దేవుని మనసు తెలుసుకోవాలి, గెలవాలి...

Devotional information by prabhu kiran - Sakshi

మహాబలుడు గొల్యాతును చూసి ఇశ్రాయేలీయుల సైనికులంతా జడిసిపోతుంటే, బలం లేనివాడు, ఇంకా బాలుడే అయిన దావీదు ముందుకొచ్చి తాను అతనితో తలపడి అతన్ని ఎదిరిస్తానన్నాడు. కాకలు తీరిన వీరుల వంటి నా సైనికులు చెయ్యలేని పని, గొర్రెల కాపరివి, బాలునివైన నీవెలా చేస్తావని సౌలు రాజు ప్రశ్నిస్తే, దావీదు తన అనుభవాల్లో ఒకటి ఆయనకు వివరించాడు. ఒకసారి దావీదు తన గొర్రెలమందను కాస్తుండగా ఒక సింహం, ఎలుగుబంటి కలిసి మంద మీద దాడి చేసి ఒక గొర్రెపిల్లను నోటకరుచుకొని పారిపోతుంటే తాను వాటిని ఎదిరించి, తరిమి ఆ గొర్రెను విడిపించానని, అవి తనమీద దాడి చేస్తే వాటిని కొట్టిచంపానని దావీదు చెప్పాడు.

సింహం, ఎలుగుబంటి నుండి రక్షించిన యెహోవాయే గొల్యాతు నుండి కూడా తనను రక్షిస్తాడని దావీదు తన విశ్వాసాన్ని వెల్లడించాడు. జరిగిందేమిటంటే, గొల్యాతును దావీదు ఎదిరించగా, దేవుడు దావీదును కాపాడటమే కాదు, గొల్యాతును దావీదు చేతికి అప్పగించాడు. అతన్ని సంహరించి ఇశ్రాయేలు సైన్యానికి దావీదు ఎంతో అనూహ్యమైన ఘనవిజయాన్ని సాధించిపెట్టాడు (1 సమూ 17:33–51). దావీదును తదుపరి రాజుగా దేవుడభిషేకించిన కొన్నాళ్లకే జరిగిన ఘటన ఇది.

సంకల్ప బలానికి, శరీర దారుఢ్యానికి అసలు సంబంధమే లేదు. ఆనాడు యుద్ధక్షేత్రంలో ఉన్న సైనికులంతా మహా బలవంతులే అయినా గొల్యాతును చూసి జడుసుకున్నారు. యుద్ధవిద్యలు తెలియనివాడు, గొర్రెల కాపరి, దుర్బలుడైన దావీదు మాత్రం అంతటి బలవంతుణ్ణి గెలిచి విజయం సాధించి పెట్టాడు. తనను గెలిపించేది తన దేవుడైన యెహోవాయేనన్న అతని విశ్వాస ప్రకటనలోనే అతని ఘనవిజయం ఖాయమైంది (17:37). నిజానికి ఒక గొర్రెపిల్లే కదా, పోతేపోయింది, అలాంటివి ఇంకా చాలా ఉన్నాయంటూ దావీదు తన ప్రాణాలు తాను దక్కించుకున్నా అడిగేవారు లేరు, తప్పు బట్టే వాళ్లు కూడా లేరు. నిజానికి ఆ రెండు క్రూర మృగాలు దావీదును గాయపర్చినా, అతన్ని చంపినా, ఒక్క గొర్రెపిల్లకోసం అంత సాహసం అవసరమా? అంటూ అంతా అతన్నే నిందించేవారు.

ఎందుకంటే గొర్రెపిల్లను వదిలేసి ప్రాణాలు దక్కించుకోవడమే తెలివి, గొర్రెపిల్ల కోసం ప్రాణాలకు తెగించడం తెలివి తక్కువ పని అన్నది లోకజ్ఞానం. కాని దావీదు తన ఉద్దేశ్యాలను నెరవేర్చే తన ఇష్టానుసారుడైన వాడంటాడు దేవుడు(అపో.కా.13:22). దావీదుకు దేవుని మనసు బాగా తెలుసు, అందుకే బలంలేని ఒక గొర్రెపిల్లకోసం తన ప్రాణాలకు తెగించాడు. యేసుక్రీస్తులో లోకానికి పరిచయం చేయబడిన దేవుడు కూడా పూర్తిగా దుర్బలులు, నిరాశ్రయులు, పీడితుల పక్షపాతి. ఆయన అనుచరులైన విశ్వాసులు కూడా అదే సిద్ధాంతాన్ని, స్వభావాన్ని కలిగి ఉండాలి. ఎంతసేపూ బలవంతులు, ధనికుల కొమ్ము కాస్తూ బలహీనులను చిన్న చూపుచూసే విశ్వాసులు, పరిచారకులు ఎన్నటికీ యేసు అనుచరులు కాలేరు.

లోకంలో వినిపించే ఆకలి కేకలు, పీడితుల ఆక్రందనలు, అంతటా కనిపించే బలవంతుల దోపిడీ, దౌర్జన్యం క్రైస్తవ విశ్వాసిని సవాలు చేసి అతన్ని ఆ దిశగా కార్యోన్ముఖుణ్ణి చేయకపోతే, ఆ విశ్వాసం లోపభూయిష్టమైనదనే అర్థం. అమెరికాలో నల్ల జాతీయుల బానిసత్వం నైతికంగా చాలా దారుణమనే అబ్రహాం లింకన్‌ తొలుత భావించేవాడు. కాని క్రైస్తవ విశ్వాసంలో ఎదిగే కొద్దీ అక్కడి బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్న భావన అతనిలో బలపడి చివరికి దేశంలోని తెల్లజాతీయులంతా ఒకవైపు వ్యతిరేకిస్తున్నా దేశాధ్యక్షుడిగా తెగించి నల్లజాతీయుల బానిసత్వాన్ని శాశ్వతంగా నిషేధిస్తూ, వారిని సమాన పౌరులను చేస్తూ జనవరి 1863లో ఆయన చేసిన చట్టం అమెరికా దేశ చరిత్రనే తిరగ రాసింది. చట్టాలను, దేశాలు, రాజ్యాల చరిత్రను కూడా తిరగరాసే శక్తిని దేవుడు విశ్వాసుల్లో నింపగలడు. ప్రజాస్వామ్యం, సమానత్వం, సమన్యాయం క్రైస్తవం ఈ ప్రపంచానికిచ్చిన బహుమానాలు. అలాంటి క్రైస్తవం లోనే దోపిడీ, దౌర్జన్యం, అసమానత్వం ప్రబలితే అదెంత అవమానకరం?

– రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top