ముక్కిడి గుట్ట  శవం

Every human being has a ghost in mind - Sakshi

దెయ్యాలు లేవని ఒక్కోసారి గట్టిగా నమ్మాల్సి ఉంటుంది.దెయ్యాలు ఉండుంటే బతికి ఉండగా తమను అన్యాయంగా చంపినవారికి ఊరికే వొదిలి ఉండేవా?ప్రతి మనిషి మనసులో దెయ్యం ఉంటుంది.అది చెడు చేయమని పురిగొల్పుతూ ఉంటుంది.దానికి లొంగితే తాత్కాలిక విజయం.శాశ్వత అపజయం.12 ఆగస్టు 2016.రాత్రి 9.45. రామన్నపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫోన్‌ మోగింది.సీఐ ఎత్తాడు.‘ఓకే .. ఇప్పుడే బయల్దేరుతున్నాం..’ అంటూ క్యాప్‌ను తల మీదుగా సర్దుకున్నాడు. సీఐని గమనించిన  సిబ్బంది అలెర్ట్‌ అయ్యారు. ‘ఆత్మకూరు ఎస్‌ఐ నుంచి ఫోన్‌ వచ్చింది. వెంటనే బయల్దేరాలి’ అన్నాడు సీఐ. క్షణాల్లో అందరూ వెహికిల్‌లోకి ఎక్కారు.జీపు భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని రాఘవాపురం గ్రామానికి హుటాహుటిన చేరుకుంది.పోలీసు జీపు శబ్దం వింటూనే పరుగుపరుగున జనం అక్కడకు చేరుకున్నారు. ‘ఏమైంది?’ దిగుతూనే అడిగాడు సీఐ.‘సార్‌.. ఆ ముక్కిడిగుట్ట నుంచి భరించలేని వాసన. కుళ్లిపోయిన శవం వాసనలా ఉంది.

భరించలేకుండా ఉన్నాం’ చెప్పారు అక్కడ చేరిన జనంలోంచి ఒకరిద్దరు. ‘మీరు మాతో రావల్సి ఉంటుంది. ఏంటో తెలుసుకుందాం..’ అన్నాడు సీఐ.‘అలాగే సార్‌’ అన్నారు వాళ్లు.జనంతో పాటుగా ముక్కిడిగుట్ట వైపుగా వెళ్లారు పోలీసులు. గాలి వీస్తున్నప్పుడల్లా దుర్వాసన కూడా వేగంగా వస్తోంది.  కానీ, ఆ చీకట్లో ఏమీ కనిపించడం లేదు. పైగా చెట్ల పొదలు. టార్చిలైట్ల సాయంతో వెతికి చూశారు. లాభం లేదు.. అయినా వారి ప్రయత్నం మానలేదు.తెలతెలవారుతుండగా చెట్ల పొదల్లో లోయలాగ ఉన్న ప్రాంతంలో ఓ అమ్మాయిæ మృతదేహాన్ని గుర్తించారు. శవం పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టరాకుండా ఉంది. శరీరంపై పసుపు రంగు పంజాబీ డ్రెస్‌ ఉంది. ఆత్మకూరు ఎస్‌ఐ, రామన్నపేట సీఐ ఇద్దరూ అక్కడే ఉన్నారు. నల్లగొండ నుంచి డాగ్‌స్క్వాడ్‌ వచ్చింది. పోలీసు జాగిలం గుట్ట పైన, కింద పరిసరాల చుట్టూ తిరిగింది. అయినా ఎటువంటి ఆధారాలూ దొరకలేదు.

