టూత్‌పేస్ట్, సన్‌క్రీమ్‌లతో డయాబెటిస్‌ రిస్క్‌!

 Diabetes risk with toothpaste and suncream - Sakshi

పరిశోధన

అధిక బరువుకు దారితీసే ఆహారపు అలవాట్ల వల్ల, ఒత్తిడి వల్ల, జన్యు కారణాల వల్ల డయాబెటిస్‌ వస్తుందని ఇప్పటివరకు అందరికీ తెలిసిందే. ఇవి మాత్రమే కాదు, టూత్‌పేస్ట్‌ల వల్ల, మేకప్‌ కోసం వాడే సన్‌క్రీమ్‌ వంటి పదార్థాల వల్ల కూడా టైప్‌–2 డయాబెటిస్‌కు లోనయ్యే ముప్పు ఉంటుందని టెక్సాస్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. టూత్‌పేస్ట్‌లు, సన్‌క్రీమ్‌లు తదితర పదార్థాల్లో తెల్లని తెలుపు రంగు కోసం వాడే ‘టిటానియమ్‌ డయాక్సైడ్‌’ అనే రసాయనం డయాబెటిస్‌ ముప్పును కలిగిస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని వారు వెల్లడించారు. టిటానియమ్‌ డయాక్సైడ్‌ను ప్లాస్టిక్, పెయింట్లు సహా రకరకాల గృహోపకరణ వస్తువుల తయారీలో వాడటం ఇరవయ్యో శతాబ్ది తొలి రోజుల నుంచి ప్రారంభమైంది. దీని వాడుక 1960 దశకం నుంచి విపరీతంగా పెరిగింది. టిటానియమ్‌ డయాక్సైడ్‌ కేవలం ఆహార పానీయాల ద్వారా మాత్రమే కాదు, శ్వాసక్రియ ద్వారా కూడా మనుషుల శరీరాల్లోకి చేరుతుందని, రక్తంలో కలిసిన టిటానియమ్‌ డయాక్సైడ్‌ కణాలు పాంక్రియాస్‌ను దెబ్బతీస్తాయని టెక్సాస్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తమ పరిశోధన కోసం ఎంపిక చేసుకున్న వారిలో టైప్‌–2 డయాబెటిస్‌ రోగుల పాంక్రియాస్‌లో టిటానియమ్‌ డయాక్సైడ్‌ కణాలను గుర్తించామని, డయాబెటిస్‌ లేని వారి పాంక్రియాస్‌లో ఆ రసాయనిక కణాలేవీ లేవని వారు వివరించారు. టిటానియమ్‌ డయాక్సైడ్‌ను పేపర్‌ తయారీలోను, కొన్ని రకాల ఔషధ మాత్రల తయారీలోను, ఫుడ్‌ కలర్స్‌ తయారీలో కూడా వాడుతున్నారని, దీని వాడకం పెరుగుతున్న కొద్దీ డయాబెటిస్‌ రోగుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చి, ఇప్పుడిది మహమ్మారి స్థాయికి చేరుకుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిటానియమ్‌ డయాక్సైడ్‌ ప్రభావం వల్ల పాంక్రియాస్‌ పాడైనవారిలో ఇన్సులిన్‌ ఉత్పత్తి క్షీణించడం వల్ల వారు టైప్‌–2 డయాబెటిస్‌ బారిన పడుతున్నారని టెక్సాస్‌ శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ ఆడమ్‌ హెల్లర్‌ తెలిపారు. ఆస్బెస్టాస్‌ ఊపిరితిత్తుల వ్యాధిని కలిగించే రీతిలోనే టిటానియమ్‌ డయాక్సైడ్‌ డయాబెటిస్‌కు కారణమవుతోందని తమ పరిశోధనలో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్నారు. దీనిపై మరింత విస్తృతంగా పరిశోధనలు సాగించాల్సి ఉందని, తాము ఆ దిశగానే ముందుకు సాగుతున్నామని డాక్టర్‌ హెల్లర్‌ వెల్లడించారు. ఈ పరిశోధన వివరాలను ‘కెమికల్‌ రీసెర్చ్‌ ఇన్‌ టాక్సికాలజీ’ జర్నల్‌లో ప్రచురించారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top