పద్ధతులే దిద్దుతాయి! | Sakshi
Sakshi News home page

పద్ధతులే దిద్దుతాయి!

Published Sun, Aug 4 2013 11:58 PM

పద్ధతులే దిద్దుతాయి!

 పిల్లల పెంపకం చాలా ఈజీ అట!
 అచ్యుతుని గోపాలకృష్ణమూర్తి అంటున్నారు.
 ఈజీనా!
 ఇక్కడంతా కిందమీద అవుతుంటే...
 చలం ‘బిడ్డల శిక్షణ’ని,నామిని ‘ఇస్కూలు పుస్తకాల్ని’  ముందేస్కుని కూర్చుంటే...
 ఈయనేమో వెరీ సింపుల్ అని తేల్చేస్తారా?
 రస్నా యాడ్‌తో బుట్టలో వేసుకున్నంత మాత్రాన...
 ఏం చెప్పినా పిల్లలు వినేస్తారనుకోవడమేనా!
 ఈమాటకు చిన్న స్మైల్ ఇస్తారు లీల, గోపాలకృష్ణలు.
 ‘ఎవరు చెప్పమన్నారు?’ అని ఆ నవ్వులకర్థం!
 చెప్పకుండా ఎలా?
 ‘చెప్పాలి... కానీ చెప్పీచెప్పనట్లు, చేసీ చూపినట్లు.’
 ఇదే... లీలపాఠం, గోపాలపాఠం...

 ఈవారం మన ‘లాలిపాఠం’ కూడా.
 
 ఎనభైలలో టీవీ సామాన్యులకు అందివచ్చిన రోజులవి. వాణిజ్య ప్రకటనలను కూడా ఆసక్తిగా చూసిన కాలం. చక్కగా సూట్, కోట్ ధరించిన క్రికెట్ దిగ్గజాలు, బాలీవుడ్ నటులు తమ హుందాతనానికి కారణం ఈ దుస్తులే అన్నట్లు పోజిచ్చేవారు... బ్యాక్‌గ్రౌండ్‌లో ‘ఓన్లీ విమల్’ అనే వాయిస్ వినిపించేది, అది విమల్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ ప్రకటన. అలాగే ఫిబ్రవరి దాటి మార్చినెలలో అడుగుపెట్టామంటే ‘పదేళ్లు నిండని  పాప ఎర్రని సాఫ్ట్ డ్రింకు తాగుతూ ఆ గ్లాసును బుగ్గకు తాకించుకుని ‘ఐ లవ్ యూ రస్నా’ అనేది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... కలకాలం గుర్తుండిపోయిన ఈ ప్రకటనల రూపకర్త అచ్యుతుని గోపాలకృష్ణమూర్తి దంపతులు వాళ్ల పిల్లలను పెంచిన విధానమే ఈ వారం మన లాలిపాఠం.
 
 మీ పిల్లల వివరాలు చెప్తారా?

 లీల: మాకు ముగ్గురమ్మాయిలు, ఒకబ్బాయి. అనూరాధ, సుధారాణి, సుజాత, కల్యాణ్.
 
 యాడ్ ఏజెన్సీ నిర్వహణతోపాటు మైకా (ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అహ్మదాబాద్) విద్యాసంస్థను స్థాపించి శిక్షణనిచ్చిన యాడ్ ఎక్స్‌పర్ట్‌గా మీ పిల్లలను ఎలా తీర్చిదిద్దారు?
 కృష్ణమూర్తి: మేము పిల్లలను పెంచాం అంతే, ఇక తీర్చిదిద్దుకోవడం అంటారా... వాళ్లను వాళ్లే తీర్చిదిద్దుకున్నారు. నా ఉద్యోగం, వ్యాపారరీత్యా 45 ఏళ్లు గుజరాత్‌లో ఉన్నాం. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, సౌమ్యంగా వ్యాపారం చేసుకోవడానికి అనువైన గుజరాత్ సమాజం కూడా కారణమే అనుకుంటాను.
 
