ఒక పక్షి పూసింది

The golden medal of any girl is a surprise - Sakshi

గర్ల్‌ చైల్డ్‌

ఎక్కడైనా ఏ ఆడపిల్లయినా పక్షిలా ముక్కున గోల్డ్‌ మెడల్‌ కరుచుకొచ్చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇదెలా సాధ్యం అయిందని! ఎందుకవదూ.. ఎదుగుదల సృష్టి సహజగుణం అయినప్పుడు? ఎదుగుదలను పైకి కనిపించేలా చెయ్యడం కూడా ప్రకృతి గుణమే. పైకి కనబడుతోందే దేవుడా, పాడుకళ్లను పడనివ్వకూడదని రెక్కల్ని దాచేస్తే ఎలా?! ఎదుగుతున్న ఆడపిల్ల ఉన్న ఇల్లు ధైర్యంగా ఉండొద్దూ! 

మాధవ్‌ శింగరాజు
ఆడపిల్ల ఎదిగితే పువ్వు పూసినట్లుగా ఉంటుంది. మగపిల్లాడు ఎదిగితే పక్షి ఎగిరినట్లుగా ఉంటుంది. పువ్వు పూసినట్లుగా ఉండాలని ఆడపిల్ల, పక్షి ఎగిరినట్లుగా ఉండాలని మగపిల్లాడు నైటవుట్స్‌ చేసేమీ ఎదగరు. వాళ్ల మానాన వాళ్లు మెల్లిగా ఎదుగుతారు. ఇంట్లో పెట్టిందేదో ఇంత తిని, రోజూ స్కూల్‌కి వెళ్లొస్తూ, బాగా చదివి పరీక్షలు రాస్తూ, ఉద్యోగాలకు ప్రిపేర్‌ అయి ఇంటర్వ్యూలు నెగ్గుకొస్తూ.. ఓ రోజెప్పుడో దీపాలు పెట్టే వేళకు అకస్మాత్తుగా మన ఇంట్లోకి స్వీట్‌ బాక్సుతో వచ్చేస్తారు.. ‘ఆంటీ, నాకు యు.ఎస్‌.ఫర్మ్‌లో ఓవర్‌సీస్‌ ఎగ్జిక్యూటివ్‌గా జాబ్‌ వచ్చింది. నెలలో సగం రోజులు ఫ్లయిట్‌ జర్నీలే.. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ..’ అని అమ్మాయి చెబుతుంది! ‘అంకుల్, ఇక్కడే సిటీ బ్రాంచ్‌లో నాకు ప్రొబేషనరీ ఆఫీసర్‌గా పోస్టింగ్‌ వచ్చింది. నాన్న కోరుకున్నట్లే టెన్‌ టు ఫైవ్‌ బ్యాంక్‌ జాబ్‌’ అని అబ్బాయి చెబుతాడు.

అప్పుడు కూడా ఆ ఎదిగిన అమ్మాయి ‘ఒక పువ్వు పూసినట్లుగా’నే, ఆ ఎదిగిన అబ్బాయి ‘ఒక పక్షి ఎగరబోతున్నట్లుగా’నే అనిపిస్తారు తప్ప.. అమ్మాయి చేయబోయేది జర్నీల జాబ్‌ కనుక ఆమెను ‘ఎదిగిన పక్షి’లా, అబ్బాయికి వచ్చింది ఎటూ కదలకుండా కూర్చొని చేసే ఉద్యోగం కనుక అతడిని ‘ఒదిగిన పువ్వు’లా చూడలేం. ఆడపిల్లకు అంత పెద్ద బలమైన, మెరిసే అందమైన, చక్కటి డిజైన్‌లు ఉన్న ఖండాంతర రెక్కలు ఉన్నప్పటికీ ఆమె పక్షి కాలేదు, పువ్వే! ఎందుకు పువ్వంటే, పువ్వులా పెంచుకుంటాం కనుక. మగపిల్లాడు గాలికి ఎదిగితే, ఆడపిల్ల గాలిలోకి పరిమళాలు వెదజల్లుతూ ఎదుగుతుంది. అక్కడొస్తుంది భయం. పువ్వులా పెంచడం ఆ భయానికే.  మనమ్మాయి ఎదగాలి. కానీ ఇంట్లోనే ఉండి ఎదగాలి! బయటి వాటర్‌ బాటిల్స్‌ తాగకూడదు.

