పేరెంట్స్‌కు హైబీపీ ఉంటే నాకూ వస్తుందా?

family health counciling - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

హై–బీపీ కౌన్సెలింగ్‌
నా వయసు 35. మా కుటుంబంలో తల్లిదండ్రులకు హైబీపీ ఉంది. నాకూ వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. పేరెంట్స్‌కు బీపీ ఉన్నప్పుడు అది నాకు కూడా వచ్చే అవకాశం ఉందా? దీన్ని నివారించడానికి నేనేం చేయాలో చెప్పండి.  – జగన్నాథరావు, వరంగల్‌
మీ తల్లిదండ్రులకూ, మీ రక్తసంబంధీకులకూ, మీకు చాలా దగ్గరి బంధువులకు అధిక  రక్తపోటు ఉంటే మీకు కూడా వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువే. అయితే, మీ జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోవడం ద్వారా కుటుంబంలో హైబీపీ చరిత్ర ఉన్నప్పటికీ దీన్ని చాలావరకు నివారించుకోవచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది చాలా సులభం. అది... 
∙ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తీసుకోవాలి.
∙మీరు ఉప్పు చాలా తక్కువగా తీసుకోవాలి. 
∙మీరు శారీరక శ్రమను ఇష్టపడుతూ చేయండి. నడక వంటి వ్యాయామాలు దీనికి బాగా ఉపకరిస్తాయి. 
∙    బరువు పెరగకుండా చూసుకోండి. మీ ఎత్తుకు మీరెంత బరువుండాలో దానికి మించకుండా నియంత్రించుకుంటూ ఉండండి 
∙పొగాకు వాడకాన్ని పూర్తిగా మానేయండి. 
∙ఆల్కహాల్‌ పూర్తిగా మానేయండి. 

తరచూ తలనొప్పి... హైబీపీ కావచ్చా?
నా వయసు 48 ఏళ్లు. నాకు తరచూ తలనొప్పిగా ఉండటంతో పాటు ఇటీవల బాగా తలతిరుగుతున్నట్లుగా ఉంది. ఒక్కోసారి ముందుకు పడిపోతానేమో అన్నంత ఆందోళనగా ఉంటోంది.     నా లక్షణాలు చూసిన కొంతమంది మిత్రులు ‘‘నీకు హైబీపీ ఉందేమో, ఒకసారి డాక్టర్‌కు చూపించుకో’’ అంటున్నారు. వారు చెబుతున్నదాన్ని బట్టి నాకు మరింత ఆందోళన పెరుగుతోంది.  నాకు తగిన సలహా ఇవ్వగలరు. 
– ఎమ్‌. సుదర్శన్, నిజామాబాద్‌ 

హైబీపీని కేవలం మీరు చెప్పిన లక్షణాలతోనే నిర్ధారణ చేయలేం. అసలు బీపీని కొలవకుండా ఆ సమస్యను నిర్ధారణ సాధ్యం కాదు. మనలో రక్తపోటు పెరగడం వల్ల ఎండ్‌ ఆర్గాన్స్‌లో ముఖ్యమైనదైన మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరిగి తలనొప్పి రావచ్చు. కొందరిలో మైగ్రేన్‌ వల్ల కూడా తలనొప్పి రావచ్చు.  అలాగే మనం ఉన్న భంగిమ (పోష్చర్‌)ను అకస్మాత్తుగా మార్చడం వల్ల ఒకేసారి మనలో రక్తపోటు తగ్గవచ్చు. దీన్ని ఆర్థోస్టాటిక్‌ హైపోటెన్షన్‌ అంటారు. అలాంటి సమయాల్లోనూ మీరు చెప్పినట్లుగా ముందుకు పడిపోతారేమో లాంటి ఫీలింగ్, గిడ్డీనెస్‌ కలగవచ్చు. బీపీలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల మీరు చెప్పిన లక్షణాలు కనిపించినప్పటికీ, అవి కేవలం బీపీ వల్లనే అని చెప్పలేం. సాధారణంగా బీపీ వల్ల ఉదయం వేళల్లో తలనొప్పి కనిపించనప్పటికీ, మరెన్నో ఆరోగ్య సమస్యలలోనూ తలనొప్పి ఒక లక్షణంగా ఉంటుంది. అలాగే మీరు చెప్పిన గిడ్డీనెస్‌ సమస్యతో పాటు వర్టిగో, సింకోప్‌ లాంటి మరెన్నో సమస్యలు కూడా మీకు కనిపిస్తున్న లక్షణాలకు కారణం కావచ్చు. అందుకని కేవలం లక్షణాల ఆధారంగానే బీపీ నిర్ధారణ చేయడం సరికాదు. అందుకే మీరు నిర్భయంగా ఒకసారి డాక్టర్‌ను కలవండి. అయితే డాక్టర్‌ కూడా కూడా కేవలం ఒక్క పరీక్షలోనే బీపీ నిర్ధారణ చేయరు. అనేక మారు బీపీని కొలిచి, ఒకవేళ నిజంగానే సమస్య ఉంటే అప్పుడు మాత్రమే దాన్ని కచ్చితంగా నిర్ధారణ చేసి, దానికి తగిన చికిత్స సూచిస్తారు. 

