చల్లగాలి సోకితే చాలు.. ఒకటే తుమ్ములు | family health counciling | Sakshi
Sakshi News home page

చల్లగాలి సోకితే చాలు.. ఒకటే తుమ్ములు

Nov 2 2017 1:11 AM | Updated on Nov 2 2017 1:11 AM

family health  counciling - Sakshi

నా వయసు 28 ఏళ్లు. గత రెండు మూడు రోజుల నుంచి చల్లగాలి, దుమ్ముధూళి సోకిన వెంటనే ముక్కుకారుతోంది. వెంటనే తుమ్ములుకూడా ఎక్కువగా వస్తున్నాయి కళ్లలో దురద, నీరుకారడం వంటి సమస్యలతో బాధపడుతన్నాను. డాక్టర్‌ను సంప్రదించాను. అలర్జిక్‌ రైనైటిస్‌ అన్నారు. మందులు వాడాను. కానీ బాధలు అలాగే కొనసాగుతున్నాయి. హోమియో చికిత్స ద్వారా దీనికి శాశ్వత చికిత్స వీలవుతుందా? – జయరాజు, నెల్లూరు
అలర్జిక్‌ రైనైటిస్‌తో బాధపడే వారి పరిస్థితిని వాతావరణంలో మార్పులు, చల్లగాలి, దుమ్ముధూళి, ఇతర వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు మరింత దుర్భరం చేస్తాయి. ఈ సమస్య ఉన్నవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తరచూ దీని  బారిన పడుతూనే ఉంటారు. అలర్జిక్‌ రైనైటిస్‌ అంటే... మనకు సరిపడని పదార్థాలు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ముక్కులోని శ్లేష్మం పొర వాపునకు గురవుతుంది. ఇలా ఈ పొరలు వాపునకు గురికావడాన్ని అలర్జిక్‌ రైనైటిస్‌ అంటారు.

కారణాలు: ∙అలర్జీని కలిగించే పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థాయికి మించి ప్రతిక్రియ జరుపుతుంది. దాని వల్ల అలర్జిక్‌ రైనైటిస్‌ సమస్య వస్తుంది ∙ పూలమొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ఈ సమస్యకకు ప్రధానమైన కారణమని చెప్పవచ్చు ∙దుమ్ము ధూళి జంతుకేశాలు, బూజు, కుటుంబ చరిత్ర వంటి అంశాలు ఈ సమస్యకు ఇతర కారణాలుగా చెప్పవచ్చు ∙పొగతాగే అలవాటు, కొన్ని రసాయనాలు, వాతావరణంలోని కాలుష్యాలు, సుగంధద్రవ్యాల వంటివి అలర్జిక్‌ రైనైటిస్‌ సమస్యను ప్రేరేపిస్తాయి.

లక్షణాలు: ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, విపరీతంగా తుమ్ములు, ముక్కులో అంగిలిలో దురద, కళ్ల నుంచి నీరుకారడం, కళ్లు దురదగా ఉండటం, ముఖంలో వాపు, దగ్గు, తరచూ తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చికిత్స:  హోమియో చికిత్సలతో ఎలాంటి శ్వాసకోశవ్యాధులనైనా తగ్గించవచ్చు. జెనెటిక్‌ కాన్‌స్టిట్యూషన్‌ పద్ధతిలో అందించే ఈ చికిత్సలో రోగి శారీరక, మానసిక లక్షణాలను, శరీర తత్వాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. రోగనిరోధక వ్యవస్థలలో గల అసమతౌల్యతను సరిచేయడం ద్వారా అలర్జిక్‌ రైనైటిస్‌ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయడం సాధ్యమవుతుంది.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లావర్‌
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

ఒకవైపే వస్తే... మైగ్రేన్‌ తలనొప్పి
నాకు వారంలో రెండు సార్లు విపరీతమైన తలనొప్పి వస్తోంది. రక్తపరీక్షలు, ఎక్స్‌–రే, స్కానింగ్‌ చేయించాను. మైగ్రేన్‌ అని, జీవితాంతం వస్తుంటుంన్నారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? – వినీత్, విజయనగరం
తరచూ తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్‌ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొపి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వాత కచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది.
మైగ్రేన్‌ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధికప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్‌ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలోనే ఎక్కువ.

మైగ్రేన్‌లో దశలూ, లక్షణాలు: సాధారణంగా మైగ్రేన్‌ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్‌ మైగ్రేన్‌ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వ్యాధి నిర్ధారణ: రక్తపరీక్షలు, రక్తపోటు, సీటీస్కాన్, ఎంఆర్‌ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్‌ను నిర్ధారణ చేయవచ్చు.

నివారణ: మైగ్రేన్‌ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు ఆహారంలో మార్పులు, ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి.

చికిత్స: మైగ్రేన్‌ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంశీక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్‌ కాన్‌స్టిట్యూషన్‌ సిమిలియమ్‌ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్‌కు అద్భుతంగా పనిచేస్తాయి.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి,ఎండీ (హోమియో)
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌

తెల్లమచ్చలు... నలుగురిలోకి వెళ్లాలంటే...
నా శరీరమంతా తెల్లమచ్చలు వచ్చాయి. నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అని చెప్పారు. ఇది ఎందుకు వస్తుంది. హోమియో మందులతో తగ్గుతుందా? – నవీన్, కర్నూలు
చర్మంలో రంగునిచ్చే మెలనోసైట్స్‌ అనే కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్‌ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్‌’ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్‌ అనే ఎంజైమ్‌ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లిలో ఈ ఎంజైమ్‌ అనేక కారణాల వల్ల క్షీణిస్తుంది. మెలనిన్‌ విడుదలకు అంతరాయం వల్ల చర్మం రంగు కోల్పోతుంది.
 
కారణాలు: ∙దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి ∙కొన్నిసార్లు కాలిన గాయాలు ∙పోషకాహారలోపం – జన్యుపరమైన కారణాలు – దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్‌ సమస్యలు ∙మందులు, రసాయనాలు ∙కొన్ని ఎండోక్రైన్‌ గ్రంథులు స్రవించే హర్మోన్‌లలో లోపాలు – వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం లేదా మన సొంత వ్యాధి నిరోధక కణాలు మనపైనే దాడి చేయడం వంటి అంశాలు బొల్లి వ్యాధి వచ్చేందుకు కొన్ని కారణాలు.

లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాళ్ల మీద రావచ్చు.  

చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఇందుకు దీర్ఘకాలిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మానసికంగా, శారీరకంగా రోగిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న తర్వాత వ్యాధికి అవసరమైన కాన్‌స్టిట్యూషనల్‌ మెడిసిన్‌ను ఇస్తారు. తూజా, నైట్రిక్‌ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్‌ ఆల్బమ్, లాపిస్‌ అల్బా, రస్టాక్స్‌ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు.
డాక్టర్‌ టి. కిరణ్‌ కుమార్, డైరెక్టర్,
పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌

Advertisement
 
Advertisement
Advertisement