బంగారం లాంటి సత్యం | Sakshi
Sakshi News home page

బంగారం లాంటి సత్యం

Published Mon, Jun 4 2018 2:08 AM

Golden Truth - Sakshi

‘దేవుడు లేడు, రసవాదం లేదు అన్న విషయం కొండ మీదినుంచి గుండును దొర్లించినట్టు! అవి వున్నాయనుకోవడం, నమ్మగలగడం గుండును కొండ మీదకు ఎక్కించినట్లు. రెండో పనిని చేయలేక అందరూ మొదటి పనే చేస్తారు’ అంటాడు శ్రీపతి. ప్రాచీన కాలంలో రసవాదం ఉందా? సిద్ధులు, యోగులు తమ అవసరాన్ని బట్టి బంగారం చేసుకునేవారా? వేమన పద్యాల్లో పరుసవేది విద్యకు సంబంధించిన జ్ఞానాన్ని గుప్త సంజ్ఞల్లో అందించాడా? ఈ ప్రశ్నలకు జవాబులు విప్పుతూ ఆసక్తికరంగా సాగుతుంది చివుకుల పురుషోత్తం నవల ‘మహావేధ’.

గంగాధరుండె దైవము
సంగీతమె చెవులకింపు సర్వజ్ఞులకున్‌
బంగారమె యుపభోగము
అంగజుడే మృత్యు హేతువరయుగ వేమా

నీలకంఠశాస్త్రి ఇంటికి శ్రీపతి వెళ్లినప్పుడు అక్కడ సిద్ధవైద్యం చేసే రామారెడ్డి స్వామి పై పద్యం చదువుతుండటంతో నవల ప్రారంభం అవుతుంది. పైకి సామాన్యంగా కనబడే ఈ పద్యంలో బంగారం చేసే ప్రక్రియకు సంబంధించిన ఒక గురుసూత్రం ఒక పిసరును వేమన విడిచారంటాడు రామారెడ్డి స్వామి. వారి సంభాషణ రసవాదం వైపు మరలుతుంది.  రసవాదంలో అదివరకే నమ్మకమున్న శ్రీపతికి ఇది ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. 

శ్రీపతి లోతుగా తన పరిశోధన మొదలుపెడతాడు. తన విశ్వాసాన్ని నిరూపించేందుకు యావజ్జీవితాన్ని పణంగా పెడతాడు. ఎన్నో దారుల్లో ప్రయాణిస్తాడు. ఎన్నో అనుభవాలను గడిస్తాడు. అయినవాళ్లకీ పరాయివాళ్లకీ కూడా కాకుండా పోతాడు. ఏవో ఆకులు, ఏవో పసరులు, ఏవో మూలకాలు, ఏవో పూజాద్రవ్యాలతో తన హోమం సాగిస్తాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో శాస్త్ర విజ్ఞానాల గురించీ, స్త్రీ పురుష సంబంధాల గురించీ, బ్రాహ్మణ శూద్ర అంతరాల గురించీ, అచల సంప్రదాయం గురించీ, ఎన్నో వ్యాఖ్యానాలను శ్రీపతి రూపంలో రచయిత చేస్తాడు.

చిట్టచివరకు బంగారం కనిపెడతాడు శ్రీపతి. కానీ దాన్ని జనం ముందు ప్రదర్శన పెట్టినరోజు ‘విఫలమవుతాడు’. ఆయన మీద చెప్పులు, అరటి తొక్కలు, ఖాళీ సిగరెట్‌ ప్యాకెట్లు విసిరేస్తారు. ఎవరివల్లయితే ఈ అన్వేషణకు పూనుకున్నాడో ఆ రామిరెడ్డి స్వామిని మాత్రం తన సత్రానికి తీసుకెళ్లి తను తయారుచేసిన బంగారుకడ్డీని ‘గురు బ్రహ్మార్పణమస్తు’ అని అందజేస్తాడు. రామిరెడ్డి ఆశ్చర్యపోతే, ‘మీకు తెలియాలి, మూర్ఖులకు తెలిస్తేనేం తెలియకపోతేనేం’ అంటాడు. బంగారం తయారుచేసే విద్య తెలిసినా అది లోకానికి తెలియడం వల్ల ప్రయోజనం లేదు. ఒక రహస్యాన్ని తెలుసుకోవడానికి కూడా ఒక అర్హత కావాలన్న అంతరార్థంతో నవల ముగుస్తుంది.

Advertisement
Advertisement