పెళ్లంటే... ‘ఆ.. ఊ..’ అంటాడు!


దేవిశ్రీ ప్రసాద్... దేవి... డీఎస్పీ... ఆప్యాయంగా ఒక్కొక్కరు ఒక్కొ రకంగా పిలిచే ఆయన... సమకాలీన సినీ సంగీత ప్రపంచంలో ఒక ఉత్తుంగ తరంగం. టీనేజ్‌లోనే సంగీత దర్శకుడై, ఈ పదిహేనేళ్ళలో తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమలన్నిటిలో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన ప్రతిభావంతుడు. ఎంత ఎదిగినా ఇప్పటికీ అమ్మానాన్న అంటే గౌరవం.తమ్ముడు, చెల్లెలంటే తరగని అనురాగం దేవిశ్రీ సొంతం. ఇవాళ ఈ సంగీత సంచలనం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇంట్లో ఆ మ్యూజిక్ మెజీషియన్ ప్రేమానురాగాల గురించి తండ్రి, సినీ రచయిత జి. సత్యమూర్తి మనోభావ సంచలనం...

 

మా అబ్బాయి దేవిశ్రీ ప్రసాద్‌కు చిన్నప్పటి నుంచి సంగీతమంటే బాగా ఆసక్తి. చిన్నప్పుడు ఇంట్లోనే గాజు గ్లాసులు అవి తీసుకొని వాటి మీద శబ్దాలు చేస్తూ, వాటిని క్యాసెట్ రికార్డర్‌లో రికార్డ్ చేసేవాడు. ఆ శబ్దాలన్నిటినీ కలిపి, వాడికి వాడే ట్యూన్లు సిద్ధం చేసుకొని, క్యాసెట్ ప్లేయర్‌లో పెట్టి వినిపించేవాడు. మా ఆవిడ శిరోమణి వాళ్ళ తాతగారు డాక్టర్ చిన వెంకన్న గాయకులు. అలాగే, మా అత్త గారు అంటే, దేవిశ్రీ వాళ్ళ అమ్మమ్మ దేవీ మీనాక్షి కూడా మంచి శాస్త్రీయ సంగీత గాయని. ఇక, మా నాన్న గారు డాక్టర్ సూర్యనారాయణ మంచి గిటార్ ప్లేయర్. నేను కూడా పాడేవాణ్ణి. గిటార్ వాయించేవాణ్ణి. రాయడం, స్వరాలు కూర్చడం లాంటివన్నీ చేసేవాణ్ణి. మాదేమో రామచంద్రాపురం దగ్గర వెదురుపాక. మా అత్తగారి ఊరు అమలాపురంలో ఇంటి దగ్గర ఎప్పుడూ ఆ రకమైన సంగీత వాతావరణమే. మా అత్త గారు, నేను అక్కాతమ్ముళ్ళ లాగా కూర్చొని పాటలు పాడుకొనే వాళ్ళం. మా రెండు వైపు కుటుంబాల నుంచి సంగీతం మా వాడికి వారసత్వంగా వచ్చిందనిపిస్తూ ఉంటుంది. మా అత్తగారి పేరులోని ‘దేవి’, మా మామ గారైన ప్రసాదరావు పేరులోని ‘ప్రసాద్ తీసుకొని, వాడికి ‘దేవిశ్రీ ప్రసాద్’ అని పేరు పెట్టా.

 

పది నెలల వయసులోనే పాట

 

గమ్మత్తై విషయం ఏమిటంటే, మా వాడికి పది నెలల వయసులోనే మాటలు వచ్చేశాయి. ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ, మాటలే కాదు, పాటలు కూడా పాడేవాడు. అప్పట్లో ‘మన ఊరి పాండవులు’ సినిమా వచ్చింది. ఆ సినిమాలోని పాటలు పాడేవాడు. అలాగే, ఊళ్ళో గ్రామ్‌ఫోన్‌లో పాటలు విని, డ్యాన్సులు చేసేవాడు. సంగీతం మీద వాడి ఆసక్తి చూసి, వాడి ఉత్సాహాన్ని మేమెప్పుడూ కాదనలేదు.

 

చిన్నప్పటి నుంచే వాడికి సంగీత దర్శకుణ్ణి కావాలని కోరిక. ఆరో తరగతిలో ఉండగానే, పెద్దయ్యాక ఏమవుతావని స్కూల్లో అడిగితే, ‘మ్యూజిక్ డెరైక్టర్‌ని అవుతా’ అని చెప్పాడు. చిన్నప్పుడు మా పిల్లలు ముగ్గురూ (దేవిశ్రీ, సాగర్, పద్మిని) ఇంటి దగ్గరే ఒక ఆవిడ దగ్గర కర్ణాటక సంగీతంలో ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు. అప్పట్లో ‘మాండొలిన్’ శ్రీనివాస్ గారు మా ఇంటికి దగ్గరలో ఉండేవారు. దేవిశ్రీ సంగీతాసక్తి చూసి, ఆయన దగ్గరకు మా ఆవిడ తీసుకువెళ్ళింది. దేవిశ్రీకి ఆయన మాండొలిన్ వాద్యం నేర్పారు. కీ-బోర్‌‌డలు, గిటార్‌తో సహా మిగతావన్నీ గురువులు లేకుండా వాడు సొంతంగా నేర్చుకున్నవే. మా వాడు మద్రాసులో హబీబుల్లా రోడ్‌లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. ఆటలు, పాటలు - ఇలా అన్నింటిలో వాడు ముందుండేవాడు. పెయింటింగ్‌‌స ఎక్కువగా వేసేవాడు. ఎన్నో ప్రైజులొచ్చాయి. స్కూల్ పీపుల్స్ లీడర్ కూడా వాడే.

