ఇమ్యూనిటీ.. ఈజీగా

Docter Ranaweyana Ramesh Immunity Story In Sakshi Family

ఆ జబ్బు కరోనా వైరస్‌ వల్ల వచ్చే కోవిడ్‌ వ్యాధా కాదా?... మనకెందుకు... వదిలేయండి.  అది ఇంకేదైనా ఇతర వైరస్‌తో వచ్చే జలుబూ, ఇన్‌ఫ్లుయెంజానా?...   ఆ అంశాన్నే ఆలోచించకండి.  ఒకవేళ అది బ్యాక్టీరియా లేదా ఫంగస్‌ వల్ల వచ్చే మరేదైనా ఇతర వ్యాధా?... మనకది అనవసరం. అది ఏ వ్యాధి అయినప్పటికీ... మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు స్వాభావిక కవచం ఒక్క వ్యాధి నిరోధకశక్తి మాత్రమే. అంటే... ఇంగ్లిష్‌లో చెప్పాలంటే ఇమ్యూనిటీ మాత్రమే. ఇమ్యూనిటీ మనకు ఎందుకు అవసరం, అత్యంత తేలిగ్గా దాన్ని సంపాదించడం ఎలా అన్నది తెలుసుకుంటే అది కరోనా అయినా... మరింకే వ్యాధి అయినా... మనం నిశ్చింతగా ఉండవచ్చు. 

మీరు మాల్స్‌లోకి ప్రవేశిస్తున్నప్పుడూ... లేదా ఆఫీస్‌లోకి ఎంటర్‌ అవుతున్నప్పుడూ లేదా ఇంకేదైనా ప్రదేశానికి వెళ్తున్నప్పుడు మనిషిని అంటుకోకుండా... దూరం నుంచే టెంపరేచర్‌ చూస్తున్నారు. మనిషి సాధారణ ఉష్ణోగ్రత మామూలుగానే ఉంటే మీరు వెళ్లాల్సిన చోటికి అనుమతిస్తున్నారు. ఎందుకలా ఉష్ణోగ్రత చెక్‌ చేస్తున్నారు? దాంతో తెలిసేదేమిటి? బాడీ టెంపరేచర్‌ నార్మల్‌గా ఉంటే వ్యాధి లేనట్టేనా?... ఈ అనుమానాలు వచ్చే ఉంటాయి. అదెందుకో కింద ఉన్న బాక్స్‌లో చదవండి. 

మరి దేహ ఉష్ణోగ్రత పెంచడం ద్వారా  వైరస్‌ వ్యాధుల్ని నివారించవచ్చా? 
జ్వరం రాకుండానే దేహ ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా వైరస్‌లతో వచ్చే వ్యాధుల్ని నివారించడం సాధ్యమా? దీనికి జవాబు కొంతవరకు అవుననే చెప్పవచ్చు. చాలావరకు అలా నివారించవచ్చు. అదెలాగో చూద్దాం. మనలో చాలామందిలో... బాగా చల్లగా ఉన్న ఐస్‌క్రీమ్‌ / కూల్‌డ్రింక్‌ / చల్లటి ఫ్రిజ్‌ వాటర్‌ తాగాక గొంతులో కాస్త దురదపెట్టినట్టుగా (ఇరిటేటింగ్‌గా) అనిపించి, క్రమంగా అది జలుబులోకి దిగడం చూసే ఉంటారు. మామూలు సమయాల్లో అయితే దీని గురించి పెద్దగా పట్టించుకోకపోయినా... ప్రస్తుత కరోనా వైరస్‌ వ్యాప్తి సమయంలో ఇలా జలుబు చేయడం చాలా ఇబ్బందినీ, సామాజికంగా వివక్షకు గురయ్యే అవకాశాలనూ పెంచుతుంది. కాబట్టి ఇలాంటి సమయాల్లో గొంతులో కాస్తంత దురద (ఇరిటేటింగ్‌) గా ఉండి జలుబు/ఫ్లూ కు లోనయ్యే పరిస్థితి ఉంటే చిన్న జాగ్రత్తతోనే దాన్ని నివారించుకోవచ్చు. 

