పీసీఓడీ తగ్గుతుందా? 

health counciling - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

హోమియో కౌన్సెలింగ్స్‌

నా భార్య వయసు 32 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? 
– భద్రారెడ్డి, చిత్తూరు 

గర్భాశయానికి ఇరువైపులా అండాశయాలు ఉంటాయి. ఈ అండాశయాల్లో  నీటిబుడగల వంటివి ఉండటాన్ని పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌ (పీసీఓడీ) అంటారు. రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో రెండు అండాశయాల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అయితే ఈ పీసీఓడీ సమస్య ఉన్నవారిలో అండాశయం నుంచి అండం విడుదల కాకుండా, అపరిపక్వమైన అనేక అండాలు నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోతాయి. చూడటానికి ఇవి ముత్యాల్లా కనిపిస్తుంటాయి. ఇలా రెండువైపులా కనిపిస్తుంటే దీన్ని వైద్యపరిభాషలో ‘బైలేటరల్‌ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్‌ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. 

లక్షణాలు: నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానం కలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు.  రోగి భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్‌ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్‌ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్‌ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు.
చికిత్స: హోమియోలో సరైన కాన్‌స్టిట్యూషన్‌ సిమిలియం విధానంలో హార్మోన్‌ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ, 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

హైపోథైరాయిడిజమ్‌కు చికిత్స ఉందా?

నా వయసు 36 ఏళ్లు. ఈ మధ్య  నేను బరువు పెరుగుతున్నాను. పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం వల్ల టీఎస్‌హెచ్‌ పరీక్ష చేశారు. హైపోథైరాయిడిజమ్‌ ఉందని తెలిసింది. నేను జీవితాంతం మందులు వాడాల్సిందేనా? హోమియోలో శాశ్వతంగా తగ్గించే మందులు ఏమైనా ఉన్నాయా?  – ఒక సోదరి, మిర్యాలగూడ 
మానవ శరీరంలో థైరాయిడ్‌ గ్రంథి ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్‌హెచ్‌ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్‌ బరువు పెరిగే సమస్య. హైపోథైరాయిడిజమ్‌ అనేది మానవ శరీరంలో థైరాయిడ్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో  బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది. హైపోథైరాయిడిజమ్‌ ఏ వయసులోని వారికైనా రావచ్చు. స్త్రీలలో, పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. శిశువుల్లో క్రెటినిజం అనే ఒక రకమైన హైపోథైరాయిడిజమ్‌ వస్తుంది. థైరాయిడిజమ్‌ నుంచి తగినంత మోతాదులో హార్మోన్‌ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్‌ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌) అవసరం. అయోడిన్‌ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్‌ సమస్య వస్తుంది. 
లక్షణాలు: ∙బరువు పెరగడం, కాళ్లు చేతుల్లో నీరు చేరడం ∙జుట్టు రాలడం, చర్మం పొడిబారటం, మలబద్దకం ∙గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి, ∙కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి ∙రుచి, వాసన, స్పర్శ తగ్గడం ∙సంతానలేమి, నీరసం, డిప్రెషన్‌ 
నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్షలు, థైరాయిడ్‌ యాంటీబాడీస్, థైరాయిడ్‌ స్కానింగ్, అల్ట్రాసౌండ్‌. 
చికిత్స: హోమియో విధానంలో హైపోథైరాయిడిజమ్‌ సమస్యను అదుపు చేసే చాలా రకాల ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి, 
ఎండీ (హోమియో), స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

మూత్ర విసర్జన  సమయంలో మంట! 
నా వయసు 30 ఏళ్లు. ఇటీవల మూత్రం వెంటవెంటనే వస్తోంది. అంతేకాదు విసర్జన సమయంలో చాలా  మంటగానూ ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం సూచించండి.
– కె. లలిత, కాకినాడ 

మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌గా పేర్కొంటారు. ఇవి మహిళల్లో చాలా ఎక్కువే. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. ∙అప్పర్‌ యూరినరీ టాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ : ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్‌ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్‌ను పైలోనెఫ్రైటిస్‌ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. ∙లోవర్‌ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్‌ను సిస్టయిటిస్‌ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్‌ను యురెథ్రయిటిస్‌ అంటారు. 

కారణాలు: యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌లోని దాదాపు 90 శాతం కేసుల్లో ఈ సమస్యకు ప్రధానంగా కారణం ఈ–కొలై అనే బ్యాక్టీరియా. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్‌కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ రావచ్చు. 
లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంట  ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం 
చికిత్స: హోమియోలో వ్యా«ధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి  మందులను సూచిస్తారు. యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, 
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top