 

వాడు ఏది చేసినా కరెక్టే...చిన్నప్పటి నుంచి వాడు ఏ విషయంలోనైనా సరే చాలా ఫోకస్డ్‌గా ఉండేవాడు. వాడికి నచ్చితేనే ఏదైనా చేస్తాడు. నచ్చకపోతే చేయడు. వాడు ఏం చేసినా, అది కరెక్ట్‌గా చేస్తాడని తల్లితండ్రులమైన మాకు తెలుసు.  అందుకే, వాడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. వాణ్ణి సొంతంగా నిర్ణయాలు తీసుకో నిచ్చాం. ఇంట్లో నా గది, వాడి గది పక్కపక్కనే. నిర్మాత ఎం.ఎస్. రాజు గారు మా ఇంటికి వచ్చినప్పుడు వాడి గదిలో నుంచి సంగీత వాద్యాల శబ్దాలు విని, వాడి దగ్గరకు వెళ్ళి ఒక సందర్భానికి ట్యూన్ అడిగారు. రెండు రోజుల్లో వాడిచ్చిన ట్యూన్ విని, ‘మీ అబ్బాయిని మ్యూజిక్ డెరైక్టర్‌ని చేస్తున్నా’ అన్నారు. దేవిశ్రీ అప్పుడే ప్లస్ 2 పరీక్షలయ్యాయి. తరువాత చదువు కోసం చూస్తుండగా, ఇది జరిగింది. ‘అంత చిన్నవాడికి అంతటి బాధ్యతా’ అని నేను అంటే, ‘మరేం ఫరవాలేద’ని రాజు గారు తొలి అవకాశమిచ్చారు. అలా వాడు ‘దేవి’ చిత్రంతో టీనేజ్‌లోనే సంగీత దర్శకుడై, సక్సెస్ సాధించాడు. ఇవాళ దేశమంతటా పేరు సంపాదించాడు.

 

మాటలను తిరగేసి రాయడం, తిరగేసి పలకడం లాంటి తమాషాలు చేసేవాడు. ‘కొత్తగా పదాలు సృష్టించాలిగా’ అనేవాడు. ఇప్పటికీ ఏదైనా పాట రాస్తే ముందుగా నాకే చూపిస్తాడు. అయితే, తాను రాశానని ముందుగా చెప్పడు. ‘ఇది వినండి’ అంటూ వినిపిస్తాడు. వాడి శైలి గ్రహించి, ‘ఇది నువ్వే రాశావు కదా’ అంటే, అప్పుడు అవునంటాడు.

 

వాడు ఇంత వాడవుతాడని మేమూ ఊహించలేదు. కానీ, ఇంత పేరొచ్చినా, ఇప్పటికీ ఇంట్లో అల్లరి చేస్తూ, అందరితో సరదాగా ఉంటాడు. సామాన్యుడిలా ప్రవర్తిస్తాడు. ఇంట్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఎవరినీ నొప్పించడు. బాధ పెట్టేలా మాట్లాడడు. ఇక, కుటుంబం పట్ల వాడికి ఉన్న ఆప్యాయత, అక్కర మాటల్లో చెప్పలేం. సొంతాని కంటూ ఏమీ చూసుకోడు. మాకు ఏదో చెయ్యాలనుకుంటుంటాడు. ఏదైనా సరే ముందుగా అమ్మానాన్నలమైన మాకే చెబుతాడు. అందరికీ చెప్పాలి, చెందాలి అనుకున్నప్పుడు, తమ్ముడు, చెల్లెలొచ్చేదాకా ఆగి, అప్పుడు పెదవి విప్పుతాడు.

 

అన్నీ సర్‌ప్రైజ్‌లే...