బయటి గాలి పీల్చకూడదు. బయటి సూర్యరశ్మి తగలకూడదు. కుండీలోని పువ్వు ఎంతవరకు ఎదుగుతుంది? మహా అయితే మెట్టినింటి గోడ మీది వరకు. అక్కడా మళ్లీ ఆ కుండీలోనే. అందుకే ఎక్కడో ఏ మానుకో పుట్టి, స్వేచ్ఛగా ఎదిగి, పక్షిలా ఎగిరిన పువ్వును చూస్తే ప్రపంచానికింత విడ్డూరం! సైకిల్‌ ఎవరైనా నడపగలిగిందే. ఆడపిల్ల నడిపితే సర్‌ప్రైజింగ్‌. ర్యాంక్‌ ఎవరికైనా వచ్చేదే. ఆడపిల్లకు వస్తే అమేజింగ్‌. ఎవరెస్టు ఎత్తు ఎవరికైనా ఒకటే. ఆడపిల్ల ఎక్కితే ఎస్టానిషింగ్‌. ఆడపిల్ల సాధించిన ప్రతి విజయంలోనూ మనమిలా ఎందుకు ‘ఆ’ అని నోరు తెరుస్తామంటే.. నడిచే దారిలో నడవనివ్వకుండా, పరుగెత్తే దారిలో పరుగెత్తనివ్వకుండా, పడిలేచే దారిలో పడిలేవనివ్వకుండా ఆడపిల్లల్ని అరచేతుల్లో పెట్టుకుని మనమే నడుస్తూ, మనమే పరుగులు తీస్తూ, మనమే పడిలేస్తూ ఉంటాం కదా.

అందుకు. ఎక్కడైనా ఏ ఆడపిల్లయినా పక్షిలా ముక్కున గోల్డ్‌మెడల్‌ కరుచుకొచ్చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇదెలా సాధ్యం అయిందని! ఎందుకవదూ.. ఎదుగుదల సృష్టి సహజగుణం అయినప్పుడు? ఎదుగుదలను పైకి కనిపించేలా చెయ్యడం కూడా ప్రకృతి గుణమే. ఆడపిల్ల అచీవ్‌మెంట్స్‌ మార్కుల్లో, న్యూయార్కుల్లో మాత్రమే పైకి కనిపించి, ఆమె ఫిజికల్‌ గ్రోత్‌ ఎప్పుడూ ఆ పన్నెండేళ్ల లోపు స్కర్ట్‌ లోపలే కనిపించకుండా ఉండిపోవాలని కోరుకుంటే.. ‘ఓకే పేరెంట్స్‌.. అలాగే చేద్దాం.. మీ అమ్మాయికొక మంచి వరుడు దొరికే వరకు’ అంటుందా ప్రకృతి మన వాకిట్లోకి వచ్చి. అనదు. అనకపోగా, మన అనుమతి లేకుండా ఇంటి లోపలకి వచ్చి..  బెడ్‌ మీద చుట్టూ బుక్స్‌తో బోర్లా పడుకుని కాళ్లు పైకీ కిందికీ ఆడిస్తూ హోమ్‌వర్క్‌ చేసుకుంటున్న మన అమ్మాయి బుగ్గలు పుణికి, ఆమె పసి పాదాలకు, అమాయకపు చుబుకానికి ఇంత పసుపు, గంధం రాసి వెళ్తుంది! ఏం చేస్తాం? ‘హనీ, సరిగ్గా కూర్చో నాన్నా’ అంటాం.