ఈ సువిశాల ప్రపంచంలోని అన్ని ప్రదేశాలతో పాటు మన గొంతులోనూ ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటాయి. అలాగే అక్కడ నిద్రాణమైన స్థితిలో (డార్మంట్‌గా) వైరస్‌ కూడా ఉండనే ఉంటుంది. మనం చల్లటి నీరు తాగగానే ఆ వైరస్‌ తన నిద్రాణమైన స్థితిని వదిలి ప్రాణం పోసుకుంటుంది. అంతే... అలా ప్రాణం పోసుకున్నది కాస్తా... వెంట వెంటనే కణాలన్నింటిలోకీ ప్రవేశిస్తూ, ఆక్రమిస్తూ, తన సూచనలకు అనుగుణంగా అవి పనిచేసేలా ఆదేశిస్తూ... తనను తాను అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. యాంటీబాడీస్‌ తయారయ్యేవరకు అదలా తన ప్రభావం చూపుతూనే ఉంటుంది. మనకు జలుబు వైరస్‌ గానీ  ఇతర వైరస్‌లు దేహంలోకి వచ్చాక జరిగే ప్రక్రియంతా దాదాపుగా ఇలాగే ఉంటుంది. 

ఇమ్యూనిటీ ఉంటే లాభాలేమిటి... 
దేహానికి చాలా మంచి వ్యాధినిరోధక శక్తి అంటే... వైద్యపరమైన భాషలో చెప్పాలంటే ఇన్నేట్‌ ఇమ్యూనిటీ ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఉదాహరణకు కొందరిలో వ్యాధికి సంక్రమింపజేసే వైరస్‌ ప్రవేశించినప్పటికీ... అది దాని ఉనికిని చాటుకోకుండానే, ఎలాంటి చేటూ చేయలేకుండానే అలా నిద్రాణంగానే ఉండిపోయే అవకాశమూ ఉంది. కారణం మనలోని ఇన్నేట్‌ ఇమ్యూనిటీ వల్ల పుట్టే యాంటీబాడీస్‌. ఇవి తగినంతగా లేనందువల్లనే కదా... అందరికీ వైరస్‌ సోకినప్పటికీ... గుండెజబ్బులున్నవారూ, డయాబెటిస్‌ లేదా హైబీపీ వంటి ఇతర సమస్యలతో వ్యాధి నిరోధకత తగినంతగా లేనివారు ఆ వైరస్‌ బారినపడుతున్నారు. ఒకవేళ వాళ్లందరిలోనూ  మంచి వ్యాధి నిరోధకత ఉండి ఉంటే...? వారు అసలు  వైరస్‌ బారిన పడనే పడరు కదా. 

ఇమ్యూనిటీనీ ఈజీగా తెచ్చుకోవడం ఎలా?
మనకు స్వాభావికమైన సాధారణ ఇమ్యూనిటీకి తోడ్పడే అంశాల్లో అత్యంత ప్రధానమైనవి ఎంజైములు, ప్రోటీన్, విటమిన్‌–సి, విటమిన్‌–డి, జింక్‌. అత్యంత ప్రధానమైన ఈ ఐదూ సమకూరడానికి  సమతులాహారం కావాలి. అన్ని రకాల ఆకుకూరలు, రకరకాల రంగుల్లో ఉండే కాయగూరలతో ఎంజైములు లభిస్తాయి. కొవ్వు తక్కువగా ఉండే మాంసాహారం లేదా పప్పు వల్ల ప్రోటీన్లు లభ్యమవుతాయి. తాజా నిమ్మజాతి పండ్లు, కమలాలు, జామ వంటి వాటితో విటమిన్‌–సి దొరుకుతుంది. లే లేత సూర్మకిరణాల ద్వారానూ విటమిన్‌–డి లభిస్తుంది. తాజా చేపలు, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, నట్స్, కోడిగుడ్లు, పొట్టుతీయని ముడి ధాన్యాలతో జింక్‌ లభ్యమవుతుంది. ఇవన్నీ సరిగ్గా ఒంటికి పడుతూ చురుగ్గా ఉండటానికి వ్యాయామం చేయాలి. 

ఇలా వేణ్ణీళ్లూ, ఇమ్యూనిటీ కోసం ఐదు పదార్థాలూ, కంటినిండా చక్కటి నిద్ర, తేలికపాటి వ్యాయామం, మానసిక ఉల్లాసంతో ఒక్క కరోనానే కాదు... మరెన్నో వ్యాధుల్నీ కట్టడి చేయవచ్చూ... రాకుండానే నివారించవచ్చూ... వచ్చినా అత్యంత తేలిగ్గా బయటపడవచ్చు. ఇకపై మనం మిగతా అన్ని వైరస్‌లలాగే కరోనాతో కలిసి ఉండాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలుకొని అందరూ చెబుతున్న విషయమే కాబట్టి... మనమంతా సామాజిక దూరాన్ని పాటిస్తూ...పరిశుభ్రతతో మెలగుతూ...  మన మంచి ఆరోగ్యానికి చక్కటి జీవనశైలిని అవలంబిద్దాం. ఇమ్యూనిటీతో  నిశ్చింతగా ఉందాం. 