అధారాల కోసం శవం ఉన్న ప్రదేశం నుంచి చుట్టూ యాబై గజాల దూరంలో మరోసారి అంగుళం అంగుళం వెతికారు. ఒకచోట పగిలిన ఎర్రటి గాజు ముక్కలు, మరికాస్త దూరంలో ఓ చెప్పుల జతతో పాటు రెండు బస్‌ టికెట్లుæలభించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యా జరిగిన ముక్కిడిగుట్టపై దొరికిన బస్‌ టికెట్ల వివరాలు సేకరిస్తే అవి మహేశ్వరం బస్‌డిపోకు చెందినవని, ఆగస్టు 7న శంషాబాద్‌ నుంచి శివరాంపల్లికి ప్రయాణం చేసినవారివి అయి ఉంటాయని తెలిసింది. స్వాధీనం చేసుకున్న బస్‌ టికెట్ల ఆధారంగా సీఐ, ఎస్‌ఐ దర్యాప్తు ముమ్మరం చేశారు. మొదట శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు వారు చేరుకున్నారు. ‘ఈ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ వారంలో మిస్సింగ్‌ కేసులు ఏమైనా ఉన్నాయా’ అని అడిగాడు ఎస్‌ఐ. వెంటనే ఆ వివరాలు వచ్చాయి.పది రోజుల వ్యవధిలోనే ఐదు మిస్సింగ్‌ కేసులు నమోదు అయినట్లుగా అక్కడి పోలీసులు తెలిపారు.

 ఆ ఐదు మిస్సింగ్‌ కేసులలో ఒక అమ్మాయి ధరించిన దుస్తులు, చెప్పుల జత తమకు లభ్యమైన ఆధారాలతో సరిపోలడంతో హత్యకు గురైన అమ్మాయి 22 ఏళ్ల శివలీలగా గుర్తించారు పోలీసులు.తమ కూతురు మిస్‌ అయినట్టు శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన శివలీల తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించారు పోలీసులు. వివరాలన్నీ తెలుసుకున్న తల్లీతండ్రీ బోరుమన్నారు. ‘సార్‌.. ఈ అమ్మాయి మా శివలీలనే. తను అంత దూరం ఎందుకు వెళ్లిందో తెలియదు. ఈ దారుణానికి ఒడిగట్టిందో ఎవరో తెలియదు. ఈ ఏడాదే అమ్మాయి పెళ్లి చేద్దామనుకున్నాం. ఇలా జరిగింది’ కుమిలి కుమిలి ఏడుస్తున్న వారితో ‘చనిపోయిన మీ అమ్మాయిని మేం తెచ్చివ్వలేకపోవచ్చు. కానీ, నేరస్తులు ఎవరో ఎక్కడున్నా పట్టుకు తీరుతాం’ దృఢంగా చెప్పి బయటకు నడిచాడు సీఐ. శివలీలతోపాటు మరో వ్యక్తి ప్రయాణించినట్టు సంఘటన స్థలం వద్ద లభించిన బస్‌ టికెట్స్‌ చెబుతున్నాయి. కనుక శివలీలకు ఇతర వ్యక్తులతో ఉన్న పరిచయాల పట్ల ఆరాతీశారు పోలీసులు. శివలీల తల్లిదండ్రుల నుంచి, ఆమె స్నేహితులు, పరిచయస్తుల వద్ద నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. ఆ వివరాల్లో శివలీలకు ఒక వ్యక్తితో ఉన్న పరిచయం గురించి పోలీసులకు తెలిసింది.

దీంతో ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. శివలీలతో పరిచయం ఉన్నట్టుగా అనుమానిస్తున్న ఆ వ్యక్తి సెల్‌ఫోన్‌పై పోలీసులు దృష్టి సారించారు. ఆగస్టు 20. భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ముప్పై ఏళ్ల రవి(పేరు మార్చాం)ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ముందు తనకేమీ తెలియదని బుకాయించిన రవి పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపెట్టాడు. అవి ఇలా ఉన్నాయి.బైక్‌ మెకానిక్‌గా అబ్దుల్లాపూర్‌ మెట్టు వద్ద పనిచేస్తుంటాడు రవి. హత్యకు గురైన శివలీల అబ్దుల్లాపూర్‌ మెట్టు వద్ద ఉన్న అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలోనే రవికి శివలీలతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆర్నెల్లు కలిసి తిరిగారు. తల్లిదండ్రులు వచ్చినప్పుడల్లా శివలీల పెళ్లి విషయం ప్రస్తావన వచ్చేది. దీంతో తనను పెళ్లి చేసుకోమని, లేకుంటే తమ విషయాన్ని పెద్దవాళ్లతో చెబుతానని శివలీల రవిపై ఒత్తిడి చేయడం ప్రారంభించింది. అయితే, రవికి మూడేళ్ల క్రితమే వివాహం అయింది. ఏడాది వయసున్న కూతురు కూడా ఉంది. తరచూ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్న శివలీలను కొన్నాళ్లు తప్పించుకు తిరిగాడు.

