మెట్లు దిగడంలోని ‘ఆనందం’...

Devotional information by prabhu kiran - Sakshi

అతి సాధారణమైన జీవన స్థితిగతుల ప్రస్తావనతో, అత్యంత మర్మయుక్తమైన పరలోక సత్యాలను ఆవిష్కరించిన మహా ప్రబోధకుడు యేసుప్రభువు. ఆయన పరలోకంలో ఉండే దేవుడు. మరి భూలోకానికి ఎందుకొచ్చాడు? అన్నది అప్పుడు, ఇప్పుడు కూడా అంతా వేసే ప్రశ్న. అందువల్ల తన ఆగమన ఉద్దేశ్యాన్ని యేసు ఒక ఉపమానంలో అద్భుతంగా వివరించాడు. ఒక కాపరికి వంద గొర్రెలుండేవట. వాటిలో ఒకటి తప్పిపోతే, ఆ కాపరి మిగిలిన తొంబై తొమ్మిది గొర్రెలనూ వదిలేసి, దాన్ని వెదికి, చివరికి కనుగొని దాన్ని భుజాన వేసుకొని ఇంటికొచ్చి అది దొరికినందుకు తన కుటుంబంతో, స్నేహితులతో కలిసి చెప్పుకుని ఆనందించాడట. (లూకా 15:4–7). తన వారే అయిన మానవాళి తనను విడిచి తప్పిపోతే, వారిని వెదికి మళ్ళీ పొందేందుకు దేవుడు ’పరమ కాపరిగా’, యేసుక్రీస్తుగా ఈ లోకానికొచ్చాడని అలా వివరించాడాయన. అందుకు ’పోగొట్టుకోవడం’ అనే ఒక జీవితానుభవాన్ని వాడుకొని ఆ సత్యాన్ని ఆయన తెలిపాడు.

పొందే అనుభవాలకన్నా, పోగొట్టుకునే అనుభవాలే జీవితంలో అత్యంత విలువైన పాఠాలను నేర్పిస్తాయి. పోగొట్టుకున్నపుడున్న బాధకన్నా, వాటిని తిరిగి పొందినప్పుడు ఎన్నో రెట్లు ఎక్కువగా సంతోషిస్తామని దేవుడే తన అనుభవంగా వివరించిన ఉపమానమిది. కేవలం నాలుగు వచనాల ఈ ఉపమానంలో నాలుగుసార్లు ‘సంతోషం’ అనే మాటను ప్రభువు వాడాడంటే, అదెంత ప్రాముఖ్యమైన అనుభవమో అర్థం చేసుకోవచ్చు. లోకంలో అంతా అంతిమంగా వెదికేది ’సంతోషం’, ’ఆనందం’ కోసమే. కోటానుకోట్ల ఆస్తిపాస్తులున్న కుబేరులు కూడా ‘ఆనందం’ కరువైన నిరుపేదలుగా బతుకుతున్న ఆధునిక జీవనశైలిలో దాన్నెలా పొందాలో ప్రభువు చెప్పాడు. కొత్తదేదైనా సంపాదించుకున్న ‘ఆనందం’ కేవలం తాత్కాలికమైనది. కానీ పోగొట్టుకున్నది సంపాదించుకున్న ఆనందం చాలా గొప్పది, శాశ్వతమైనది.

మనం పోగొట్టుకున్నది  గాడి తప్పిన మన జీవితమే కావచ్చు, దారితప్పిన, మనల్ని వదిలేసిన మన సంతానం, తోబుట్టువులు కూడా కావొచ్చు. పోగొట్టుకున్న మన పరువు, ప్రతిష్టలూ కావొచ్చు. అయితే మనల్ని వదిలేసిన వాళ్ళే మళ్ళీ మనల్ని వెదుక్కొంటూ వెనక్కి రావాలన్నది లోకం చేసే వాదన. అలా కాదు, మనమే వారిని వెదికి తిరిగి సమకూర్చుకోవాలన్నది దేవుడు తానే ఆచరించి మనకు చేస్తున్న ప్రతిపాదన. మనమున్న చోటినుండి రెండు మెట్లు దిగి వెళ్ళడానికి అడ్డొచ్చేది మన ‘అహమే’!! అందువల్ల చాలాసార్లు మన ఆనందానికి అడ్డుకట్ట వేసేది కూడా అదే. కాని పరలోకం నుండి భూలోకానికి దిగిరావడానికి దేవునికే లేని ‘అహం’ రెండు మెట్లు దిగడానికి మనిషికెందుకటా? వినోదాన్ని ఆనందంగా భ్రమిస్తున్న, ఆనందాన్ని సంపాదించుకోవడానికి అనేక అడ్డుదార్లు తొక్కుతున్న నేటి లోకానికిది దేవుడు చూపించిన నిజమైన మార్గం.

అందరికీ ఆనందాన్నిచ్చే దేవునికే పరమ ఆనందాన్నిచ్చిన అనుభవం, పోగొట్టుకున్న పాపిని తిరిగి సంపాదించుకున్నప్పుడన్న సత్యాన్ని బైబిల్‌లో చదివినప్పుడల్లా నా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి (లూకా 15:10). ఆనాడు యేసుప్రభువు ప్రవచనాలు విన్నవాళ్లలో తామెంతో నీతిమంతులమన్నట్టు పోజులు కొట్టే పరిసయ్యులు, శాస్త్రులున్నారు, పరమ పాపులుగా లోకం ముద్రవేసిన సుంకరులు, వేశ్యలు కూడా ఉన్నారు. పరిసయ్యుల చెవులకెక్కి వారిని మార్చలేని ఆయన బోధ ఎంతోమంది నాటి ‘పాపులను’ మార్చింది. అందుకే దేవుని వద్దకు తిరిగి రావాలనుకొని తొంబై తొమ్మిది మంది ‘నీతిమంతుల వల్ల కలిగే సంతోషం కన్నా, దేవుని కృపకు పాత్రుడైన ఒక పాపి వల్ల కలిగే సంతోషం పరలోకంలో ఎంతో గొప్పదని ప్రభువన్నాడు (15:7). అందుకే దేవుడు దీనులు, అభాగ్యులు, నిరుపేదలు, లోకం విసర్జించిన పాపుల పక్షపాతి అన్నది నిత్యసత్యం.

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top