మా అమ్మలా ఉంటే బాగుండు! | Every women as like my mother | Sakshi
Sakshi News home page

మా అమ్మలా ఉంటే బాగుండు!

May 27 2014 11:19 PM | Updated on Sep 2 2017 7:56 AM

మా అమ్మలా ఉంటే బాగుండు!

మా అమ్మలా ఉంటే బాగుండు!

మా చిన్నప్పుడు ఇంటికెవరొచ్చినా... ఎంతమంది బంధువులొచ్చినా మా అమ్మ ఎలాంటి ఆందోళనా పడకుండా వారికి మర్యాదలు చేసేది. భోజనాలు, చిరుతిళ్లు, వాళ్లు వెళ్లేటప్పుడు ఫలహారాలు అంటూ బోలెడు ఖర్చులుండేవి.

మనోగతం
 
మా చిన్నప్పుడు ఇంటికెవరొచ్చినా... ఎంతమంది బంధువులొచ్చినా మా అమ్మ ఎలాంటి ఆందోళనా పడకుండా వారికి మర్యాదలు చేసేది. భోజనాలు, చిరుతిళ్లు, వాళ్లు వెళ్లేటప్పుడు ఫలహారాలు అంటూ బోలెడు ఖర్చులుండేవి. అన్నింటినీ అమ్మే చూసుకునేది. అలాగని అమ్మ అడిగినపుడల్లా నాన్నగారు డబ్బులిచ్చే పరిస్థితేమీ ఉండేది కాదు. ఇచ్చిన డబ్బుల్ని మాత్రం అమ్మ చాలా జాగ్రత్తగా ఉపయోగించేది. అనవసరపు ఖర్చులు చేయకుండా ఎప్పుడూ చేతిలో పది రూపాయలు ఉండేలా ప్లాన్ చేసుకునేది.

నాన్నగారు ఇచ్చే డబ్బులకు తోడు అప్పుడప్పుడు నెయ్యి అమ్మిన డబ్బులు కూడా అమ్మ పోపులడబ్బాలోకే వచ్చేవి. అక్కలకు, నాకు ఎప్పుడైనా చిన్న చిన్న ఖర్చులుంటే కూడా అమ్మే చూసుకునేది. వంద రూపాయలకు ఇంటినిండా సరుకులొచ్చే రోజుల్లో అమ్మ దగ్గర ఎప్పుడూ యాభై, వందా ఉండేవి. ఇప్పుడు కాలం మారింది...వెయ్యి రూపాయలకు కూడా సరుకుల సంచి సగం నిండడం లేదు. నేను జీతం రాగానే నా భార్యకు ఇంటి ఖర్చుల నిమిత్తం ఇంత మొత్తమని ఇస్తాను. ఆమె కూడా చిన్న ఉద్యోగం చేస్తోంది.
 
 ఇంటి ఖర్చుల కోసం ఆమె జీతం కూడా ఖర్చు పెడుతుంది. నేను పెద్ద పొదుపు మాస్టార్‌ని కాకపోయినా...ఖర్చు మనిషిని కాదు. అయినా మగవాళ్లు ఆడవాళ్లలా డబ్బుల్ని దాచుకోలేరు కదా! విషయమేమిటంటే...నా భార్య దగ్గర కూడా ఎప్పుడూ పైసా ఉండదు. అవసరానికి ఆడవాళ్లే ఆదుకోవడం అనేది ఈ రోజు నేను కోరుకునే కోరిక కాదు. అనాది నుంచి ఇంటికి ఆపద్బాంధవులు ఆడవారే అన్నది అందరిళ్లలో అమ్మలు నిరూపించారు. కానీ ఈతరం ఆడవాళ్లు అంతటి పాత్రను పోషించలేకపోతున్నారు. నా భార్యనే ఉదాహరణగా తీసుకోండి. ఉద్యోగిని అయి ఉండి కూడా చాటున పట్టుమని పది రూపాయలు దాచలేకపోతోంది. అదేంటని అడిగితే ‘ఆ పని మీరు చేయొచ్చు కదా!’ అంటోంది.
 
ఆ మధ్య సడెన్‌గా మా బంధువులెవరో వస్తే....ఇద్దరి చేతుల్లో ఒక్క రూపాయి లేదు. ఆ సమయంలో నాకు అమ్మ గుర్తొచ్చింది. ఈ విషయం నా స్నేహితుల దగ్గర చెబితే...‘చెప్పావులే కొత్త విషయం...మా ఇంట్లో తంతు కూడా ఇంతే’ అన్నారు. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే...నేటి మహిళకు సంపాదించడం వచ్చింది కానీ, దాచుకోవడం రావడం లేదు. అదీ వచ్చి, ఆమె కూడా మా అమ్మలా అయితే ఎంత బాగుండు!
 - బి. కేశవులు, వేములవాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement