ఆహహ్హహారం

Happy chemicals secrete to be positive - Sakshi

బాధ అన్నది ఆకలైతే 
ఫుడ్‌ అన్నది ఆనందం ఇస్తుంది. 
ఆనందం అన్నది దుఃఖం లాగే 
మన శరీరంలో కలిగే ఒక రసాయనిక చర్య. 
మనం ఆనందంగా ఉండాలనుకుంటే 
పాజిటివ్‌గా ఉండాలనుకుంటే 
సంతోష రసాయనాలు స్రవిస్తాయి. 
సో... ఆనందం అన్నది 
మన చేతుల్లోనే ఉంది. 
ఏదీ... చెయ్యి చాపండి
ఒక హ్యాపీ పీస్‌ అందుకోండి. 

సంతోషం సగం బలం మాత్రమే కాదు... ఇప్పుడు సంతోషం సంపూర్ణ బలం. ఈ రోజుల్లో రకరకాల ఆర్థిక, సామాజిక కారణాలతో సంతోషం దొరకడం చాలా కష్టమైపోతోంది. పైగా న్యూ ఇయర్‌ వచ్చి జస్ట్‌ నాలుగు రోజులే. మిగిలిన 360 రోజులూ... ఆపైన బతికి ఉన్న మిగతా రోజుల్లోనూ కావాల్సింది కూడా సంతోషమే. అప్పుడు బతుకు ఆనందమానందమానందమే అనిపిస్తుంది. మరి అలాంటి ఆనందం పొందేదెలా? చాలా సింపుల్‌. ఈ కథనం చదివితే చాలు. 

ఆనందం అనేది మరెక్కడో లేదు. మన మెదడులోనే ఉంటుంది. ఇదేదో వ్యక్తిత్వ వికాస ఉపన్యాసంలోని గంభీరమైన మాటో లేదా ఆధ్యాత్మిక ప్రవచనంలోని బ్రహ్మాండమైన వాక్యమో కాదు. అవును ఆనందం అన్నది అక్షరాలా మన మెదడులోనే ఉంటుంది. అక్కడ కొన్ని స్రావాలు రూపంలో సంతోషం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ స్రావాల ఊరుతూ, పెరుగుతున్నకొద్దీ సంతోషం కట్టలు తెంచుకుంటుంది. సంతోషాన్ని కలిగించే ఆ మెదడు స్రావాల్లో కొన్ని సెరిటోనిన్, ఎండార్ఫిన్, డోపమైన్, ఫినైల్‌ ఇథిలమైన్‌ అనే రసాయనాలు. అవి స్రవించడానికి దోహదపడేవి మనం దాదాపుగా రోజూ తీసుకునే ఆహార పదార్థాలు. అవేమిటో తెలుసుకుంటే సంతోషాన్ని హ్యాపీగా కొనుగోలు చేయవచ్చు కదా. అవేమిటో ఎక్కడ దొరుకుతాయో చూద్దాం. 

ఆనందాన్ని ఇచ్చే ఈ ఆహారాలన్నీ కేవలం సంతోషం కోసం మాత్రమే గాక పక్షవాతం, గుండెపోటు, మతిమరపు (డిమెన్షియా) వచ్చే ముప్పును 30 శాతానికి పైగా తగ్గిస్తాయని అనేక అధ్యయనాల్లో తేలింది. ఎండార్ఫిన్‌ ప్రధాన సోర్స్‌ పాయింట్‌ వ్యాయామం. మనం బాగా వ్యాయమం చేశాక మనలో ఒక సంతోషం నెలకొన్న భావన కలుగుతుంది. సాధారణంగా వ్యాయామం చేసే వాళ్లు, అంతా పూర్తయ్యాక ఒక తృప్తికరమైన, సంతోషకరమైన ఫీలింగ్‌లోనే ఉంటారు. అలా అనుభూతి కలిగించేది ఈ ఎండార్ఫినే! ఈ రకంగా చూస్తే సంతోషానికి మరో సోర్స్‌ ఎండార్ఫిన్‌ రూపంలో ప్రధానంగా జిమ్‌లో ఉంటుందన్నమాట. 