పిల్ల వినకపోతుంటే వెళ్లి, సరిచేసి కూర్చోబెడతాం. ‘ఇలా ఉంటేనే నాకు కంఫర్ట్‌గా ఉంటుంది మమ్మీ’ అంటున్నా వినకుండా! హింస ఇది ఆడపిల్లకు. హింసే! ఒంటిని టచ్‌ చెయ్యడం కన్న పెద్ద హింస ఒంటిని స్వేచ్ఛగా ఎదగనివ్వకపోవడం. ఇంట్లో ఆడపిల్ల ఎదుగుతుంటే భయం ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. లండన్‌లోని ‘గార్డియన్‌’ పత్రికా కార్యాలయానికి ఇటీవల కొంతకాలంగా ఫోన్‌లు వస్తున్నాయి. ‘మా చుట్టు పక్కల ఇళ్లలో బ్రెస్ట్‌ ఐరనింగ్‌ (గుండ్రాయిని వెచ్చబరిచి ఛాతీని అదమడం) జరుగుతోంది, ఎవరికి కంప్లైంట్‌ చెయ్యాలి? అని!  ఆఫ్రికా దేశాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో.. ఎదిగే ఆడపిల్లలపై మగపిల్లల దృష్టి పడకుండా ఉండేందుకు అమ్మలు, అమ్మమ్మలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు బ్రెస్ట్‌ ఐరనింగ్‌ చేస్తారట. లండన్‌లోని ఆఫ్రికన్‌ వలస కుటుంబాల్లో అలా జరుగుతోందన్న విషయం ‘గార్డియన్‌’ పత్రిక వార్తా కథనంతో తెలుసుకున్న యూఎన్‌ఓ గతవారం బ్రిటన్‌ ప్రభుత్వాన్ని వివరణ కోరింది.

‘ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు మేము నిబద్ధతతో ఉన్నాము’ అని బ్రిటన్‌ కూడా వెంటనే సంజాయిషీ ఇచ్చింది. పెద్ద విషయం ఇది. ఎదిగిన దేశాలకు మాత్రమే తల్లిదండ్రుల భయాందోళనల వల్ల బాలికల హక్కులకు భంగం కలగడాన్ని పెద్ద విషయంగా తీసుకోగల శక్తి ఉంటుంది. ‘అగ్రదేశం’ కన్నా పెద్దది ‘ఎదిగిన దేశం’. కొన్ని ఆయుధాలు, కొంత అహంకారం ఉంటే చాలు అగ్రదేశం అయిపోవచ్చు. ఆడపిల్లల్ని హాయిగా ఎదగనివ్వడానికి, స్వేచ్ఛగా ఎగరనివ్వడానికి రోజుకు పదిసార్లు దేవుడి గదిలోకి వెళ్లి దండం పెట్టుకొచ్చే తల్లిదండ్రులకు ధైర్యాన్నిచ్చి, ‘మీ అమ్మాయిని నిశ్చింతగా బయటికి పంపండి, క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత మాది’ అని భరోసా ఇవ్వగలిగిన  దేశం మాత్రమే ‘ఎదిగిన దేశం’ అవుతుంది.

‘బ్రెస్ట్‌ ఐరనింగ్‌’ అనే విపరీతం గురించి మీకివాళే మొదటిసారిగా తెలిసి, మీరింకా తేరుకోలేకపోతుంటే.. కాసేపటి తర్వాతనైనా.. అధునాతన తెగల్లోని మనం రోజూ చేస్తున్న ఆడపిల్లల ఆశల ఐరనింగ్, ఆశయాల ఐరనింగ్, వారి కలల ఐరనింగ్‌.. ఇవన్నీ ‘బ్రెస్ట్‌ ఐరనింగ్‌’ కంటే ఏం తక్కువ అని మీకు అనిపిస్తే కనుక మీరొక ఎదుగుతున్న పేరెంట్‌ అనే. మీ వల్ల ఈ దేశం ఎదగబోతున్నదనే. ఎదుగుతున్న ఇంట్లో, ఎదుగుతున్న దేశంలో ఆడపిల్ల ఎదిగితే పువ్వు పూసినట్లుగా మాత్రమే ఉండదు. పక్షి ఎగిరినట్లుగా కూడా ఉంటుంది. పువ్వు తక్కువ, పక్షి ఎక్కువ అని కాదు. పక్షిలా ఎగరాలని ఉన్నప్పుడు పువ్వులా ఎందుకు ఉండిపోవాలీ అని!        ∙

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top