
మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలో గడ్డి జాతికి చెందిన ‘దర్భ’ ముఖ్యమైనది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. అపర కర్మలలో దర్భలు లేకుండా పని జరగదు. దీని ఆవిర్భావం వెనక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. అయితే, కూర్మ పురాణం ఏమి చెబుతోందంటే, విష్ణుమూర్తి కూర్మావతారంలో మంధర పర్వతాన్ని మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మం వంటిమీద ఉండే కేశాలు సముద్రంలో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశలుగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వల్ల అవి అంతటి పవిత్రతను సంతరించుకున్నాయంటుంది. వరాహ పురాణం. ఈ దర్భలు వరాహావతారంలో ఉన్న శ్రీమహావిష్ణువు శరీర కేశాలని చెబుతోంది. అందువలననే దర్భగడ్డికి ఎంతో ప్రత్యేకత ఉంది. దర్భలకు వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని ఒక నమ్మకం ప్రచారంలో ఉంది. దీన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు వంటి వాటికి మందుగా వాడుతున్నారు.
అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం పూర్వం నుంచి ఉన్న అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే... సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు అంటే అల్ట్రా వయొలెట్ రేస్ ఉత్పన్నమవుతాయట. అయితే, ఈ అతినీలలోహిత కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ ఇళ్లను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు ఎప్పుడో గుర్తించబట్టే, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితో కప్పుకొనమని శాసనం చేశారు. బహుశా అందుకే పూర్వం గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారనుకుంటా. కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
నేడు చంద్రగ్రహణం కాబట్టి, చాలామంది ఇళ్లలోని పచ్చడి జాడీలు, ఇతర ఆహార పదార్థాలపై నాలుగు దర్భపరకలు వేస్తారు. పెద్దవాళ్లు పాటించే ఈ ఆచారం అంత తేలికగా కొట్టిపారేయడానికి వీలు లేదు. ఎందుకంటే, నిల్వ ఉండే ఊరగాయలు వంటివి గ్రహణ సమయంలో రేడియేషన్ ప్రభావానికి పాడవుతాయట. వాటి మీద దర్భలు వేయడం వల్ల రేడియో ధార్మిక కిరణాల ప్రభావం ఉండదట.
వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లోఉండేలా చూసుకోవడం మరువకండి.