హృదయ పరివర్తన

Devotional information - Sakshi

సృష్టి ప్రారంభం నుండి మనిషి వెతుకుతూ ఉన్నాడు. సూక్ష్మమైన ప్రతి అంశంలో ఇంకా ఏదో దాగి ఉందని, దానిని కనుక్కోవడానికి మనిషి తపన పడుతూనే ఉన్నాడు. అయితే ఆ వెదికే క్రమంలో, తనను తాను పోగొట్టుకుంటున్నాడు. ఇంకా పోగొట్టుకుంటూ పోతే ఇక ఇక్కడ ఏమీ మిగలదు. తొలి దినాలనుండే ఇది ప్రారంభమైంది. అందుకే మారవలసింది హృదయమని గ్రహించిన దేవుడు ఆ హృదయాన్ని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఇందుకు ‘శిక్ష’ కంటే కూడా ‘శిక్షణ’ అవసరమని గ్రహించిన దేవుడు తన కుమారుడైన యేసును ఈ భూమి మీదకు పంపాడు.

యేసు బోధ ప్రారంభించాక హృదయాలను మార్చుకోవడానికి ఉపయోగపడే అనేక విషయాలను బోధిస్తూ వచ్చాడు. యేసు బోధ మొత్తాన్ని మనం పరిశీలిస్తే మనకు కనిపించేది ఒకటే అంశం (మత్తయి 19:19) నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించు అనే తత్వం మనకు కనిపిస్తుంది. ఈ మాటను ప్రభువు తన జీవితంలో నెరవేర్చి చూపాడు. అది మనలను కూడా చేయమని చెబుతున్నాడు. ‘ప్రేమ, క్షమాపణ, తగ్గింపు’ ఈ మూడే మనిషిని మనిషిలా ఉంచుతాయి. ఈ మూడు లక్షణాలు ప్రతి మనిషిలో ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. కోపంలో మనిషి తాను ఏం చేస్తున్నాడో మరచిపోతాడు.

తనను పట్టుకోవడానికి వచ్చిన సైనికులలో ఒకని చెవిని నరికిన తన శిష్యుడిని చూసి (మత్తయి 26:51,52) ‘కత్తి పట్టినవాడు కత్తిచేతే నశిస్తాడు. దానిని ప్రక్కన పడవెయ్యి’ అంటాడు. అంటే తనను తాను కాపాడుకోవడానికి యేసు కత్తిని వాడలేదు వాడొద్దు అని శిష్యులకు చెబుతున్నాడు. ఎవరైనా (మత్తయి 5:39) నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప కూడా చూపించమని బోధించాడు. ఈ మాటల వెనుక ప్రభువు మనుషుల హృదయాలను మార్చాలనే తపన కనబడుతుంది. మనలో ఎవరైనా ఒక తప్పు చేస్తే ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపించే వారే గానీ ఆ తప్పు చేసిన వారిని క్షమించి మార్చడానికి ఎవరూ ప్రయత్నించరు. అది సరికాదు.

– రవికాంత్‌ బెల్లంపల్లి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top