 గుజరాత్ సామాజిక వాతావరణం మనకు భిన్నంగా ఉంటుందంటారా?
 కృష్ణమూర్తి:  అక్కడివాళ్లు వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు. ఎక్కువమంది చిన్నదో పెద్దదో వ్యాపారం చేస్తుంటారు. ‘లాభనష్టాల రిస్కుతో కూడిన వ్యాపారంకంటే చదువుకుని ఉద్యోగం చేసుకోవచ్చు కదా’ అని సలహా ఇస్తే... ‘చదువుకున్న వాళ్లకు మేము ఉద్యోగాలిస్తాం’ అంటారు. అహ్మదాబాద్ ఐఐఎంలో గుజరాతీలకంటే బయటి రాష్ట్రాల వాళ్లే ఎక్కువగా ఉంటారు.
 
 పిల్లలకు మీరు నేర్పించినదేమీ లేదంటారా?
 కృష్ణమూర్తి: తెలుగు మాట్లాడడం అలవాటు చేశాను. జాతీయస్థాయిలో రాణించడానికి ఇంగ్లిష్ మీడియంలో చదివించాను, గుజరాత్‌లో సెకండ్ లాంగ్వేజ్‌గా గుజరాతీ చదివారు. అయినా పిల్లలెవర్నీ తెలుగు భాషకు దూరం కానివ్వలేదు. మేము నేర్పించిందల్లా మాతృభాష మీద మమకారం, పెద్దల పట్ల గౌరవం, సంస్కారం మాత్రమే.
 
 పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు?
 కృష్ణమూర్తి: ‘యథారాజా తథా ప్రజా’ అన్నట్లు పిల్లల మీద నూటికి నూరు శాతం తల్లిదండ్రుల ప్రభావమే ఉంటుంది. పెద్దయ్యేకొద్దీ వాళ్లపరిధి విస్తరించి సమాజం ప్రభావం చూపిస్తుంది. కానీ ఆ ప్రభావం... తల్లిదండ్రులు ఇంట్లో ఎనిమిది- పదేళ్ల వరకు వేసిన పునాది మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ పునాదే పిల్లలను చక్కటి పౌరులను చేస్తుంది. ఇంట్లో సంస్కారవంతమైన వాతావరణం ఉండేటట్లు చూసుకోవడం, మంచి స్కూల్లో చేర్పించడం... ఈ రెండూ జాగ్రత్తగా చేస్తే చాలనుకునేవాణ్ని.
 
 మంచి స్కూలంటే..?
 కృష్ణమూర్తి: ఎక్కువ ఫీజులు వసూలు చేసే స్కూల్ కాదు. ఈ స్కూలుకి పిల్లలు ఏయే కార్లలో వస్తున్నారు... వంటివి కాదు. పాఠశాల మోటో ఏంటి, టీచర్ల దృక్పథం ఎలా ఉంది, మన సంస్కృతిని, నైతిక విలువలను నేర్పించే వాతావరణం ఉందా... వంటి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చాను. ఏ తరంలోనైనా మధ్యతరగతి జీవితాలు పాటించే విలువలే అత్యున్నతమైన విలువలని నమ్ముతాను. ఆ విలువలు పాటించే స్కూల్లోనే చేర్పించాను. ఇక మిగిలినదంతా ఈవిడే చూసుకున్నది.
 
 మరి కాలేజ్ చదువులు... కోర్సుల గెడైన్స్ ఎలా ఉండేది?
 లీల: ఈయనకేమో పిల్లలు అహ్మదాబాద్ ఐఐఎమ్‌లో ఎంబిఎ చదివి మా యాడ్ ఏజెన్సీ చూసుకోవడానికి వస్తే బావుణ్నని ఉండేది. కానీ నలుగురిలో ఎవరితోనూ ఈ విషయం చెప్పలేదు. పిల్లలు ఏది చదువుతానంటే అదే చదివించాం. పెద్దమ్మాయి బిఎ, రెండో అమ్మాయి ఫ్యాషన్ టెక్నాలజీ, మూడవ అమ్మాయి ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్ కోర్సులు చేశారు. అబ్బాయి బీటెక్ చేసి అమెరికాలో ఎం.ఎస్ చదివాడు.
 
