దేవుని దృష్టిలో విశ్వాసమంటే క్రియలే!!

Devotional information by prabhu kiran - Sakshi

కారుచీకట్లో, కాకులు దూరని కారడవిలో దారితప్పిన వ్యక్తి గమ్యం చేరడు, ప్రాణాలతో కూడ ఉండడు. అందువల్ల అడవంతా ఎరిగిన ఒక మార్గదర్శకుడు అతని చెయ్యిపట్టుకొని సరైనదారిలోకి నడిపించడం అవశ్యం. దారి తప్పిన మానవాళిని దేవుడే యేసుక్రీస్తుగా అలా చెయ్యిపట్టుకొని దగ్గరుండి సరైన మార్గం లోనికి నడిపించడమే ‘రక్షణ’ అని బైబిల్‌ చెబుతోంది. గ్రీసు దేశానికి చెందిన తీతు అనే అన్యుడు అపొస్తలుడైన పౌలు పరిచర్య ద్వారా రక్షింపబడి అతని అనుచరుడిగా మారాడు. తానే బాగా శిక్షణనిచ్చిన తన అనుచరులను పౌలు తాను స్థాపించిన చర్చిల్లో కాపరులుగా నియమించాడు.

అలా క్రేతు అనే ద్వీపంలోని చర్చికి తీతును నాయకుడిగా నియమించి, ఆ చర్చిని నడిపించడానికి అవసరమైన సలహాలు, నియమావళితో కూడిన ఒక పత్రికను అతనికి రాశాడు. అదే తీతుకు రాసిన పత్రికగా కొత్తనిబంధన గ్రంథంలో చేర్చబడింది. క్రేతు లోని ఆనాటి చర్చికే కాదు, ఈనాటి ప్రతి చర్చికి, విశ్వాసికీ కూడా మార్గనిర్దేశనం చేసే పత్రిక అది. దేవుడు సమస్త దుర్నీతినుండి మనల్ని విమోచించి, సత్క్రియాసక్తి గల తన సొత్తయిన ప్రజలుగా మనల్ని చేసుకోవడానికి, మనల్ని పవిత్రపర్చడానికి తనను తాను సిలువలో అర్పించుకున్నాడంటుంది ఆ పత్రిక (తీతు 2:14). కొత్త నిబంధన సారాంశమంతా  ఈ ఒక్క వాక్యంలో ప్రస్తావించిన తీతు పత్రికను విశ్వాసులు ఎంత తరచుగా చదివితే అంత ప్రయోజనకరం.

తల్లిదండ్రుల పోలికలు, స్వభావాలు పిల్లల్లో కనిపించడం అనివార్యం. యేసుక్రీస్తు ప్రేమలో మలచబడి ఆ పరలోకపు తండ్రికి ఆత్మీయ సంతానంగా పరివర్తన చెందిన విశ్వాసుల్లో కూడా దేవుని ముద్ర, ఆనవాళ్లు కనిపించి తీరాలి. దేవుడు పరిశుద్ధుడని, ప్రేమామయుడని బైబిల్‌ నిర్వచిస్తోంది (పేతురు 1:15,16).అయితే  ఆయన ప్రేమ పూర్తిగా క్రియాత్మకమైనది. అందుకే ఎక్కడో పాతాళంలో పడిపోయిన మనిషిని వెదకడానికి లోకానికి యేసుక్రీస్తుగా మానవరూపంలో అతడున్న చోటికి దిగి వచ్చి మరీ అతన్ని రక్షించి ఆకాశమంత ప్రేమను చూపించాడు దేవుడు. దారితప్పిన మానవాళిని తిరిగి సంపాదించుకోవడం కోసం దేవుణ్ణి ఇలా కార్యోన్ముఖుణ్ణి చేసిన రెండు లక్షణాలు ఆయన పరిశుద్ధత,  ప్రేమ. అందుకే విశ్వాసులు పవిత్రతను, సత్క్రియాసక్తిని పెంపొందించే దైవిక ప్రేమను కలిగి ఉండాలంటుంది తీతు పత్రిక.

కానీ ఈ రోజుల్లో టార్చిలైటు వేసినా కనిపించని లక్షణాలు ఈ రెండే! పవిత్రతకు బదులు లౌక్యం, ప్రేమకు బదులు స్వార్ధం రాజ్యమేలుతున్న రోజులివి. దేవునికి ‘పాపం’ అత్యంత హేయమైన విషయమని బైబిల్‌ చెబుతున్నా అది అన్ని రూపాల్లోనూ తిష్టవేసుకొని కూర్చున్న పరిస్థితి చివరికి చర్చిల్లో, క్రైస్తవమంతటా కూడా కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. ఇక స్వార్థం సంగతి చెప్పనవసరం లేదు. అంతెందుకు, మొన్న కేరళలో వరదలొచ్చి అంతా కొట్టుకుపోయిన మహావిపత్తులో చర్చిలు, విశ్వాసులు ఏ మాత్రం స్పందించారు? అక్కడ కేరళలో హాహాకారాలు చెలరేగుతుంటే, ఇక్కడ చర్చిలన్నీ ఎప్పటిలాగే ఆరాధనలు, ప్రార్థనల్లో బిజీ!! అదేమంటే, ప్రార్థన చేస్తున్నామన్న జవాబొకటి. అవతల ఒక వ్యక్తి ఆకలితో అలమటిస్తూ  ఉంటే మనకున్నదేదో అతనికి పెట్టి ఆకలి తీర్చకపోగా, ప్రార్థన చేస్తున్నానంటే దాన్ని ప్రేమ అంటారా, స్వార్థమంటారా? దానికి తోడు ‘వాట్సప్‌’ లో వరదల ఫోటోలు, విశేషాలు మాత్రం జోరుగా ఫార్వర్డ్‌ చేసేసి గొప్ప సేవచేశామన్నట్టు పోజులు.

ఎంత తిన్నావు? ఎంత సంపాదించావు? అని కాక ఎంత పెట్టావు? అనడిగే దేవుడాయన. పౌలు ప్రియ శిష్యుడైన తీతుకు ఆ మనసుంది గనుకనే యెరూషలేములో కరువు తాండవిస్తున్నపుడు అక్కడి వారి సహాయార్ధం నిధుల సమీకరణకు  కొరింతి చర్చికి వెళ్లి వారి కానుకలు సమీకరించి తెచ్చి యెరూషలేములో బాధితులకు పంచాడు (2 కొరింథీ 8:16). మనం సత్క్రియల ద్వారా కాక దేవుని కృప వల్లనే రక్షింపబడ్డాము కాని రక్షింపబడిన తర్వాతి మన క్రియలు ఆయన ప్రేమను ఎంతగా ప్రకటించాయన్నదే దేవుని ప్రసన్నుని చేస్తాయి, ఆయన రాజ్యాన్ని నిర్మిస్తాయి. చర్చికి పరలోకంలో అలంకార వస్త్రాలుగా దేవుడిచ్చే ‘పరిశుద్ధుల నీతి క్రియలు’ అవే మరి!! (ప్రకటన 19:8).

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top