హైబీపీ నిర్ధారణకు పరీక్షలేమిటి? 
నా వయసు 48. నాకు తరచూ తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. దాంతో నాకు హైబీపీ ఉందేమోనని అనుమానం వస్తోంది. హైబీపీ నిర్ధారణకు ఏయే పరీక్షలు చేయించాలి?
– కృష్ణ, ఖమ్మం 

రక్తపోటు ఉన్నట్లు అనుమానించేవారు చేయించుకోవాల్సిన సాధారణ పరీక్షలు ఇవి...  ∙పూర్తిస్థాయి మూత్ర పరీక్ష (కంప్లీట్‌ యూరిన్‌ ఎగ్జామినేషన్‌) ∙రక్తంలో హీమోగ్లోబిన్‌ పాళ్లు ∙రక్తంలో పొటాషియమ్‌ స్థాయి ∙బ్లడ్‌ యూరియా అండ్‌ క్రియాటిన్‌ లెవెల్స్‌ ∙ఈసీజీ ∙కిడ్నీ సైజ్‌ను తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ ఆఫ్‌ అబ్డామిన్‌ పరీక్ష ∙రక్తంలో చక్కెర పాళ్లు తెలుసుకునే రాండమ్‌ బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ పరీక్ష... ఇవి మామూలుగా చేయించాల్సిన పరీక్షలు. అయితే కొందరిలో మరికొన్ని ప్రతేక పరీక్షలు అవసరమవుతాయి. ఈ ప్రత్యేక పరీక్షలు ఎవరికి అవసరమంటే ... ∙కుటుంబ చరిత్రలో రక్తపోటు వల్ల మూత్రపిండాలు దెబ్బతిన్న వారికి ∙డయాబెటిస్‌ పేషెంట్లు అందరికీ ∙కాళ్లలో, పాదాల్లో వాపు వస్తున్నవారికి ∙రక్తపోటు అదుపు చేయడానికి రోజూ రెండు కంటే ఎక్కువ మందులు ఉపయోగిస్తున్నవారికి ∙ముప్ఫయి ఏళ్ల వయసు రాకముందే రక్తపోటు వచ్చిన వారికి, రక్తపోటు కనుగొని ఐదేళ్లు దాటిన వారికి ∙తీవ్రమైన తలనొప్పి వస్తున్నవారు, రక్తపోటు పెరగడం వల్ల గుండెదడ, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందిపడే వారికి ఇవి అవసరం. హైబీపీ వల్ల కిడ్నీలకు ఏదైనా ప్రమాదం జరిగిందేమో తెలుసుకోడానికి ఈ పరీక్షలు చేయిస్తారు. అవి... ∙24 గంటలలో మూత్రంలో పోయే ప్రోటీన్లు, క్రియాటిన్‌ పాళ్లు  తెలుసుకునే పరీక్ష. (మూత్రంలో పోయే ప్రోటీన్లను కేవలం ఒక శాంపుల్‌తోనే తెలుసుకునే పరీక్షలూ అందుబాటులోకి వచ్చాయి) ∙కిడ్నీ బయాప్సీ ∙మూత్రపిండాల్లోని రక్తనాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు డాప్లర్‌ అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ ∙బ్లడ్‌ గ్యాస్‌ అనాలిసిస్‌ ∙రీనల్‌ యాంజియోగ్రామ్‌.
- డాక్టర్‌  ఎమ్‌. గోవర్ధన్, సీనియర్‌ ఫిజీషియన్, కేర్‌ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్‌  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top