 కృష్ణమూర్తి: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. దానిని ఎవరికి వారు తమకు ఇష్టమైనట్లు జీవించాలి, తమ ఆశలకు ఇష్టాలకు అనుగుణంగా మలుచుకోవాలి. అలా మలుచుకునే స్పేస్‌ని పిల్లలకు ఇవ్వాలి. ‘నేను ఫలానా వృత్తిలో ఉన్నాను కాబట్టి నువ్వు కూడా ఇదే మార్గంలో నడువు’ అని వాళ్ల దారిని మనం నిర్దేశించకూడదు. తమ అభిప్రాయాలకు విలువ ఉందనే భరోసా కలిగించాలి. తర్వాత వాళ్లకు అసంతృప్తి కలిగినప్పుడు ‘అంతా మీరే చేశారు’ అనే అవకాశం ఉంది. ఆ మాట అంటారని మాత్రమే కాదు, అనడానికి ముందు వాళ్లలో కలిగే సంఘర్షణ చిన్నదిగా ఉండదు. వీటన్నింటినీ ఆలోచించి వాళ్లకు ఇష్టమైన ప్రొఫెషన్‌ని ఎంచుకునే అవకాశాన్నిచ్చాను. పెళ్లి విషయంలోనూ పూర్తి స్వేచ్ఛనిచ్చాం, అన్నీ మేము కుదిర్చిన పెళ్లిళ్లే. మా పిల్లల భవిష్యత్తు, మా కుటుంబ నేపథ్యానికి సరిపోతాయనుకున్న సంబంధాలను షార్ట్ లిస్ట్ చేసి వాళ్ల ముందు పెడితే ఫైనల్ సెలెక్షన్ ఎవరికి వాళ్లే చేసుకున్నారు.
 
 బాల్యంలో కథల రూపంలో విలువలు చెప్పే ప్రయత్నం జరిగిందా?
 లీల: నేను పేదరాశి పెద్దమ్మ కథలు, విదుర నీతి, చందమామ కథలు చెప్పేదాన్ని.
 
 ఒకే పెంపకంలో పెరిగినప్పటికీ నలుగురిలో స్పష్టమైన మార్పులు కొన్ని ఉంటాయేమో!?
 లీల: నిజమే, పెద్దమ్మాయికి ఫ్రెండ్స్ ఎక్కువ. రెండో అమ్మాయి నా కొంగు పట్టుకుని తిరిగేది. మూడో అమ్మాయి గుంటూరులో మా అమ్మ దగ్గర పెరిగింది.   ఒకరికొకరికి రెండు- మూడేళ్లు తేడానే. పెద్దమ్మాయికి, అబ్బాయికి మధ్య పదేళ్లు తేడా ఉండడంతో తమ్ముడి బాధ్యత తనే చూసుకునేది.
 
 కృష్ణమూర్తి: ఒకే నేపథ్యంలో పెరిగినప్పటికీ పిల్లల్లో మార్పులు అంటే... కోపం, శాంతం వంటి జెనెటికల్‌గా వచ్చే వాటిని ఎవరూ మార్చలేరు. కానీ నడవడిక, మాట, మన్నన వంటివి అమ్మానాన్నల నుంచే నేర్చుకుంటారు కాబట్టి నలుగురినీ ఒకే విధంగా ఉండేటట్లు పెంచవచ్చు. నా ఇన్నేళ్ల కెరీర్‌లో ‘కృష్ణమూర్తి ఈ విషయంలో అబద్ధం చెప్పాడు, లంచం తీసుకున్నాడు’ వంటి ఆరోపణలు చేసే వాళ్లు లేరు. అంత కచ్చితంగా ఉన్నాను కాబట్టి ఆ మాటను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఈ ప్రభావం పిల్లల మీద ఉండి తీరుతుంది.
 
 గుజరాత్ వ్యాపార సంస్కృతిని మీ పిల్లలూ అలవరుచుకున్నారా?
 లీల: అవును, ముగ్గురమ్మాయిలు కలిసి అహ్మదాబాద్‌లో రెండు బొటిక్స్(దుస్తులు డిజైనింగ్, స్టిచింగ్) పెట్టారు. పెద్దమ్మాయి పెళ్లయిన తర్వాత మిగిలిన ఇద్దరూ చూసుకునేవాళ్లు. ఇప్పుడు కుటుంబాలను చూసుకుంటూ ఇద్దరు హైదరాబాద్, ఒకరు చెన్నైలో ఉంటున్నారు. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి టీవీ, రేడియోలను విప్పి సెట్ చేస్తుండేవాడు. అలాగే ఎలక్ట్రానిక్స్ వైపే వెళ్లాడు.
 