 

వాడు మాకు ఇచ్చిన కానుకలు అన్నీ ఇన్నీ కావు. ఏది చేసినా, అన్నీ సర్‌ప్రైజ్‌లే. గత ఏడాది మే 24న నా పుట్టిన రోజుకు సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. 23వ తేదీ అర్ధరాత్రి నాతో కేక్ కట్ చేయించి, కొత్త కారు ఇంట్లోకి తెచ్చాడు. చూస్తే, ఒక కొత్త ఇన్నోవా కొని, నాకు సౌకర్యంగా లోపల లాంజ్‌లాగా ఉండేలా దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. మొన్న మార్చి 12తో దేవిశ్రీ తొలి సినిమా విడుదలై 15 ఏళ్ళయింది. అప్పుడు నా కోసం మా అల్లుడైన ఆర్కిటెక్ట్ వివేక్‌తో ప్రత్యేకంగా మ్యూజికల్ సింబల్స్ డిజైన్ వేయించుకొని, సరిగ్గా అలాగే ఉండేలా నగల షాపుకు వెళ్ళి  బ్రేస్‌లెట్ చేయించాడు. నాకేమో అలాంటి సింబల్స్‌తోనే వజ్రాల గాజులు చేయించాడు. మా దగ్గర తప్ప ఎవరి దగ్గరా అలాంటివి ఉండకూడదని అలా ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. అలాంటి పనులు చేసి, మమ్మల్ని సంతోషపెడుతుం టాడు. ప్రతి విషయంలో దేవిశ్రీకి పక్కనే తమ్ముడు సాగర్ ఉండాల్సిందే. అలాగే, చెల్లెలు పద్మిని అంటే వాడికి ప్రాణం. దాని మాట వాడికి వేదవాక్కు. వాళ్ళ ముగ్గురూ ఒక జట్టు.

 

దేవిశ్రీ బావ లాగానే చెల్లెలు కూడా ఆర్కిటెక్టే. యూర ప్‌కు చెందిన ఒక సంస్థకు ఇండియాలో హెడ్ ఆఫ్ డిజైన్‌గా పనిచేస్తోంది. చిన్నప్పుడు దేవిశ్రీకి ఫోటోలు తీయడం, పాటల వీడియోలు చిత్రీకరించడమంటే మహా ఇష్టం. చెల్లెలికి పరీక్షలున్నా సరే వినకుండా, దానితో రకరకాల దుస్తులు వేయించి, ఫోటోలు తీసేవాడు. పిల్లలు ముగ్గురూ కలసి కూర్చొంటే, ఇవాళ్టికీ రోజూ సందడే. వాడికి ఎప్పుడూ ప్రత్యేకంగా పుట్టినరోజులు పండుగలా చేసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు. ‘విడిగా బర్‌‌తడే సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకు? రోజూ అమ్మా నాన్న, పిల్లలం కలిసి నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, ఇంట్లో పండగేగా’ అని వాళ్ళ చెల్లెలితో అంటాడు.

 

ఈ జూలై 5 నుంచి ఆగస్టు 9 దాకా దేవిశ్రీ, సాగర్‌లు అమెరికా, కెనడాల్లో సంగీత ప్రదర్శనలిస్తూ బిజీగా ఉన్నారు. ఈ పుట్టినరోజు నాడు దేవిశ్రీ న్యూజెర్సీలో ప్రోగ్రావ్‌ు చేస్తున్నాడు. అంతదూరంలో ఉన్నా ఇవాళ్టికీ రోజూ మాతో ఫోన్‌లో మాట్లాడతాడు. మా యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాడు. అసలు తొలిసారిగా తానే సొంతంగా చేస్తున్న ఈ అమెరికా పర్యటనకు మా ఇద్దరినీ, చెల్లెలినీ, బావనూ కూడా తీసుకువెళ్లాలని అనుకున్నాడు. బలవంతపెట్టాడు కూడా. కానీ, వేరే పనులతో మేమే వద్దని చెప్పాం.

 

దేవిశ్రీకి పెళ్ళి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ, వాడే వాయిదా వేస్తున్నాడు. ‘నువ్వు పెళ్ళి చేసుకోవడమే మాకు నువ్విచ్చే కానుక. మా సంతోషం కోసం ఇదెందుకు చేయవు’ అని అడుగుతుంటాం. ఆ మాట అడిగితే, ‘ఆ.., ఊ...’ అని మాట మార్చేస్తాడు. పెళ్ళి మాటెత్తవద్దంటాడు. ఆ ముచ్చట తీరితే, మాకు సంతోషంగా ఉంటుంది. ఏమైనా, అలాంటి పిల్లాడు మా బిడ్డగా పుట్టడం మా అదృష్టం. దేవుడిచ్చిన వరం.

 

సంభాషణ: రెంటాల జయదేవ

 

తినడు... పడుకోడు...సంగీత దర్శకుడిగా ఇంత పేరొచ్చినా, దేవిశ్రీ రిలాక్సవడు. వాడికి ఒకటే పనిపిచ్చి. ఇప్పటికీ రాత్రీ పగలూ కష్టపడతాడు. అది చూస్తుంటే, వాళ్ళ అమ్మకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సరిగ్గా తిననే తినడు. నిద్రా తక్కువే. మేడ పైన ఉన్న స్టూడియోకు వెళ్ళి, చెల్లెలు పద్మిని బలవంతాన కిందకు తీసుకువస్తే, అప్పుడొస్తాడు. కష్టపడి ఏదైనా తినిపించడానికి వాళ్ళ అమ్మ రాత్రి చాలాసేపు మెలకువగానే ఉంటుంది. ‘వాడు పడుకొని, కంటి నిండా నిద్రపోయి ఎన్నేళ్ళయిందో’ అని బాధపడుతుంటుంది.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top