గొల్లపూడి వారింట శక్తి స్వరూపిణులు

Dussehra Celebration In Gollapudi Maruthi Rao Residence At Chennai - Sakshi

తమిళదేశంలో తెలుగు కళ

కన్నగి (తమిళం), కాళీమాత, సత్యభామ, ఝాన్సీ, అంబ, మోహిని, రంభ,  రాధ, గాంధారి, ఊర్మిళ, ద్రౌపది, మండొదరి, శూర్పణఖ, అరుంధతి, సీత, సావిత్రి, అహల్య, గంగ.. ఈ పద్దెనిమిది మంది శక్తి స్వరూపిణులు ఈ ఏడాది శరన్నవరాత్రులకు గొల్లపూడి వారింట్లో కొలువు తీరారు

దసరా నవరాత్రులు వచ్చాయంటే చెన్నైలోని ఓ తెలుగు సంప్రదాయ నివాసంలోకి సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదెవరిదో కాదు.. ప్రఖ్యాత రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు ఇల్లు. చెన్నై టీనగర్‌ లోని శారదాంబాళ్‌ వీధిలో ఉన్న శివానీ నిలయంలో ఏటా కొలువుదీరే బొమ్మల కొలువు గత పందొమ్మిదేళ్లుగా వివిధ రకాల థీమ్‌లతో చెన్నైలోని తెలుగువారే కాకుండా, తమిళులు సైతం ఆసక్తితో తిలకించేలా ఉంటోంది. గొల్లపూడివారి కోడళ్లయిన కుమారి, సునీతలు పెట్టే ఆ బొమ్మల కొలువు మన సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచారాలు అలవాట్లకు ప్రతీకగా నిలుస్తోంది. 2001లో మొదటిసారిగా ‘తిరుమల తిరుపతి ఏడు కొండల మహత్యం’ అనే అంశంతో మొదలైన వీరి బొమ్మల కొలువు థీమ్‌లు ఆ తర్వాత రామాయణం, కృష్ణలీలలు, నవరసాలు, మన పండుగలు, శ్రీనివాస కల్యాణం, నవ దుర్గలు, షిర్డీసాయి జీవిత చరిత్ర, గణాధిపత్యం తదితర విశేషాంశాలతో కొలువు తీరుతూ వస్తున్నాయి.

ఈ ఏడాది ఇతిహాసాలు, పురాణాలు, చరిత్రల ఆధారంగా మహిళా శక్తులుగా ఆదర్శంగా నిలిచిన స్త్రీ మూర్తులను బొమ్మల కొలువులో ఉంచారు. ప్రత్యేకంగా భారతం, భాగవతం, రామాయణంలోని పద్దెనిమిది మంది శక్తి స్వరూపిణులు సందర్శకులకు స్ఫూర్తి నింపుతున్నారు. ఈ పద్దెనిమిది మందీ.. కన్నగి (తమిళం), కాళీమాత, సత్యభామ, ఝాన్సీ, అంబ, మోహిని, రంభ,  రాధ, గాంధారి, ఊర్మిళ, ద్రౌపది, మండొదరి, శూర్పణఖ, అరుంధతి, సీత, సావిత్రి, అహల్య, గంగ! గంగ దివి నుండి భువికి దిగివచ్చిన, సీత భూమాత ఒడిలోకి వెళ్లిన, రామాయణ యుద్ధానికి శూర్పణఖ కారణమైన, అవమానం పగగా మారి ద్రౌపది ప్రతీకారంతో మహాభారత యుద్ధ జరిగిన ఎన్నో ఇతిహాస ఘట్టాలలో మహిళలు శక్తులుగా నిలిచిన తీరు ఇక్కడి బొమ్మల కొలువులో కనిపిస్తుంది.ఈ ఏడాది కొలువును తీర్చిదిద్దేందుకు దాదాపు ఐదు సంవత్సరాలుగా ఒక్కో బొమ్మను కూడబెట్టడం జరిగిందని కుమారి, సునీత తెలిపారు.

ఒక్కోసారి బొమ్మల సేకరణకు రోజులు పడుతుండగా కొన్ని సమయాల్లో థీమ్స్‌కు తగ్గట్టు బొమ్మలు దొరక్క పోవటంతో వారే స్వయంగా బొమ్మలను తయారు చేసుకుని కొలువులో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులూ లలితా సహస్రనామం చదువుతూ.. రెండు పూటలా తొమ్మిది నైవేద్యాలు పెడుతూ ముత్తయిదువులను పిలిచి తాంబూలాలను అందిస్తున్నారు. ఆఖరి రోజున చందనపు బొమ్మలకు హారతి ఇచ్చి నిద్రపుచ్చి మరో ఏడాది వరకు అందరికీ సంతోషాలను ఇవ్వమని అమ్మవారికి దిష్టితీసి బొమ్మల కొలువుకు ముగింపు పలుకుతారు. ఏటా బొమ్మల కొలువు తీర్చినప్పటి నుండి చెన్నై నగరం నలుమూలల నుండి గొల్లపూడి నివాసానికి తెలుగువాళ్లు మహిళలు బారులు తీరుతారు. ఇక ఈ బొమ్మల కొలువుకు నగరంలోని అన్ని సాంస్కృతిక పోటీలలో ప్రధమ స్థానమే. నవరాత్రి కొలువుల్లో తెలుగు వారికే కాదు.. తమిళులకు కూడా స్పూర్తిదాయక సాంప్రదాయాలకు ఆచారాలకు గొల్లపూడి కోడళ్లు మార్గదర్శకంగా నిలుస్తున్నారు.

– సంజయ్‌ గుండ్ల,
 ప్రత్యేక ప్రతినిధి సాక్షి టీవీ, చెన్నై

ఆమెరికాలో పిల్లల కొలువు
ఖండాలు దాటినా మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు మర్చిపోకుండా పాశ్చాత్య జీవితంలోనూ అచ్చ తెలుగు కాపాడుకుంటూ వస్తున్నారు గొల్లపూడివారు. గత పదేళ్లుగా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దసరా బొమ్మల కొలువుకు వేదికగా నిలుస్తోంది అమెరికాలోని ఫీనిక్స్‌ నగరంలో ఉంటున్న గొల్లపూడి మారుతీరావు సోదరుడైన గౌరి శంకర్‌ కుమార్తె అపర్ణ  కుటుంబం. వారి పిల్లలిద్దరూ ఏటా దసరా నవరాత్రులను పురస్కరించుకుని వివిధ ఆంశాలతో కూడిన థీమ్స్‌తో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నారు. సమీపంలోని తెలుగువారందరీ ఏకం చేసేలా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా తమ నివాసంలో ప్రత్యేకంగా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు.

క్రికెట్‌ స్టేడియం, ప్లేయర్స్, గ్యాలరీ, కాంపౌండ్‌ ఒక థీమ్‌ గా; రెండోదిగా విలేజ్‌ థీమ్‌లో సాయిబాబా ఆలయం, వివిధ రకాల మనుషులు; మూడో థీమ్‌లో నాలుగు ఋతువులను వివరించే విధంగా ఒకే చోట బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. అంతేకాదు నిత్యం భజనలు, హారతులతో పూజలు నిర్వహిస్తున్నారు. కొలువుకు బొమ్మలు దొరకకపోయినా ఇండియా నుండి తమ బంధువులు, స్నేహితులతో తెప్పించుకుని శ్రమకోర్చి నవరాత్రుల సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ‘ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ భూమి భారతిని’ అంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top