ఒక సంతోష స్రావం సెరిటోనిన్‌
పొద్దున్నే గిన్నెలో కాచీ కాచగానే... జాయ్‌ అనేది చాయ్‌ రూపంలోనో లేదా కాఫీ అనే మారువేషంలోనో మొదట గ్లాసులోకి జర్రున జారుతుంది. తర్వాత చుర్రున కాలుతూ నోట్లోకి చేరుతుంది. అక్కణ్నుంచి మెల్లగా హాయిగా గొంతులోకి దిగుతుంది. దాంతో మెదడులో సంతోషం  సర్రున పారుతుంది. అది పాల రూపంలో. దీనికి సోర్స్‌ పాయింట్‌ మన పాలపార్లర్లు. ఇక మన కాలనీలోకి వచ్చే తోపుడు బండి మీద కూడా సంతోషం గుట్టలు గుట్టలుగా పేర్చి ఉంటుంది పైనాపిల్‌ రూపంలో! అరటిపండ్ల రూపంలో గెలలుగా వేలాడుతూనూ ఉంటుంది. ఎలాగంటారా? ఈ అన్నిట్లో సెరిటోనిన్‌ ఉంటుంది. 

ఏంటా సెరిటోనిన్‌... ఏమా కథ: మనకు సంతోష భావనను ఇచ్చే రసాయనాల్లో ముఖ్యమైనది సెరిటోనిన్‌. అందుకే దీన్ని ‘హ్యాపీనెస్‌ హార్మోన్‌’ అని కూడా అంటారు. ఎక్కడెక్కడ దొరుకుతుంది: పాలలో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆసిడ్‌ ఉంటుంది. అది సెరిటోనిన్‌ స్రావం పెరిగేలా చేస్తుంది. ద్రాక్ష, నారింజల్లోనూ ట్రిప్టోఫాన్‌ ఎక్కువే. వెన్నలో,  విటమిన్‌ బి6 లభించే పొట్టుతో ఉండే ఆహారధాన్యాలు, బఠాణీలు, కాలీఫ్లవర్, అవకాడోలో, గుమ్మడిగింజల్లో సెరిటోనిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఉచితంగా ప్రతిరోజూ ప్రతి ఒక్కరికీ సెరిటోనిన్‌ లభించే మార్గం సూర్మరశ్మి. ఎక్కువగా నవ్వేవాళ్లలో సెరిటోనిన్‌ అధికంగా విడుదలవుతుంది. ఇక కాలేయం, కిడ్నీ, తాజామాంసం, కోడిమాంసంతో పాటు ఇటు క్యాబేజీ, బ్రకోలీ వంటివి కూడా సెరిటోనిన్‌ స్రవించేందుకు దోహదపడతాయి. ఇక ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్‌ ఎక్కువగా ఉండే అవకాడో, వాల్‌నట్‌లూ సెరిటోనిన్‌కు సోర్స్‌లే.  

ఇంకో సంతోష స్రావం డోపమైన్‌
మీరు చాలాకాలం తర్వాత కలిసిన ఆ ఫ్రెండ్‌ను చూసి ఆనందోద్వేగాలకు లోనవుతున్నారా? దానికి కారణం మన మెదడులో స్రవించే డోపమైన్‌. 

ఏమిటా డోపమైన్‌ : ఇది మన మెదడు చురుగ్గా ఉంచేలా చేసే రసాయనం. ఏదైనా సంతోషం కలిగినప్పుడు దాంతోపాటు మనలోకి ప్రవేశించే ఆ చురుకుదనానికి కారణం డోపమైన్‌. అలాగే ఏదైనా వేదన లేదా బాధ కలిగించే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోడానికి తగిన చురుకుదనాన్ని ఇచ్చేది కూడా ఇదే. 