వేణ్ణీళ్లతోనే వైరస్‌నూ / ఇతర వ్యాధుల్నీ నివారించడమెలా?
మన దేహ ఉష్ణోగ్రత పెరగడం వల్ల వైరస్‌ చనిపోతుందని తెలుసుకున్నాం కదా. అదే సూత్రం ఆధారంగానే వేణ్ణీళ్లతోనే వైరస్‌ను నివారించడం ఎలాగో చూద్దాం. మనం తాగ గలిగేంత వేడి (టాలరబుల్‌ టెంపరేచర్‌) ఉండేంతగా నీటిని వెచ్చబెట్టుకుని, దాన్ని తాగుతూ ఉంటే... దేహ ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. ఆ ఉష్ణోగ్రతను తగ్గించడం కోసమే మనకు చెమటలు పడతాయి. ఆ చెమటలు ఆవిరయ్యేలా మనం ఫ్యానుగాలికి ఉన్నామనుకోండి. అప్పుడు దేహంలోని ఉష్ణోగ్రతను (లేటెంట్‌ హీట్‌) తీసుకుని, ఆ చెమట నీరు ఆవిరవుతూ దేహాన్ని చల్లబరుస్తుంది. ఇలా మనం వేడి నీటిని తరచూ తాగుతూ (సిప్‌ చేస్తూ) ఉన్నామనుకోండి. జ్వరం రాకుండానే దేహం వేడెక్కుతూ ఉంటుంది. మళ్లీ ఆ వేడిని చల్లబరచడానికి చెమటలు పట్టడం, దేహం చల్లబడటం జరుగుతూ ఉంటుంది. ఇలా వేణ్ణీళ్లతోనే దేహం వేడిగా ఉండేలా చేస్తూ ఉంటే... దాదాపు 48 గంటల వ్యవధిలో మన దేహంలోకి ప్రవేశించిన వైరస్‌ చనిపోయి, స్వాభావికంగానే కట్టడి అయిపోయే అవకాశం ఉంది. అంటే... ఇలా వేణ్ణీళ్లు తాగుతుండడం ద్వారానే మనం చాలావరకు వైరస్‌ను నివారించగలమన్నమాట. అందుకే ఈ సీజన్‌లో చాలా చల్లగా ఉన్న కూల్‌డ్రింక్స్‌కూ, చిల్డ్‌ వాటర్‌కూ దూరంగా ఉంటూ...  తరచూ వేణ్ణిళ్లు సిప్‌ చేస్తూ ఉండండి.

టెంపరేచర్‌ చెక్‌ ఎందుకంటే...? 
మన శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ 98.4 డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే కదా. మన శరీరంలో కొనసాగే అన్ని రకాల పనులు (బాడీ మెటబాలిజమ్‌) సరిగ్గా సాగాలంటే ఆ ఉష్ణోగ్రత అలా కొనసాగుతూ ఉండాలి. కానీ మన దేహంలోకి ఏదైనా వైరస్‌గానీ వ్యాధి కారక క్రిమిగానీ ప్రవేశిస్తే తనను తాను రక్షించుకోడానికి శరీరం ఓ పని చేస్తుంది. మన దేహంలో నార్మల్‌ టెంపరేచర్‌ దగ్గర వ్యాధి కలిగించే ఆ క్రిమి హాయిగా మనుగడ సాగిస్తుంది. కానీ దేహ ఉష్ణోగ్రత ఉండాల్సిన దాని కంటే ఎక్కువ ఉంటే అది బతకలేదు. అందుకోసమే మెదడులోని టెంపరేచర్‌ సెంటర్‌ మన దేహ ఉష్ణోగ్రత పెరిగేలా ఆదేశిస్తుంది. అలా రోగాన్ని ఎదుర్కొనే క్రమంలో భాగంగా మన దేహ ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమిటి? మన శరీర ఉష్ణోగ్రత పెరిగిందంటే దేహంలో ఏదో శత్రుజీవి ఉందని అర్థం. అందుకే నలుగురు గుమిగూడే ప్రదేశాల్లోకి అనుమతించడానికి అలా థర్మల్‌ స్క్రీనింగ్‌ (అంటే వేడిని తెలుసుకునే ఉపకరణంతో పరీక్షించి... వడపోత) నిర్వహిస్తున్నారని తెలుసుకోవచ్చు. 
-డాక్టర్.‌ రానవేయిన రమేశ్, ఈఎన్‌టీ సర్జన్, 
ప్రభుత్వ ఈఎన్‌టీ హాస్పిటల్, 
కోఠీ, హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top