ప కొట్టకుండా చూడటం సరికాదు. మీ కళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడకుండా స్క్రీన్‌ ముందు కూర్చునేటప్పుడు యాంటీ గ్లేయర్‌ గ్లాసెస్‌ ధరించడం కూడా మంచిదే.
►కుట్లు, అల్లికలు వంటి పనులు చేసేవారు, అత్యంత సూక్ష్మమైన ఇంట్రికేట్‌ డిజైన్లు చేస్తుండే సమయంలోనూ కళ్లు ఒత్తిడికి కాకుండా చూసుకోవాలి. తమ పనిలో తరచూ బ్రేక్‌ తీసుకుంటుండటం ద్వారా కంటిపై పడే అదనపు ఒత్తిడిని తగ్గించవచ్చు.  
►పిల్లల్లో తలనొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. కంటి చూపు సమస్యల కారణంగా  తలనొప్పి వచ్చే అవకాశాలు వారిలో ఎక్కువగా ఉంటాయి. తలనొప్పితో పాటు తల తిరగడం, వాంతుల కావడం వంటివి జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
►రోజూ ప్రశాంతంగా కనీసం ఎనిమిది గంటలపాటు నిద్ర పోవాలి. కొన్ని సందర్భాల్లో నిద్ర మరీ ఎక్కువైనా కూడా తలనొప్పి వస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి సరిపడినంతగా వారు నిద్రపోవడం మంచిది.
►మనకు సరిపడని పదార్థాలు తీసుకోవద్దు.
►ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లు తప్పనిసరిగా మానేయాలి.
►కాఫీ, చాకొలెట్స్, కెఫిన్‌ ఎక్కువగా పదార్థాలను తీసుకోవడం మానేయాలి. కెఫిన్‌ పాళ్లు ఎక్కువగా ఉండే కొన్ని రకాల శీతల పానియాలు అవాయిడ్‌ చేయడం అవసరం.
►ఏదైనా అలవాటు తలనొప్పిని దూరం చేస్తుంటే దానికే అలవాటు కావడం కూడా సరికాదు. ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంటే వాటిని పరిమితికి మించి తీసుకోవడం కూడా మంచిదికాదు.
►చీప్‌ సెంట్లు, అగరుబత్తీల్లాంటి ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్‌ఫ్యూమ్స్‌ను వాడకూడదు.  
►రణగొణ శబ్దాలకు ఎక్స్‌పోజ్‌ కాకుండా చూసుకోవాలి. పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల కొన్ని తలనొప్పులను నివారించవచ్చు.
ఇలాంటి జాగ్రత్తల తర్వాత కూడా తలనొప్పులు తరచూ వస్తుంటే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. అంతేగానీ... తలనొప్పి నివారణ మాత్రలు అదేపనిగా వాడటం సరికాదని గుర్తుంచుకోవాలి.
డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్,
హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top