‘పెళ్లి పిలుపులు రాని తల్లి’

Ekta Kapoor Says her Mom Hates to Take Her to Weddings - Sakshi

కొత్త మార్గం 

టెలివిజన్‌ రంగంలో ఎన్ని ఘన విజయాలు సాధించినప్పటికీ ఏక్తా కపూర్‌ సాంఘికంగా ‘పెళ్లి కాని తల్లి’గానే గుర్తింపబడుతోంది. ఆమె ఎదురుపడితే మొదలయ్యే మొదటి ప్రశ్న ‘పెళ్లెప్పుడు?’ అనే!ఏక్తా కపూర్‌కు 43 ఏళ్లు వచ్చాయి. కాని ఇప్పటికీ ఆమె బంధువులకు ఎదురు పడటానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళిళ్లకు హాజరవ్వడానికి ఇంకా ఇబ్బందిపడుతూ ఉంటుంది. దానికి కారణం ఆ పెళ్లిలో ‘నెక్ట్స్‌ నీ పెళ్లే’ అని బంధువులు ఆమెతో అంటూ ఉంటారు. అదీ ఆమె భయం. దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియదు ఆమెకు. ‘స్త్రీ ఎన్ని ఘనవిజయాలు సాధించినా పెళ్లితోనే ఆమె జీవితం సంపూర్ణమవుతుందనే సాంఘిక అభిప్రాయానికి కాలం చెల్లాల్సి ఉంది’ అని ఏక్తా అంటుంది. పెళ్ళిళ్లకు తీసుకెళితే పెళ్లి మీద మనసు పుడుతుందేమోనని ఏక్తా తల్లి శోభా కపూర్‌ గతంలో ఏక్తాను పెళ్ళిళ్లకు పిలుచుకుని వెళ్లేది.

కాని అక్కడ ఏక్తాను ఇలా అర్థం లేని ప్రశ్నలు అడుగుతుంటే దానికి ఏక్తా అర్థం లేని సమాధానాలు చెప్పడం చూసి, ఆ సమాధానాలకు ఎదుటివారు హర్ట్‌ అవడం గమనించి ఏక్తాను పెళ్లిళ్లకే తీసుకెళ్లడం మానుకుంది. ఎలాగూ రాదు కదా అని అసలు పెళ్లి పిలుపులు ఆమెకు పంపడం కూడా మానేశారు బంధువులు.ఏక్తా కపూర్‌ జనవరి 2019లో సరొగసి ద్వారా ఒక మగబిడ్డకు తల్లయ్యింది. ‘నా జీవితంలో నేను చూసిన అన్ని విజయాలకంటే గొప్పది నా కుమారుణ్ణి నా జీవితంలోకి ఆహ్వానించడం’ అని ఏక్తా అంది. ఏక్తా మొదట తనే ఐవిఎఫ్‌ పద్ధతి ద్వారా గర్భం దాల్చి బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంది. అయితే అందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.

దాంతో డాక్టర్లు సరొగసి ద్వారా ఆమె తల్లయ్యే ఏర్పాటు చేశారు. ఏక్తా తండ్రి జితేంద్ర, ఏక్తా సోదరుడు తుషార్‌ కపూర్‌ మాత్రమే కాదు ఏక్తా స్నేహితులు కూడా ఈ నిర్ణయాన్ని ఆహ్వానించారు. ఏక్తా తన కుమారుడికి ఘనంగా నామకరణం కూడా చేసింది. జితేంద్ర అసలు పేరైన ‘రవి కపూర్‌’ను తన కుమారుడికి పెట్టుకుంది. తుషార్‌ కపూర్‌ కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా సరొగసి ద్వారా తండ్రైన సంగతి తెలిసిందే.ఈ ఘట్టం ఇలా ముగిసినా పెళ్లి గురించి వెంటపడే బంధువులు మాత్రం అలాగే ఉన్నారు. ‘మా అమ్మా నేను ఈ విషయమై లక్ష సార్లు మాట్లాడుకున్నాం’ అంటుంది ఏక్తా. ‘నేను చేయాల్సిన పనులు చాలా ఉండగా పెళ్లెలా చేసుకోను’ అంటుందామె.

‘కాని గత పదేళ్లుగా మా బంధువుల్లో చాలా మంది ఆడపిల్లలు విడాకులు తీసుకున్నారు. అది చూసి మా అమ్మ నయం... నీకింకా పెళ్లి కాలేదు... నీ నిర్ణయమే సరైనదిలా ఉంది అని నిట్టూర్చింది’ అని నవ్వింది ఏక్తా.జితేంద్ర బంగ్లా ఇప్పుడు ఇద్దరు చిన్నారుల కేరింతలతో కళకళలాడుతోంది. అది కోడలు లేని బంగ్లా, అల్లుడు లేని బంగ్లా కావచ్చు. కాని మనుమలు ఉన్న బంగ్లా. వారంతా సంతోషంగా ఉన్నారు. సమాజానికి ఒక కొత్తపద్ధతి చూపించారు. ఈ దారిలో అందరూ నడవక పోవచ్చు.... ఈ దారి ఒకటి అంగీకారం పొందుతోంది అని తెలుసుకుంటే సరిపోతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top