ఎక్కడెక్కడ దొరుకుతుంది: ఇది కూడా అరటిపండ్ల బండి మీదే దొరుకుతుంది! పక్వానికి వచ్చిన అరటిపండులో టైరోసిన్‌ అనే అమైనో యాసిడ్‌ పాళ్లు ఎక్కువ. ఈ  అమైనోఆసిడ్‌... డోపమైన్‌ రసాయనాన్ని స్రవించేలా చేస్తుంది.  బీట్‌రూట్‌ డోపమైన్‌తో పాటు సెరిటోనిన్‌నూ స్రవించేలా చేస్తుంది. నువ్వులు, స్ట్రాబెర్రీలలో టైరోసిస్‌ చాలాఎక్కువ కావడంతో ఇవీ డోపమైన్‌ను విడుదలయ్యేలా చేస్తాయి. తాజా చికెన్‌ కూడా నార్‌ఎపీనెఫ్రిన్‌ అనే న్యూరోట్రాన్స్‌మిటర్‌తో పాటు డోపమైన్‌ స్రావానికి దోహదపడుతుంది. వెన్నలోని ప్రొటీన్‌లో ఉండే అమైనో ఆసిడ్స్‌ సైతం డోపమైన్‌ను స్రవించేలా చేస్తాయి. వెజిటేరియన్లను మినహాయిస్తే నాన్‌–వెజ్‌ ప్రియులకు ఇది మాంసం దుకాణాల్లోనూ, పెద్ద పెద్ద మాల్స్‌లోని నాన్‌–వెజ్‌ ఆహారాలు విక్రయించే కార్నర్‌లోనూ దొరుకుతుంది. ఎందుకంటే ఇది మాంసాహారం, గుడ్లు, చేపలు, సీఫుడ్స్‌లో ఉంటుంది.

మరో ఆనంద స్రావం ఎండార్ఫిన్‌
సపోజ్‌... ఏదో సమస్య మీలో బోల్డంత ఒత్తిడి కలుగుతూ మీకు బాధ కలిగిస్తోందనుకుందాం. అకస్మాత్తుగా ఒక పరిష్కారం దొరికి ఆ ఒత్తిడంతా తొలగిపోయినప్పుడు కలిగే సంతోషాన్ని గుర్తుతెచ్చుకోండి. హాౖయెన ఆ భావన కలగజేసే రసాయనమే ఎండార్ఫిన్‌. మనలో ఒత్తిడి కొండలా పేరుకుపోయిన ఉన్నప్పుడు ఆ గుట్టను పక్కకు తీసిన భావననిస్తూ మనలో యాంగై్జటీని తొలగించే రసాయనం ఇది. దాంతో ఇది స్రవించినప్పుడు మనలో ఒక ‘ఫీల్‌ గుడ్‌’ భావన కలుగుతుంది. ఏదైనా నొప్పి కలిగినప్పుడు దాని నుంచి ఉపశమనం కలగడానికి దోహదం చేసేది ఎండార్ఫినే.
ఎక్కడెక్కడ దొరుకుతుంది: నిజానికి ఎండార్ఫిన్‌ ప్రధానంగా లభించేది వ్యాయామంతోనే. అయితే వ్యాయామం తర్వాత ఆహారాల్లో చూస్తే దాని ప్రధాన వనరు చాక్‌లేట్లు. ఆ తర్వాత  విటమిన్‌–సి ఎక్కువగా ఉండే స్ట్రాబెర్రీస్‌ ఎండార్ఫిన్‌ స్రావానికి బాగా ఉపయోగపడతాయి. ఇక తియ్యటి ద్రాక్షలో కూడా ఎండార్ఫిన్స్‌ స్రవించేలా చేసే సామర్థ్యం ఉంది. విటమిన్‌–సి ఎక్కువగా ఉండే నారింజ, నిమ్మ జాతి పండ్లు సైతం ఎండార్ఫిన్స్‌ను ఎక్కువగా స్రవించేలా చేయగలవు. ఒక్కమాట గుర్తుంచుకోవాలి. ఎండార్ఫిన్‌ స్రవించాలంటే విటమిన్‌–సి కావాలి. కాబట్టి నిమ్మజాతి పండ్లు తింటే ఎండార్ఫిన్‌ను తీసుకున్నట్లే. ఇలా చాక్లెట్ల దుకాణంతో పాటు మళ్లీ పండ్ల బండిపైనే ఎండార్ఫిన్‌  పుష్కలంగా దొరుకుతుంది.