కానీ, ఇంకా ఆలశ్యం చేస్తే నేరుగా ఇంటికే వచ్చేస్తానని బెదిరింపులకు దిగడంతో ఆమెనే అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు రవి.  శివలీలను మట్టుపెట్టడానికి ఊరికి శివారులో ఉన్న ముక్కిడిగుట్ట సరైన ప్లేస్‌ అనుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్‌ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు.మహేశ్వరంలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన శివలీలకు ఫోన్‌ చేసి..‘నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇద్దరం కలిసి మా ఊరు వెళ్దాం. అక్కడ మా ఇంట్లో వాళ్లకు పరిచయం చేస్తాను. అక్కడ మావాళ్లతో మాట్లాడి మన పెళ్లికి ఒప్పిద్దాం. తర్వాత మీ అమ్మనాన్నలతో మాట్లాడుదాం, సరేనా’ అన్నాడు రవి. శివలీల సంతోషంగా ఒప్పుకుంది. ఆగస్టు 7న ఉదయం అమ్మమ్మ వద్దకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయల్దేరింది.

ఆమెను మహేశ్వరం బస్‌డిపోలో కలుసుకున్నాడు రవి. ఇద్దరూ ముందుగా శివరామ్‌పల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి వలిగొండకు చేరుకుని రెండు రోజులు ఉండిపోయారు. 9 ఆగస్టు రాత్రి 7 గంటల ప్రాంతంలో ముక్కిడిగుట్టకు శివలీలను తీసుకొచ్చాడు రవి.అసలే అటవీ ప్రాంతంలా ఉంది. పైగా చీకటి. జన సంచారం ఏమాత్రం లేదు అక్కడ. ‘ఇంటికని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు. బాగా చలిగా కూడా ఉంది’ చుట్టూ చూస్తూ అంది శివలీల. ‘పెళ్లి గురించి అడిగావు కదా. పెళ్లి చేసి పైకి పంపించేద్దామని’ అన్నాడు రవి వెటకారంగా. రవి మాటలకు శివలీలకు కోపం వచ్చింది. ‘ఇంత మోసం చేస్తావా. మీ ఇంటికని చెప్పి ఈ గుట్టకు తీసుకొస్తావా? ఊళ్లోకెళ్లి అందరికీ నీ విషయం చెప్పి నీ బతుకు బజారుకీడుస్తా’ ఆవేశంగా అంటూనే శివలీలఅక్కణ్ణుంచి ఊరి వైపుగా పరిగెత్తబోయింది. 

కానీ, రవి ఆమెను అడుగు ముందుకు పడనీయకుండా గట్టిగా పట్టుకున్నాడు. శివలీల చున్నీ ఆమె మెడ చుట్టూ గట్టిగా బిగించాడు. ఆ పెనుగులాటలో మహేశ్వరం డిపో బస్‌ టికెట్లు రవి జేబులో నుంచి పడిపోయాయి. శివలీల చేతి గాజులు పగిలి అక్కడే పడిపోయాయి. కాసేపటికి శివలీల నిర్జీవంగా వాలిపోయింది. శివలీల చనిపోయిందని నిర్ధారించుకున్న రవి పీడ విరగడ అయిందనుకుని ఆమె శరీరాన్ని కొంత దూరం లాక్కెళ్లి అక్కణ్ణుంచి చెట్ల పొదల్లోకి జారవిడిచి, ఊళ్లోకి వెళ్లిపోయాడు.  ప్రేమ పేరుతో వంచించి, ఆమెను అడ్డు తొలగించుకోవడానికి హత్య చేసిన రవి ఈ విషయం ఎవరికీ తెలియదనుకున్నాడు. తెలిసే అవకాశమే లేదనుకున్నాడు. కానీ నేరం దాగదని, రవిని జైలుకు పంపించి నిరూపించారు పోలీసులు. 
 – రేగోటి పాండురంగం, సాక్షి,
యాదాద్రి భువనగిరి జిల్లా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top