సైకిల్‌పై సఫారీల మధ్య సవారీ...! | Sakshi
Sakshi News home page

సైకిల్‌పై సఫారీల మధ్య సవారీ...!

Published Thu, Jul 3 2014 11:30 PM

సైకిల్‌పై సఫారీల మధ్య సవారీ...!

అమ్మ, నాన్న, అతడు... అదే అతడికి ప్రపంచం. ఆ ప్రపంచంలో అతడు ఉన్నట్టుండి ఒంటరి అయ్యాడు. అమ్మ, నాన్న ఇద్దరూ క్యాన్సర్‌తో మరణించారు. చాలాకాలంపాటు వారి జ్ఞాపకాలు అతడిని చుట్టుముట్టేవి. దాంతో వాళ్ల జ్ఞాపకాల నుంచి బయటపడాలని అనుకొన్నాడు. సుదూర ప్రయాణానికి సిద్ధం అయ్యాడు. అది కూడా సైకిల్ మీద. తను నివసించే దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నుంచి మొదలుపెట్టి దాదాపు ఎనిమిదినెలలుగా ఒక్కోదేశమూ దాటుతున్నాడు.

సఫారీల మధ్య సైకిల్ పై సంచరిస్తూ ఉన్నాడు. మొత్తం ఆఫ్రికాను చుట్టేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నాడు. అతడి పేరు డెరెక్ క్యూలిన్. జీవితం చాలా చిన్నది, దాన్ని భయాలతోనూ చింతలతోనూ గడిపేయడం అనవసరం అని భావించే మనుషుల్లో క్యూలిన్ కూడా ఒకరు.

గత ఏడాది నవంబర్ నుంచి బోత్స్వానా, టాంజానియాలను దాటి కెన్యా వరకూ చేరుకొన్నాడు. తన యాత్ర ద్వారా క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం విరాళాల సేకరణ ప్రయత్నమూ చేస్తున్నాడు క్యూలిన్. ఈ ప్రయాణానికి పూనుకోకపోతే జీవితంలో తాను ఎంతో కోల్పోయేవాడినని, ఇది అపూర్వమైన అనుభవమని క్యూలిన్ అంటాడు.
 

Advertisement
Advertisement