
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) బోర్డు నుంచి డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్(dr krishnamurthy subramanian)ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా ఆ పోస్టు ఖాళీగా ఉన్నట్లు ఐఎంఎఫ్ వెబ్‌సైట్ ప్రకటించింది.
ఐఎంఎఫ్(IMF) బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆగష్టు 2022లో భారత్ కృష్ణమూర్తిని నామినేట్ చేసింది. నవంబర్ 1, 2022లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది నవంబర్‌తో ఆయన పదవీ కాలపరిమితి ముగియనుంది. ఈ లోపే భారత ప్రభుత్వం ఆయన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.
కృష్ణమూర్తి సుబ్రమణియన్ కేవలం భారత్‌కు మాత్రమే కాదు.. బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకకు సైతం ప్రాతినిధ్యం వహించారు. మే 2వ తేదీతో ఆయన పదవి కాలపరిమితి ముగిసినట్లు ఐఎంఎఫ్ అధికారిక వెబ్‌సైట్ ప్రకటించింది. అంతకు ముందు కృష్ణమూర్తి భారత్‌కు ప్రధాన ఆర్థిక సలహాదారుగా (2018-2021)గా వ్యవహరించారు. అయితే ఆ టైంలోనూ ఆరు నెలల కంటే ముందు ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ప్రస్తుతం ఆర్థిక కార్యదర్శిగా ఉన్న అజయ్ సేత్.. ఈ జూన్‌లో రిటైర్ కాబోతున్నారు. ఈయన పేరును ఐఎంఎఫ్ బోర్డుకు భారత్ నామినేట్ చేసే అవకాశం ఉందని సమాచారం.
మే 9వ తేదీన ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో పాక్‌కు ఇవ్వబోయే ఆర్థిక సాయం గురించి చర్చించబోతున్నారు. పాక్‌కు ఎట్టి పరిస్థితుల్లో ఫండింగ్ ఇవ్వొద్దని.. ఆ నిధులను ఉగ్రవాదులకు తరలిస్తోందంటూ భారత్ వాదిస్తున్ను సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కృష్ణమూర్తిని బోర్డు నుంచి తొలగిస్తూ భారత్ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
కారణాలేంటో?
ఐఎంఎఫ్ నుంచి కృష్ణమూర్తి తొలగింపుపై ఆర్థిక నిపుణలు విశ్లేషణలు జరుపుతున్నారు. ఐఎంఎఫ్ పని తీరుపై.. దాని డాటా మెకానిజంపై ఆయన చేస్తున్న తీవ్ర విమర్శలే అందుకు కారణమై ఉండొచ్చనే భావిస్తున్నారు. అలాగే.. ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగే అవకాశాలను విశ్లేషిస్తూ ఆయన రాసిన India@100 పుస్తకం కోసం ఆయన చేస్తున్న ప్రమోషన్ కూడా మితిమీరడం కూడా కారణం అయ్యి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.