కంటిచూపుకూ.. మేని మెరుపుకూ 

 Coriander as a list of health benefits - Sakshi

గుడ్‌ ఫుడ్‌

మనకు కొత్తిమీర అంటే వంటపూర్తయ్యా, చివరన గార్నిషింగ్‌ కోసం ఉపయోగించే ఆకులని మాత్రమే తెలుసు. కానీ ఇది కేవలం రుచి, సువాసనల కోసం మాత్రమే అనుకుంటే పొరబాటే. కొత్తిమీరతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను ఒక జాబితాగా రాస్తే అది బారెడంత పొడవు. కొత్తిమీరతోమనకు సమకూరే లాభాల్లో ఇవి కొన్ని మాత్రమే...  

కొత్తిమీరలో విటమిన్‌–ఏ పుష్కలంగా ఉండటం వల్ల అది కంటి చూపును మెరుగుపరుస్తుంది. మాక్యులార్‌ డిజనరేషన్‌ వంటి కంటివ్యాధులను నివారిస్తుంది. ఇందులో విటమిన్‌–బి కాంప్లెక్స్‌కు చెందిన బి1, బి2, బి3, బి5, బి6 వంటి అనేక విటమిన్లు కూడా ఎక్కువే. ఇవన్నీ మనకు మంచి వ్యాధినిరోధక శక్తిని ఇస్తాయి.  విటమిన్‌–సి కూడా కొత్తిమీరలో పుష్కలంగా ఉండటం వల్ల అది శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి ఎన్నో రకాల క్యాన్సర్‌లను నివారిస్తుంది. కొత్తిమీరలో విటమిన్‌–ఇ పాళ్లు కూడా ఎక్కువే. మేనికి మంచి నిగారింపును ఇవ్వడానికి, చర్మంపై ముడతలను తొలగించడానికి ఇది బాగా తోడ్పడుతుంది.  దీర్ఘకాలం యౌవనంగా ఉంచడానికి కొత్తిమీర ఎంతగానో సహాయం చేస్తుంది. 

కొత్తిమీరలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు... తాము తినే అన్ని పదార్థాలను కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే... రుచికరమైన రీతిలో తమ అనీమియా సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందులోని పొటాషియమ్‌ రక్తపోటును నివారిస్తుంది. తద్వారా గుండెజబ్బులనూ అరికడుతుంది. కొత్తిమీర కిడ్నీ సమస్యలను సమర్థంగా నివారిస్తుంది. మెగ్నీషియమ్, జింక్‌ వంటి ఖనిజాలు కొత్తిమీరలో చాలా ఎక్కువే. అందుకే జుట్టు మంచి మెరుపుతో నిగనిగలాడేందుకు కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీరలో క్యాల్షియమ్‌ కూడా ఎక్కువ. అందుకే అది ఎముకలను పటిష్టంగా మార్చి, వాటి ఆరోగ్యానికి బాగా దోహదపడుతుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top