మరో సంతోష రసాయనం ఫినైల్‌
ఇథిలమైన్‌ : మీ ఆత్మీయులను చూడగానే మీ ముఖం ఆనందంతో ఎందుకు వికసిస్తుంది? మీలో చాలా ఉల్లాసపూరితమైన సంతోషభావన ఎందుకు కలుగుతుంది? ఇందుకు కారణం ‘ఫినైల్‌ ఇథిలమైన్‌’ అనే మరో మెదడు రసాయనం. 

ఎక్కడెక్కడ దొరుకుతుంది: చాక్లెట్‌ అనేది ఒక సంతోషసాగరం. చాలా ఆనందాలకు చాక్లెట్‌ మూలం. అలాగే ఫినైల్‌ ఇథమైన్‌కు కూడా ప్రధాన వనరు చాకోలెటే. అందుకేనేమో...  కొత్తగా ఫ్రెండ్‌షిప్‌ ఏర్పడినప్పుడు చాకోలెట్స్‌  ఇచ్చిపుచ్చుకుంటారు. చాకోలెట్‌లో ఉండే ఫినైల్‌ ఎథిలమైన్‌ మూడ్స్‌ను చక్కదిద్దుతుంది. మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. అందులోని కెఫిన్‌ మనసును ఉత్తేజ పరుస్తుంది. అలాగే  న్యూరోట్రాన్స్‌మిటర్‌ అయిన సెరిటోనిన్‌ను కూడా చాకోలెట్‌ స్రవింపజేస్తుంది. డార్క్‌ చాక్లెట్స్‌ వల్ల ఈ ప్రయోజనాలు ఒనగూరుతాయి. 

అలాగే విషాదాహారాలూ ఉన్నాయి. అవి ఇవే... 
సంతోషాలను ఇచ్చే ఆహారాల్లాగే విషాదాలను కలగజేసే ఆహారాలూ ఉంటాయి. అవి సెరిటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్‌ స్రావాల్ని తగ్గిస్తాయి. అవేమిటో చూద్దాం. కాఫీ మొదట్లో కాస్తంత ఉత్తేజం కలిగించినా అందులోని మితిమీరిన కెఫిన్‌ క్లేశాన్ని కలిగిస్తుంది. సిగరెట్‌లోని నికోటిన్‌. ఆల్కహాల్‌లు కూడా అంటే. నిషేధిత మాదకద్రవ్యాలైతే  అకస్మాత్తుగా సెరిటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్‌ పాళ్లను  మొదట ఎక్కువయ్యేలా చేసి, ఆ తర్వాత అవి ఎంత మోతాదులో విడుదల కావాలో అంత మోతాదులో కాకుండా... నియంత్రణ లోపించినట్లుగా విడుదలయ్యేలా చేస్తాయి. దాంతో  ఆయా  రసాయనాల మధ్య ఉండాల్సిన సమతౌల్యం లోపిస్తుంది. అందుకే ఇవన్నీ తొలుత తాత్కాలికంగా ఆహ్లాదం కలిగించినా... తీవ్రమైన విచారంలో ముంచి, తర్వాత ఆరోగ్యానికీ హాని చేస్తాయి. ప్యాకేజ్‌డ్‌ ఫుడ్స్‌లోని మోనోసోడియమ్‌ గ్లుటామేట్, ఐస్‌క్రీమ్స్, డోనట్స్, ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్స్, వైట్‌బ్రెడ్‌లు విషాదం కలిగించే ఆహారాలే. 
డాక్టర్‌ బి. చంద్రశేఖర్‌రెడ్డి
సీనియర్‌ న్యూరోఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్,
రోడ్‌ నెం. 12 బంజారాహిల్స్, హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top