భిన్న తలంబ్రాలు.. కల్యాణం చూతము రారండీ

Handicapped Marriages Special Story At Tamilnadu In Sakshi Family

దివ్యాంగుల వివాహాలు ప్రోత్సహించేందుకు తమిళనాడులో పథకాలు ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు కూడా పని చేస్తున్నాయి. నిన్న సోమవారం, అంటే నవంబర్‌ 18న చెన్నైలో 48 జంటల సామూహిక వివాహ మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవం భిన్నమైనది. హర్షించదగినది. ప్రోత్సహించదగినది. ఎందుకంటే వీరిలో దాదాపు అందరూ దివ్యాంగులే.

భారతదేశంలో పెళ్లి చాలా ముఖ్యమైన జీవన పరిణామం. స్త్రీల విషయంలో చూస్తే పురుషాధిపత్యం వల్ల తరాలుగా వారు ‘ఎంచుకోబడేవారు’గానే ఉన్నారు. ‘అబ్బాయికి నచ్చాలి’ అనేది ప్రాథమికమైన మెట్టుగా మన పెళ్లిళ్లలో కనిపిస్తుంది. అబ్బాయికి నచ్చితే సగం మాట ముందుకు నడిచినట్టే. అమ్మాయికి నచ్చడం పట్ల అమ్మాయి తల్లిదండ్రులు పట్టింపుకు పోవడం ముందు నుంచి మన దగ్గర తక్కువ. కట్నాలు, లాంఛనాలు అమ్మాయి తల్లిదండ్రులకు పెనుభారమై ‘అమ్మాయి గుండెల మీద కుంపటిలా కూచుని ఉంది’ అనే మాట వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. ‘అమ్మాయికి నచ్చాలి’ వరకూ ఎదిగారు. అయినప్పటికీ రూపం విషయంలో సమాజం ‘మెచ్చే ప్రమాణాలు’ లేని అమ్మాయిలకు వివాహం పెద్ద సమస్యగా ఉంది. అలాగే దివ్యాంగులకు పెళ్లి జరగడం ఇంకా సమస్యగా ఉంది. దివ్యాంగుడైన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే సాధారణ అమ్మాయిల సంఖ్యతో పోల్చితే దివ్యాంగురాలైన అమ్మాయిని చేసుకోవడానికి ముందుకు వచ్చే సాధారణ అబ్బాయిల సంఖ్య బహు తక్కువ. ఇవన్నీ దివ్యాంగులలో పెళ్లి సమస్యను సృష్టిస్తున్నాయి.

దివ్యాంగుల సామూహిక వివాహాలు

కాని పెళ్లి చేసుకునే హక్కు, తమ జీవన భాగ స్వామిని ఎంచుకుని జీవితాన్ని నిర్మించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తమిళనాడు ప్రభుత్వం ముందుగా ఈ విషయాన్ని గుర్తించింది. ఆ ప్రభుత్వం 1986లోనే అంధ వధువును వివాహం చేసుకునే సాధారణ వరునికి ఐదు వేల రూపాయల వివాహ ప్రోత్సాహకం ప్రకటించింది. ఇది క్రమంగా పెరుగుతూ దివ్యాంగులను పెళ్లి చేసుకునే సాధారణ వధు/వరులకు 25,000 రూపాయల ప్రోత్సాహం వరకూ పెంచబడి, ఇప్పుడు 50 వేల రూపాయలు ఇవ్వబడుతున్నాయి.

దివ్యాంగులను, సాధారణ వ్యక్తులు వివాహం చేసుకున్నా, దివ్యాంగులే పరస్పరం పెళ్లి చేసుకున్నా 25 వేల రూపాయల నగదు, 4 గ్రాముల తాళిబొట్టు తమిళనాడు ప్రభుత్వం అందజేస్తుంది. అదే ఈ దివ్యాంగులలో ఎవరైనా గ్రాడ్యుయేట్లు, డిప్లమా హోల్డర్లు ఉంటే 50 వేల రూపాయల నగదు, 8 గ్రాముల తాళిబొట్టు అందిస్తున్నారు. ప్రభుత్వమే కాకుండా ‘తమిళనాడు డిఫరెంట్లీ ఏబుల్డ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌’ సంస్థ కూడా దివ్యాంగుల వివాహాలను ప్రోత్సహిస్తోంది. ఇది ఒక రకంగా మ్యాట్రిమొనీలా పని చేసి జంటలను కలుపుతుంది. రాష్ట్రంలోని వధువు, వరులు ఎవరైనా ఈ సంస్థలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. సంస్థే తగిన జోడీని వెతికి సామూహిక వివాహ మహోత్సవం జరిపి ఒక్కటి చేస్తుంది.

ఈ వివాహ మహోత్సవం కూడా వాలెంటీర్ల సహాయంతో ఎంతో హుందాగా జరుగుతుంది. నడవలేనివారిని, చూడలేని వారిని, వినలేని వారిని, అర్థం చేసుకోలేని వారిని (బుద్ధిమాంద్యం) ఈ పెళ్లితంతు అర్థం చేయించి దానిని సరిగా ముగించేందుకు సాయపడే వాలెంటీర్లు ఉంటారు. సైగల ద్వారా, మాటల ద్వారా వీరు వివాహ తంతులో వధువరులకు సాయం చేస్తారు. అయితే అక్కడి ప్రభుత్వ విధానంగానీ, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న చైతన్య కార్యక్రమాలుగానీ కోరుతున్నది ఒక్కటే. దివ్యాంగులను దివ్యాంగులు వివాహం చేసుకోవడం కన్నా సాధారణ వ్యక్తులు వివాహం చేసుకుంటేనే సామాజిక న్యాయం జరుగుతుంది అని. చెన్నైలో జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలు అన్ని ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉంది.

మేరేజ్‌ బ్యూరోలకు రారు
దివ్యాంగులు తమ వివాహ సంబంధాల కోసం మేరేజ్‌ బ్యూరోలకు రావడం తక్కువ. మా వద్ద అప్లికేషన్‌ ఫామ్‌లో ఏదైనా శారీరక లోపం ఉందా అనే కాలమ్‌ ఉంటుంది. ఇన్నేళ్లలో దానిని నింపిన వాళ్లు బహు తక్కువ. పోలియో ఉన్నవారు ఒకరిద్దరు సంప్రదించారు. వీరంతా తమకు తెలిసినవారి ద్వారా పెళ్లి సంబంధాలు నిశ్చయించుకోవడానికి చూస్తారు. ఆర్థిక భద్రత లేదా గవర్నమెంట్‌ ఉద్యోగం ఉన్న దివ్యాంగురాలిని జీవితంలో ఇంకా సెటిల్‌ కాని కాలేని అబ్బాయిలు పెళ్ళిళ్లు చేసుకోవడం చూశాను. దివ్యాంగ ఆడపిల్లల విషయంలో సంబంధాలు రావడానికి అవసరమైన పరిణితి, హృదయం ఉన్న కుర్రవాళ్లు తయారు కావాల్సి ఉంది.
– బి.నాగకుమారి,  మేరేజ్‌ బ్యూరో కన్సల్టెంట్, హైదరాబాద్‌.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top