 కృష్ణమూర్తి: ఇష్టమైన పనిని ఎన్ని గంటలు చేసినా శ్రమ అనిపించదు. నేను పద్దెనిమిది గంటలు పని చేశానంటే నాకు ఇష్టమైన క్రియేటివ్ ఫీల్డు కాబట్టి చేయగలిగాను. అకౌంట్స్ సాల్వ్ చేయమంటే అరగంట కూడా కూర్చోలేను. అయితే ఆ తరంలో గుంటూరులో మా కుటుంబ నేపథ్యంలో నాకిలా గైడ్ చేసే వాళ్లు లేకపోవడంతో హిస్టరీ చదివి మ్యూజియంలో పనిచేశాను, తర్వాత క్యాలికో మిల్స్ ఉద్యోగం కోసం అహ్మదాబాద్ వెళ్లాను. ముప్పై ఏళ్లకు నాకు సరైన ప్రొఫెషన్ ఏదో తెలుసుకోగలిగాను.
 
 అంటే... పిల్లలకు కెరీర్ గెడైన్స్ అవసరమేనంటారా?
 కృష్ణమూర్తి: గెడైన్స్ అవసరమే కానీ అది ఆదేశం కాకూడదు. మంచిచెడుల గురించి గెడైన్స్ ఇచ్చినట్లే ఇది కూడ. ఎందుకంటే ఎవరి నడకను వాళ్లు నడవాల్సిందే, ఎవరి జీవితాన్ని వాళ్లు జీవించాల్సిందే. ఆ ఫిలాసఫీనే ఎప్పుడూ నమ్ముతాను. మా తరంతో పోల్చుకుంటే ఈ తరం పిల్లలకు ఎక్స్‌పోజర్ ఎక్కువ. ఎన్ని రకాల కెరీర్ ఆప్షన్లు ఉన్నాయనే సమాచారం వాళ్ల ముంగిట్లో ఉంటోంది. అందులో, తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే అవకాశాన్ని వాళ్లకే ఇవ్వాలి.
 
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 వాళ్ల నాన్నగారి నుంచి టైమ్ మేనేజ్‌మెంట్ నేర్చుకున్నారు. ఆయన రోజూ టంచన్‌గా తొమ్మిదిన్నరకు ఆఫీసులో ఉండేవారు. సొంత ఆఫీసే కదా అని ఆలస్యంగా వెళ్లడం ఆయనకు అలవాటు లేదు. ఇప్పటికీ ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. డెబ్బై ఏళ్ల వయసులో కూడా కన్సల్టెన్సీ నడుపుతున్నారు. ఆయన అబద్ధాలు చెప్పరు. పిల్లలకు అదే అలవాటైంది.
 - లీల
 
 మా అమ్మగారు, అత్తమామలు కూడా మాతోనే ఉండేవారు. అలా పిల్లలకు చిన్నప్పటినుంచి గ్రాండ్‌పేరెంట్స్‌కి సహాయం చేయడం అలవాటైంది. ఇవన్నీ వ్యక్తిని తీర్చిదిద్దే అంశాలే. మనం బాధ్యతగా ఉంటే పిల్లలూ అదే నేర్చుకుంటారు. మనం మన అమ్మానాన్నలను, ఇతరులను ఎవరినైనా కించపరిచేటట్లు మాట్లాడితే పిల్లలూ అదే నేర్చుకుంటారు. మా అమ్మగారితో ఈవిడ పోట్లాడిన సందర్భం ఒక్కటీ లేదు. భార్యాభర్తలు ఇంటిని యుద్ధరంగం చేయకుండా ప్రశాంతంగా ఉంచడంలో సక్సెస్ అయితే పిల్లల పట్ల బాధ్యతగా ఉన్నట్లే.
 - కృష్ణమూర్తి
 

Advertisement
 
Advertisement
 
Advertisement