ఇవి తింటే కీళ్లనొప్పులు తగ్గుతాయి...

Consuming One Gram of Fish Oil Daily Could Reduce Arthritis - Sakshi

ఆధునిక జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రపంచంలోని 18 శాతం మంది మహిళలు, 9.6 శాతం మంది పురుషులు ఆర్థటైటిస్‌(కీళ్లనొప్పులు)తో బాధ పడుతున్నట్లు పలు ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నాయి. 60 ఏళ్లకు పైబడిన వ్యక్తుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. అయితే ఆర్థటైటిస్‌ సమస్యతో బాధపడేవారికి విముక్తి కలిగించేందుకు యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ సర్రే పరిశోధకులు పరిష్కారం కనుగొన్నారు. గతంలో చేసిన 68 పరిశోధనలను విశ్లేషించి కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొం‍దేందుకు పలు అంశాలు వెల్లడించారు.

రోజుకు ఒక గ్రామ్‌ చేప నూనె(ఫిష్‌ ఆయిల్‌) క్యాప్యూల్స్‌ తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు.. హృద్రోగ సమస్యలు కూడా నివారించవచ్చని పేర్కొన్నారు. చేపనూనెలో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు కీళ్ల వాపును తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు. ఈ విషయాలను రుమటాలజీ జర్నల్‌లో ప్రచురించారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంతో పాటు.. వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని సర్రే యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మార్గరెట్‌ రేమాన్‌ తెలిపారు.

విటమిన్‌- కె సమృద్థిగా ఉంటేనే..
పాలకూర, కొత్తిమీర, క్యాబేజీలలో విటమిన్‌- కె అధికంగా ఉంటుం‍ది కాబట్టి ఆహారంలో తప్పనిసరిగా ఇవి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తద్వారా కీళ్లనొప్పులకు చెక్‌ పెట్టవచ్చన్నారు. విటమిన్‌- కె లోపం ఉన్నవారిలో  ఎముకల పెరుగుదల మందగిస్తుందని.. అంతేకాకుండా ఇది ఆస్టియో ఆర్థటైటిస్‌కు దారి తీస్తుందని పేర్కొన్నారు.

బరువు తగ్గితేనే..
ఊబకాయం వల్ల కీళ్లపై బరువు పడటంతో పాటు శరీరంలోని వ్యవస్థాపక మార్పులపై ప్రభావం కూడా చూపుతుంది. డైట్‌ పాటించడంతో పాటు.. ఏరోబిక్‌ ఎక్సర్‌సైజులు చేయడం ద్వారా శరీర బరువు తగ్గించుకుంటే ఆర్థటైటిస్‌ను కొద్దిమేర తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top